Liquid Marijuana Seized in West Godavari District: మంచి పనులు చేసేందుకు ఆలోచన రాదు కానీ అక్రమంగా సంపాదించేందుకు ఐడియాలు మాత్రం కోకొల్లలు. రోజుకో కొత్త ఆలోచనతో పోలీసులను బురిడీ కొట్టిస్తున్నారు గంజాయి స్మగ్లర్లు. గంజాయిని వివిధ తరహాలో స్మగ్లింగ్ చేసి అడ్డదారిలో సంపాదించడమే కాకుండా యువకుల జీవితాలను నాశనం చేస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వం గంజాయి స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు ఉక్కుపాదం మోపింది. అడుగడుగునా చెక్‌పోస్టులు పెట్టి తనిఖీలు ముమ్మరం చేసింది. దీంతో స్మగ్లర్స్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు కొత్త దారులు వెతుకుతున్నారు. ఈ ఘటన చూస్తే స్మగ్లర్ల అతితెలివి తెలుస్తోంది. కానీ వారి పప్పులు ఉడకక కటకటాల పాలయ్యారు.
గంజాయి విక్రయించే ముఠాలు పోలీసులకు దొరకకుండా ఉండేందుకు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. గంజాయిని లిక్విడ్ రూపంలో తయారు చేసి చిన్న చిన్న బాటిళ్లలో పెట్టి విక్రయిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం ముత్యాలపల్లి గ్రామంలో లిక్విడ్ గంజాయి విక్రయిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. పది మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 19 ప్లాస్టిక్ డబ్బాలలో నిల్వ చేసిన 138.198 మిల్లీ గ్రాముల లిక్విడ్ గంజాయిని, 8 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
10 మంది నిందితులు కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందినవారని నరసాపురం డీఎస్పీ శ్రీవేద తెలిపారు. వీరికి గంజాయిని సరఫరా చేస్తున్న ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడని అన్నారు. అతన్ని త్వరలోనే పట్టుకుని గంజా సరఫరా చేస్తున్న మరికొందరిని అరెస్ట్ చేస్తామని తెలిపారు. గంజాయి ఆకులను నీటిలో కలిపి వేడి చేయడం ద్వారా లిక్విడ్ గంజాయిని తయారు చేసి చిన్న చిన్న డబ్బాలలో పెట్టి యువతకు విక్రయిస్తున్నారని డీఎస్పీ తెలిపారు.
మాకు వచ్చిన సమాచారం మేరకు ముత్యాలపల్లి గ్రామానికి వెళ్లాం. అక్కడ రెండు కవర్లలో లిక్విడ్ గంజాయిని స్వాధీనం చేసుకున్నాం. 19 ప్లాస్టిక్ బాటిళ్లలో ఈ గంజాయి నింపి సరఫరా చేసేందుకు సిద్ధం చేశారు. 10 మందిని అదుపులోకి తీసుకున్నాం. మరొకరు పరారీలో ఉన్నారు. నరసాపురం డివిజన్ పరిధిలో గంజాయిపై ప్రత్యేక నిఘా పెట్టి టెక్నాలజీ ఉపయోగించి గంజాయి రవాణా వినియోగం జరగకుండా చూస్తున్నాం. గంజాయి నిర్మూలనకు ప్రజలు కూడా తమకు సహకరించాలి. -శ్రీవేద, నరసాపురం డీఎస్పీ