Leopard Roaming in Fields at Satya Sai District : సత్యసాయి జిల్లా నల్లచెరువు మండలంలో చిరుత అడుగులు కలకలం రేపాయి. మండలంలోని బొమ్మిరెడ్డిపల్లి సమీపంలో ఉన్న పంట పొలాల్లో గ్రామస్థులు చిరుతను చూశారు. దీంతో వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అటవీశాఖ అధికారులతో కలిసి నల్లచెరువు పోలీసులు గ్రామ పరిసరాలలో చిరుత ఆచూకీని కనిపెట్టేందుకు వెతికారు.
పొలాల్లో చిరుత సంచరించినట్లు కాలి ముద్రల ద్వారా తెలిసింది. అది పెద్దపులిగా గ్రామస్థులు భావిస్తున్నారు. దీంతో కాలి ముద్రల ద్వారా నల్లచెరువు మండలంలో సంచరించేది చిరుతే అని అటవీ శాఖ అధికారులు నిర్థారించారు. రాట్నాలపల్లి, పి.కొత్తపల్లి, జోగన్నపేట గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. చిరుత గురించి ఎలాంటి సమాచారమైనా వెంటనే అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
రెండు రోజుల క్రితం వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు మండలం గండికోట కొట్టాలపల్లె శివారులో చిరుత పులి సంచారం కలకలం రేపింది. చిరుతను చూసినట్లు అక్కడి గొర్రెల కాపరులు తెలిపారు. వారు పెంచుకుంటున్న నాలుగు మేక పిల్లలను చిరుత కొరికి హతమార్చిందని వాపోయారు. అంతకుముందు ముద్దనూరు ఘాట్లో చిరుత సంచారంపై వదంతులు వ్యాపించాయి. అటవీశాఖ అధికారులను ముద్దనూరు వదంతులపై వివరణ కోరగా అలాంటిది ఏం లేదని కొట్టి పారేశారు.
ప్రస్తుతం గండికోట అడవుల్లో చిరుత సంచరిస్తూ కనిపించడంతో స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. గాలి మరల పరిశ్రమలో పని చేస్తున్న కార్మికులు రాత్రి పని ముగించుకొని గండికోట మీదుగా కొట్టాలపల్లికి వెళుతుండగా చిరుత కనిపించడంతో దాన్ని ఫొటో తీసి సామాజిక మధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌ను చూసైనా అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మనుషులపై దాడికి దిగక ముందే చిరుతను పట్టుకుని జూకు తరలించాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.
మహానందిలో బాబోయ్ పులి - సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు - Chirutha Samcharam in Mahanandi