Maheshkumar Goud Chitchat : ఇతర పార్టీల ఎమ్మెల్యేల చేరికతో స్థానిక నేతలు ఇబ్బంది పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, కొత్త పాత నేతల మధ్య సమన్వయం కోసం ప్రయత్నిస్తున్నట్లు నూతన పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ పేర్కొన్నారు. హైడ్రా, మూసీ అభివృద్ధితో సామాన్యులకు కొంత ఇబ్బంది అయినా హైదరాబాద్ నగర ప్రజల మొత్తానికి లాభం జరుగుతుందని ఆయన తెలిపారు.
పీసీసీ కార్యవర్గ ప్రక్షాళన : ఇవాళ గాంధీభవన్‌లో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పీసీసీ కార్యవర్గంలో మూడు నుంచి అయిదు వర్కింగ్ ప్రెసిడెంట్ల పదవులు ఉంటాయని ఆయన వెల్లడించారు. పాత పీసీసీ కార్యవర్గం, నూతన పీసీసీ అధ్యక్షుడి నియామకంతో రద్దు అయ్యిందని, పీసీసీ కార్యవర్గాన్ని పూర్తిగా ప్రక్షాళన చేస్తామని స్పష్టం చేశారు.
జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల పదవులు రద్దు కావన్న మహేశ్‌కుమార్ గౌడ్, పీసీసీ కార్యవర్గం తర్వాత డీసీసీ అధ్యక్షుల గురించి ఆలోచిస్తామని తెలిపారు. హైదరాబాద్ నగర కాంగ్రెస్‌లో మార్పులు, చేర్పులు ఉంటాయని ఆయన వివరించారు. ఇన్ని రోజులు మల్లన్న సాగర్ బాధితుల కన్నీళ్లు హరీశ్‌రావుకు కనిపించలేదా అని ఆయన ప్రశ్నించారు. మల్లన్న సాగర్ నిర్వాసితులను పరామర్శించేందుకు తాము వెళ్తే, తమను బీఆర్ఎస్ ప్రభుత్వం అరెస్ట్ చేసిందని దుయ్యబట్టారు. డీసీసీలుగా ఎమ్మెల్యేలకు బాధ్యతలు ఇవ్వాలనే ప్రతిపాదన కూడా వచ్చినట్లు ఆయన వివరించారు.
మరోవైపు ఇవాళ గాంధీభవన్‌లో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌తో, 2017 గురుకుల వ్యాయామ ఉపాధ్యాయులు సమావేశమయ్యారు. ఉపాధ్యాయ నియమాకాలపై తమ సమస్యను విన్నవించారు. ఇప్పటి వరకు తమకు నియామక పత్రాలు ఇవ్వలేదని, ఇప్పించేట్లు చూడాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు. వెంటనే స్పందించిన మహేశ్‌కుమార్ గౌడ్ సంబంధిత అధికారులకు ఫోన్ చేసి నియామక పత్రాలు ఇచ్చేలా చూడాలని స్పష్టం చేశారు. అనంతరం విద్యాశాఖ అధికారులు కూడా సానుకూలంగా స్పందించడంతో, చొరవ చూపిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు, సీఎం రేవంత్ రెడ్డిలకు వారు కృతజ్ఞతలు తెలిపారు.