Machilipatnam YSRCP Leader Perni Kittu: మచిలీపట్నం అరాచక శక్తులకు అడ్డాగా మారింది. గంజాయి, రౌడీ బ్యాచ్‌లకు ఆవాసంగా తయారైంది. అధికార పార్టీ నేతల అండదండలతో అల్లరిమూకలు రెచ్చిపోతున్నాయి. ప్రతిపక్షాలపై దాడులు చేస్తున్నారు. నిన్నమొన్నటి వరకు పూర్తి స్థాయి హవా సాగించిన అధికార పార్టీ నేతలు కోడ్ అమలులోకి రావడంతో పోలీసులు తమ మాట వినడం లేదంటూ పోలీస్‌స్టేషన్ ఎదుటే ధర్నాకు దిగుతున్నారు.
గంజాయి ముఠాకు అండగా నేతలు రోడ్డెక్కడం పోలీసు వర్గాల్లో సైతం చర్చనీయాంశమైంది. ఎక్కువ మంది పోలీసులు అధికార పార్టీ నేతల అడుగులకు మడుగులొత్తుతున్నారు. యువనేత చెప్పినదానికి డూడూ బసవన్నలా తలాడిస్తున్నారు. ఆ యువనేత తన తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎస్పీ స్థాయి అధికారినే చెప్పుచేతల్లో పెట్టుకున్నారు. ఆ ఎస్పీ సైతం అధికార పార్టీ కార్యకర్తలా వ్యవహరించడంతో ఇటీవలే ఈసీ వేటేసింది.
అవినీతి, అక్రమాల్లో ఆ వైఎస్సార్సీపీ నేత "రాజా ది గ్రేట్"! - YSRCP Leader family Irregularities
తెలుగుదేశం, జనసేన కార్యకర్తలపై దాడులు: గంజాయికి బందరు అడ్డాగా మారింది. పోర్టు కేంద్రంగా బందరు ముఖద్వారంగా జిల్లాలోకి కోట్ల విలువైన గంజాయి దిగుమతి అవుతోందని తెలుస్తోంది. పోలీసులు దీనిపై దృష్టి సారించడం లేదు. గంజాయి మత్తులో తూగుతున్న యువత అధికార పార్టీ యువనేత అనుచరులుగా చెలామణి అవుతూ తెలుగుదేశం, జనసేన కార్యకర్తలపై ఇష్టానుసారం దాడులకు తెగబడుతున్నారు. బందరు ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య ఈసారి ఎన్నికల్లో పోటీ చేయకుండా తన వారసుడు పేర్ని కృష్ణమూర్తిని బరిలోకి దింపారు. నాని మంత్రిగా ఉన్నప్పటి నుంచే బందరులో కృష్ణమూర్తి అధికారం చెలాయించడం ప్రారంభించారు.
అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ పాలనలో నియోజకవర్గానికి అనధికారిక ఇన్‌ఛార్జిగా ఇటు పార్టీలో పెత్తనం సాగించారు. ఎంపీ బాలశౌరిని బందరు నియోజకవర్గంలో కదలకుండా కట్టడి చేశారు. ఎంపీ నిధులపై కూడా కృష్ణమూర్తే ఆధిపత్యం కొనసాగించడంతో పంచాయితీ సీఎం జగన్ దగ్గరికి వెళ్లింది. ఈ క్రమంలోనే బాలశౌరి వైసీపీని వీడి, జనసేనలో చేరారు. మరోవైపు బందరులో తెలుగుదేశానికి గట్టి పట్టుంది. దాన్ని దెబ్బతీసేందుకు టీడీపీ కార్యకర్తలపై దాడులకు గంజాయి బ్యాచ్‌ను రంగంలోకి దించారు.
గోదావరి జిల్లాల్లో ఆయన ఓ అరాచక 'గ్రంథం'! - YCP leader irregularities
పోలీసులు సైతం మాట వినాల్సిందేనా: జిల్లా ఎస్పీ కూడా అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహారిస్తూ, యువనేతకు జీహుజూర్ అనడం చర్చనీయాంశమైంది. ఆయన హయాంలో తెలుగుదేశం శ్రేణులపై దాడులు పెరిగిపోయాయి. దీనిపై ఫిర్యాదు చేసి చర్యలు తీసుకోవాలని కోరేందుకు టీడీపీ నాయకులు అపాయింట్‌మెంట్ అడిగినా ఎస్పీ ఇచ్చేవారు కాదు. ఇటీవల ఆయన బదిలీపై వెళ్లారు. తర్వాత ఈసీ వేటు వేసింది. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్రపై హత్యానేరం మోపి జైలుకు పంపారు.
కొన్ని నెలల కిందట ఎస్పీ జాషువా ఆధ్వర్యంలో కొల్లు రవీంద్రను ముందు జాగ్రత్తగా అదుపులోకి తీసుకుని ఒక రాత్రీ, పగలూ దాదాపు అయిదారు పోలీసుస్టేషన్లు తిప్పారు. ఆయన భార్య హైకోర్టును ఆశ్రయించిన తర్వాత రవీంద్రను విడిచిపెట్టారు. ఎస్పీ జాషువా హయాంలోనూ పోలీసులు వైసీపీ నేతల మాటలే వేదవాక్కుగా భావించారు. బందరు పరిధిలోని 5 పోలీస్‌స్టేషన్లలోనూ అధికార పార్టీ నేత తనకు అనుకూలురునే నియమించుకున్నారు. వారితో తెలుగుదేశం కార్యకర్తలపై కేసులు పెట్టించారు. దీంతో ఫిర్యాదు చేయడానికి వెళ్లాలంటేనే టీడీపీ కార్యకర్తలు భయపడే పరిస్థితి తలెత్తింది. ధైర్యం చేసి, ఫిర్యాదివ్వడానికి వెళ్లినా పోలీసులు వారిపైనే ఎదురు కేసులు పెట్టేవారు.
పైకి నీతిమంతుడిలా మాటలు - మూడోకంటికి తెలియకుండా అక్రమ దందాలు - YSRCP Leader Irregularities