Madanapalle Sub Collector office Case: మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం సాగించిన అరాచకాలు, అనుచరుల భూదందాలు ఒక్కొక్కటీ వెలుగు చూస్తున్నాయి. మదనపల్లె సబ్‌కలెక్టర్ కార్యాలయంలో దహనమైన రెవెన్యూ దస్త్రాల కేసు విచారణలో విస్తుగొలిపే విషయాలు వెలుగుచూస్తున్నాయి. పెద్దిరెడ్డి సోదరుడు ఎమ్మెల్యే ద్వారకానాథ్‌రెడ్డి, ఆయన అనుచురులు సాగించిన భూకబ్జాలపైను ప్రభుత్వం వెలికితీస్తుందన్న భయంతోనే వైఎస్సార్సీపీ నాయకులు అధికారులపై ఒత్తిడి తెచ్చి కీలక దస్త్రాలు తగలబెట్టించినట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.
ఈ కేసు విచారణను స్వయంగా చేపట్టిన రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రభుత్వ కార్యదర్శి సిసోదియా కీలక విషయాలు వెల్లడించారు. దస్త్రాల దహనం ఘటనలో అనుమానితుడైన వైఎస్సార్సీపీ నాయకుడు మాధవరెడ్డి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారని తెలిపారు. ఈఘటనతో సంబంధం ఉన్న ఏడుగురు రెవెన్యూ సిబ్బంది పాత్రపైనా విచారణ జరుపుతున్నామన్నారు. ఫోరెన్సిక్ నివేదిక రాగానే బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో దాదాపు 2.16 లక్షల ఎకరాల భూములకు 22A తొలగించి ఫ్రీ హోల్డ్‌లో పెట్టారని సిసోదియా తెలిపారు. వీటన్నింటిపైనా సమగ్ర దర్యాప్తు కొనసాగుతోందన్నారు.
మదనపల్లి ఘటనలో ఇంటిదొంగలపైనే అనుమానం - సిసోదియా - Madanapalle Fire Accident Case
అగ్నిప్రమాదం జరిగిన రోజు ఆదివారం సెలవు అయినప్పటికీ సీనియర్ అసిస్టెంట్ గౌతమ్‌తేజ్ సబ్‌కలెక్టర్ కార్యాలయానికి ఎందుకు వచ్చారన్న దానిపై పోలీసులు ఆరా తీశారు. పోలీసుల విచారణలో తొలుత దబాయించిన గౌతమ్... ఆ తర్వాత నోరు విప్పినట్లు తెలిసింది. మదనపల్లె ఆర్డీవో హరిప్రసాద్‌ను ఈనెల 20న ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన స్థానంలో కొత్తగా IAS అధికారి మేఘస్వరూప్ సోమవారం బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. దీంతో పలమనేరులో ఉన్న గౌతమ్‌ను ఆర్డీవో హరిప్రసాదే హడావుడిగా మదనపల్లెకు పిలిపించినట్లు తెలిసింది.
ఉదయం నుంచి రాత్రి వరకు అక్కడే: కొత్త ఆర్డీవో బాధ్యతలు చేపడితే దస్త్రాల ఆధారాలు మాయం చేయడం కుదరదని, అందుకే ఆదివారం అయినప్పటికీ ఉదయం నుంచి రాత్రి 10 గంటల 40 నిమిషాల వరకు హరిప్రసాద్, గౌతమ్ కార్యాలయంలోనే ఉన్నట్లు సమీపంలో ఉన్న సీసీకెమెరాల ఆధారంగా తెలిసింది. ఆ రోజంతా వారు కార్యాలయంలోనే ఉండి అన్ని ఫైళ్లు క్లియర్ చేసినట్లు విచారణలో తేలింది. గౌతమ్ ఇచ్చిన వివరాల మేరకు ఆర్డీవోను విచారించగా తాను సీనియర్ అసిస్టెంట్ ను పిలవనేలేదని, దాటవేసే ధోరణిలో సమాధానం చెప్పినట్లు తెలిసింది. ఆ రోజు రాత్రి ఫైళ్లన్నీ క్లియర్ చేసిన తర్వాత ఆర్డీవో పక్కనే ఉన్న ప్రభుత్వం నివాసంలోకి వెళ్లిపోగా, సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తిరిగి వెళ్లిపోయారని తెలిసింది. వారిద్దరూ వెళ్లిన కొంతసేపటికే కార్యాలయంలో మంటలు చెలరేగినట్లు సమాచారం.