Leader Encroached on Pond With Power of YSRCP: గుంటూరు జిల్లాలో ఓ నేత ఏకంగా చెరువునే ఆక్రమించారు. అందులో పంటలు సాగు చేయడమే కాకుండా చెరువు కట్టను దున్నేసుకుని దశాబ్దాలుగా ఉన్న దారిని మూసివేశారు. రైతులు ఎవ్వరూ అటువైపు రావడానికి వీల్లేదంటూ పెత్తనం చెలాయిస్తున్నాడు. గతంలో వైఎస్సార్సీపీలో క్రియాశీలకంగా ఉంటూ దురాక్రమణకు తెగబడ్డ ఆ నాయకుడు ఇప్పుడు తన అక్రమాల రక్షణ కోసం ప్రస్తుత అధికార పార్టీ నేతల వెంట తిరుగుతున్నారు.
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం నిమ్మగడ్డవారిపాలెం సమీపంలో బాటసారుల దాహార్తి తీర్చేందుకు కొన్ని దశాబ్దాల కిందట ఏకదండయ్య అనే వ్యక్తి చెరువు నిర్మించారు. రెవెన్యూ రికార్డుల ప్రకారమూ సర్వే నంబరు 294లో 14.57 ఎకరాలను చెరువుగానే పేర్కొన్నారు. కానీ కొన్ని సంవత్సరాల క్రితం వైఎస్సార్సీపీ నేత ఒకరు చెరువుపై కన్నేశారు. చెరువులో పిచ్చిమొక్కలు శుభ్రం చేయిస్తాననే సాకుతో ఆక్రమణ మొదలుపెట్టారు. మెరకగా ఉన్నచోట పంటలు సాగు చేస్తూ వచ్చారు.
'స్వర్ణాల చెరువును ఆక్రమించెయ్ - ఇల్లు కట్టేయ్' వైసీపీ నేతల తీరుపై నోరు మెదపని అధికారులు
కొన్నాళ్లు ఆగాక చెరువే కాదు, చెరువు భూమీ తనదేనని అసలు రూపాన్ని బయటపెట్టారు. చెరువులో నీళ్లను గ్రామంలోని రైతులు ఎవర్నీ వాడుకోనీయడం లేదు. చెరువే కాదు చెరువు చూట్టూ ఆక్రమణలకూ ఆ నాయకుడు తెరతీశారు. తన ఆక్రమణలను ఎవరూ ప్రశ్నించకుండా చుట్టూ ఉన్న పొలాలు కౌలుకు తీసుకున్నారు. తనను కాదని ఎవరికైనా కౌలుకు ఇస్తే వారిని పొలాల్లోకి వెళ్లకుండా చెరువు కట్టనూ చదును చేసేశారు. రెవెన్యూ రికార్డుల ఆధారంగా చెరువు సరిహద్దు రాళ్లు దాటి మరీ కట్టను దున్నేసుకున్నారు.
పట్టిసీమకు గోదావరి పరవళ్లు - ఆనందంలో అన్నదాతలు - Pattiseema Lift Irrigation Project
గత ఐదు సంవత్సరాలు ఆయన వైఎస్సార్సీపీలో క్రియా శీలకంగా ఉండడంతో రెవెన్యూ యంత్రాంగం ఆయన దురాక్రమణకు దన్నుగా నిలిచింది. సదరు నేత ఎన్నికల ముందు వరకూ వైఎస్సార్సీపీలో ఉండి ఇప్పుడు ప్రస్తుత అధికారం పార్టీ నేతల వెంట తిరుగుతున్నారు. అయితే రైతుల ఫిర్యాదుతో అధికారులు ఏకదండయ్య చెరువును పరిశీలించారు. ఆక్రమణ వాస్తవమేనని వాటిని తొలగించేందుకు త్వరలో చర్యలు తీసుకుంటామని ప్రత్తిపాడు తహసీల్దార్ పద్మజ చెప్పారు.
తోటపల్లి జలాశయ కుడి ప్రధాన కాలువకు గండి- పంట నష్టంపై రైతుల ఆందోళన - Hole to Totapalli Canal