Man Arrested For Multiple Marriages in Eluru : సినిమాల్లో చూపించినట్లు నకిలీ కుటుంబ సభ్యులు, ఆస్తులు, సర్కార్ నౌకరీ అంటూ నమ్మిస్తాడు. తనకు ఇంకా పెళ్లి కాలేదని బుకాయిస్తాడు. ఇలా తన మాటల గారడీతో ఇప్పటివరకు నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న నిత్య పెళ్లికొడుకును ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఎస్పీ కార్యాలయంలో సోమవారం మీడయా సమావేశంలో ఎస్పీ ప్రతాప్ శివకిశోర్ నిందితుడి వివరాలు వెల్లడించారు.
తిరుపతి జిల్లా వెంకటగిరి మండలం బంగారుపేటకు చెందింన అంశం అనీల్ బాబు అలియాస్ కల్యాణ్ రెడ్డి ప్రస్తుతం ఖమ్మం జిల్లా మధిరలోని టీచర్స్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. అతను 9వ తరగతి వరకు చదివాడు. ఓ మ్యాట్రిమోనీలో కల్యాణ్ రెడ్డిగా నమోదు చేయించుకున్నాడు. దీని ద్వారా తనను సంప్రదించిన వారికి ఫోన్ చేసి, కల్యాణ్ రెడ్డి (వరుడు) తండ్రిని మాట్లాడుతున్నాని చెప్తాడు. 'మా అబ్బాయి ఇస్రోలో హెచ్ఆర్ ఇంఛార్జీ. నేను, నా భార్య ఇంజినీర్లుగా జాబ్ చేస్తున్నాం. మాకు 100 ఎకరాల భూమి ఉంది. విల్లాలు, బంగ్లాలు ఉన్నాయి. మా అబ్బాయి పెళ్లి చూపులకు వస్తాడు.' అని మాట్లాడేవాడు. తర్వాత పెళ్లిచూపులకు వెళ్లేవాడు. తాను డబ్బున్న వాడినని నమ్మించడానికి హైదరాబాద్ శివారు చేవెళ్లలో ఓ ఫామ్‌హౌస్, బెంగళూరులో ఓ విల్లాను అద్దెకు తీసుకున్నాడు. అవి తన సొంతం అని చెప్పేవాడు. ఓ వ్యక్తిని, పెళ్లి చేసేందుకు పంతులును తన వెంటే ఉంచుకునేవాడు.
అనుమానంతో ఫిర్యాదు చేస్తే అసలు గుట్టురట్టు : 2023లో ఐదో పెళ్లి చేసుకునేందుకు ప్లాన్ వేసిన అనీల్ బాబు భీమడోలు మండలం గుండుగొలనుకు చెందిన గుండా లక్ష్మీకుమారిని సంప్రదించాడు. ఆమె రెండో కుమార్తెను పెళ్లి చేసుకుని, మూడో కుమార్తెకు ఇస్రోలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించాడు. దఫదఫాలుగా వారి నుంచి రూ.9.53 లక్షలు తీసుకున్నాడు. తన వద్ద పని చేస్తున్న తుంగా శశాంక్ అనే మహిళతో ఇస్రోలో ఉద్యోగం పేరిట ఇంటర్వ్యూ చేయించి నకిలీ అపాయింట్‌మెంట్ ఆర్డర్ కూడా ఇప్పించాడు. కానీ అదంతా మోసం అని తెలుసుకున్న బాధితురాలు భీమడోలు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
దీనిపై సీఐ విల్సన్ దర్యాప్తు చేపట్టారు. డీఎస్పీ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో గుండుగొలను సమీపంలో నిందితులను అరెస్టు చేశారు. అనీల్‌బాబు గతంలో పెళ్లిళ్లు చేసుకున్న వారి నుంచి ఉద్యోగాలిప్పిస్తామని మోసగించి, రూ.1.50 కోట్ల వరకు కాజేసినట్లు గుర్తించారు. ప్రధాన నిందితుడు అనీల్‌బాబు, తుంగా శశాంక్, కారు డ్రైవర్ హేమంత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ.2 లక్షల నగదు, కారు, సెల్‌ఫోన్లు, 13 సిమ్ కార్డులు, నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్లు, ల్యాప్‌టాప్‌లు, డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.
ఫేస్బుక్లో పరిచయం - పెళ్లి పేరుతో యువతిపై అత్యాచారం - ఆపై ఏం జరిగిందంటే?