Low Pressure Rains in Andhra Pradesh : అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో పలు చోట్ల జోరు వానలు కురుస్తున్నాయి. ఎన్టీఆర్ జిల్లాలో వాగులు, వంకలన్నీ పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇళ్లు, పల్లపు ప్రాంతాలు నీట మునిగాయి. రహదారుల పైకి నీరు చేరి ప్రజలు అవస్థలకు గురయ్యారు. ఎగువ నుంచి వచ్చిన నీటితో కుంటలు, చెరువులు, జలాశయాలు నిండుకుండలా మారాయి.
రైతులకు క'న్నీరు' - లంక భూముల్లో కుళ్లిన పంటలు - Lanka villages farmers problems
వేల క్యూసెక్కుల నీరు దిగువకు : ఏజెన్సీలో రెండ్రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవన స్తంభించింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం, బుట్టాయిగూడెం, పోలవరం, జీలుగుమిల్లి, మండలాల్లో పాలచర్ల వాగు, అశ్వరావుపేట వాగు, జల్లేరు వాగులతో పాటు, తూర్పు కాలువ, గుంజవరం వాగు, దొండపూడి వాగులు ఉప్పొంగుతున్నాయి. వీటివల్ల రాకపోకలు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. కొవ్వాడ జలాశయం నుంచి వెయ్యి క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కొంగువారి గూడెంలో కరాటం కృష్ణమూర్తి ఎర్ర కాలువ జలాయం నుంచి నాలుగు గేట్లను ఎత్తి 6,500 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువ విడుదల చేస్తున్నారు.
నిండు కుండల జలాశయాలు : కృష్ణానది పరివాహకంలోని జలాశయాలు నిండు కుండలను తలపిస్తున్నాయి. ఆల్మట్టి నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు కృష్ణమ్మ పరుగులు తీస్తోంది. ప్రకాశం బ్యారేజీ నుంచి 3 లక్షల 10 వేల క్యూసెక్కులకు మించి నీరు దిగువకు విడుదలవుతోంది. మొత్తం 70 గేట్లను తెరిచి నీరు దిగువకు వదులుతున్నారు. కేఈబీ, రైవస్, బందరు కాలువలకు 13వేల 768 క్యూసెక్కుల నీటిని అందిస్తున్నారు. కృష్ణమ్మ జల సవ్వడి చెవులారా వినేందుకు, కనులారా నీటి ఉద్ధృతిని తిలకించేందుకు.. జలదృశ్యాన్ని తమ మదిలోనూ చరవాణిల్లోనూ బంధించేందుకు ఎక్కువ మంది సందర్శకులు ప్రకాశం బ్యారేజీ వద్దకు చేరుకుంటున్నారు. సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేస్తున్నారు.
విద్యుత్ ఉత్పత్తి కోసం 15 వేల క్యూసెక్కులు : పల్నాడు జిల్లా పులిచింతల ప్రాజెక్టుకు నాగార్జునసాగర్ నుంచి వరద కొనసాగుతోంది. అధికారులు 11 గేట్లు ఎత్తి 2లక్షల 30 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్ నుంచి పులిచింతలకు 2.45 లక్షల క్యూసెక్కుల వరద వస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో విద్యుత్ ఉత్పత్తి కోసం 15 వేల క్యూసెక్కులు మళ్లించారు. మిగతా నీటిని గేట్లు ఎత్తి ప్రకాశం బ్యారేజికి పంపిస్తున్నారు. పులిచింతల జలాశయం పూర్తి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 31.84 టీఎంసీలు ఉంది. వరద వస్తుండటంతో నీటి మట్టాల్ని అలాగే కొనసాగిస్తూ వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు పంపిస్తున్నారు. వరద తగ్గుముఖం పట్టాక ప్రాజెక్టును పూర్తిస్థాయిలో నింపుతామని అధికారులు వెల్లడించారు.
సాహసోపేతంగా వాగులు దాటుతూ : అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు డివిజన్‌లో బుధవారం భారీ వర్షం కురవగా వీఆర్ పురం మండలం రేఖపల్లి అన్నవరం మధ్య రహదారిపై వరద నీరు ఉద్ధృతంగా ప్రవహించింది. ముమ్మిడివరం వ్యవసాయ పనులకు వెళ్లిన కూలీలు 200 మంది సాహసోపేతంగా అన్నవరం వాగును దాటారు. అతి కష్టం మీద ఒకరినొకరు చేతులు పట్టుకుని ముందుకు కదిలారు.
వర్షాలకు అస్తవ్యస్తమైన గిరిజనుల జనజీవనం - వాగులు దాటేందుకు అవస్థలు - Tribals Suffering to Rains