Lands Encroachment in YSRCP Rule: వైఎస్సార్సీపీ పాలనలో మద్యం, ఇసుక కుంభకోణాలతో సమాంతరంగా ఆ పార్టీ నేతలు భూకబ్జాలకు పాల్పడ్డారు. ప్రతి జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ భూమి అనే తేడా లేకుండా ఆక్రమించేశారు. ఉమ్మడి విశాఖ, వైఎస్సార్ జిల్లాల్లో వేల కోట్ల విలువైన భూములు కొట్టేశారు. రికార్డుల్లో వివరాలు మార్చడంతో పాటు తప్పుడు పత్రాలు సృష్టించారు. కొన్నిచోట్ల వీరికి రెవెన్యూ అధికారులు, సిబ్బంది సహకరించారు. మా భూములు లాక్కుంటున్నారు న్యాయం చేయండంటూ కార్యాలయాల చుట్టూ తిరిగిన బాధితులను ఎవరూ పట్టించుకోలేదు. చివరికి భూములు వదులుకోవాలంటూ వైఎస్సార్సీపీ ముఠాల బెదిరింపులకు భయపడి కొందరు బలవన్మరణాలకు సైతం పాల్పడ్డారు.
ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో బద్వేలు, రాజంపేట, రాయచోటి నియోజకవర్గాల పరిధిలో వేల ఎకరాల ప్రభుత్వ భూములు గత ఐదేళ్లుగా అన్యాక్రాంతమయ్యాయి. బద్వేలులో సుమారు 5 వేల ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైనట్లు తెలుస్తోంది. కడప నగరంలో జిల్లా పరిషత్తుకు చెందిన 4 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని వైఎస్సార్సీపీ కార్పొరేటర్ భర్త ఆక్రమించి హోటల్ ఏర్పాటు చేశారు. మామిళ్లపల్లెలో తెలుగుగంగ కార్యాలయానికి చెందిన 22 ఎకరాల భూమి ఆక్రమణల పాలైంది. సిద్దవటం మండలం భాకరాపేట శివారులోని కడప-చెన్నై జాతీయ రహదారి పక్కన ఎస్సీ లబ్ధిదారులకు చెందిన 6 ఎకరాల డీకేటీ భూమిని వైఎస్సార్సీపీ నేతలు 2020లో ఆన్‌లైన్‌లో తమ పేరుపైకి మార్చుకున్నారు.
విశాఖలోనూ ఇదే దందా కొనసాగింది. సాగర నగరం చుట్టుపక్కల 500 ఎకరాల ప్రభుత్వ భూములు కాజేశారు. భీమిలి, ఆనందపురం, పద్మనాభం, పెందుర్తి, మధురవాడలో చెరువులు, వాగులను సైతం ఆక్రమించారు. రాణి వాద్వాన్‌కు చెందిన దస్‌పల్లా భూములు, సామాజిక సేవల కోసం కేటాయించిన హయగ్రీవ, సెయింట్‌లూక్స్ భూములు వైఎస్సార్సీపీ నేతల గుప్పెట్లోకి వెళ్లాయి. అంతటితో ఆగకుండా తమకు కావాల్సిన వారికి విలువైన ప్రభుత్వ భూములను తక్కువ ధరకు కట్టబెట్టారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల పేరుతో విశాఖ శారదా పీఠానికి 200 కోట్ల రూపాయల విలువైన భూమిని గత పాలకులు కేటాయించారు. పేద రైతులకు చెందిన 2 వేల ఎకరాల ఎసైన్డ్ భూములను అప్పటి ప్రభుత్వ పెద్దలు కొనుగోలు చేసినట్లు ఆరోపణలొచ్చాయి.
బాలినేని కుటుంబ సభ్యుల అండదండలతో: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి కుటుంబ సభ్యుల అండదండలతో ఒంగోలులో జరిగిన భూ దందా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించింది. వందల కోట్ల విలువైన ప్రైవేట్ భూములకు నకిలీ పత్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్‌ల పేరుతో కాజేశారు. బాధితుల ఆందోళనలతో అదనపు ఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణలో 20 మంది సీఐలతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. సుమారు 200 మంది నిందితులు ఉన్నట్లు గుర్తించగా, వారిలో కేవలం 70 మందినే అరెస్టు చేశారు. ప్రధాన సూత్రధారులపై ఇంతవరకు చర్యలు తీసుకోలేదు.
అనకాపల్లి జిల్లా కశింకోట మండలం బయ్యవరం రెవెన్యూ పరిధిలోని విస్సన్నపేటలో మాజీ మంత్రి అమర్‌నాథ్ అనుచరులు 600 ఎకరాల్లో భారీ లేఅవుట్ వేశారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన భూములకు తోడు ప్రభుత్వ భూములు, వాగులు, కొండ గెడ్డలను సైతం అందులో కలిపేశారు. లేఅవుట్లోకి వెళ్లడానికి రోడ్డు కోసం 5 కోట్ల విలువైన 10 ఎకరాల భూమి ఆక్రమించారు. ఈ వ్యవహారంపై అప్పటి ఆర్డీఓ సీతారాం విచారణ జరిపినా చర్యలు మాత్రం తీసుకోలేదు. శ్రీశైలానికి సమీపంలోని సున్నిపెంటలో జలవనరులశాఖకు చెందిన 208 ఎకరాల భూమి కబ్జాకు గురైనట్లు విజిలెన్స్ రిపోర్టుల్లో పేర్కొన్నా చర్యలు శూన్యం. నెల్లూరు గ్రామీణ నియోజకవర్గ పరిధిలో జలవనరులశాఖకు చెందిన కాలువలను ఆక్రమించి భారీ లేఅవుట్లను వేశారు.
రాష్ట్రంలో ఎక్కడైనా వివాదాలు లేని ఖరీదైన భూములు కనిపిస్తే వాటికి వైఎస్సార్సీపీ నేతలు నకిలీ పత్రాలు సృష్టించారు. తమ అనుచరులను పంపి యజమానులను బెదిరించారు. మాట వినకపోతే అసలు యజమానులకు తెలియకుండానే రెవెన్యూ రికార్డులు, ఆన్‌లైన్‌లో పేర్లు మార్చేశారు. తరతరాలుగా వస్తున్న ఆస్తులను కాపాడుకోవడానికి బాధితులు ఎంతగానో పోరాడారు. చివరికి వారు ఆత్మహత్యలు చేసుకునేలా వైఎస్సార్సీపీ నేతలే ప్రేరేపించారు. వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్ట మండలంలో వైఎస్సార్సీపీ నేతలు భూ రికార్డులు తారుమారు చేశారని చేనేత కార్మికుడు సుబ్బారావు రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడగా, ఆయన భార్య, కుమార్తె ఇంట్లో ప్రాణాలు విడిచారు.
మైదుకూరు నియోజకవర్గంలోని ఖాజీపేటలో తన భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించాలని ఓ రైతు రెవెన్యూ యంత్రాంగానికి మాముళ్లు ఇచ్చినా పట్టించుకోవడం లేదన్న బాధతో ప్రాణాలు తీసుకున్నారు. కాళ్లు అరిగేలా తిరిగినప్పటికీ రెవెన్యూ సిబ్బంది తన 8 ఎకరాల పొలాన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేయకపోవడంతో వైఎస్సార్ జిల్లా ఖాజీపేట మండలం తుడుములదిన్నెలో సుబ్బారెడ్డి అనే రైతు బలవన్మరణానికి పాల్పడ్డారు. తన చావుకు సీఎం, రెవెన్యూ అధికారులు కారణమని లేఖలో రాశారు. వైఎస్సార్సీపీ నేతల మద్దతుదారుల ఆగడాలకు 2022 సెప్టెంబరులో ఓ వృద్ధుడు గుండెపోటుతో మరణించారు.
భూ సమస్య పరిష్కారం కోసం చిత్తూరు జిల్లా పెనమలూరు తహసీల్దారు కార్యాలయానికి వెళ్లి అధికారులతో మాట్లాడుతున్నప్పుడే ఆ వృద్ధుడు ప్రాణాలు విడిచారు. స్థానిక ప్రజాప్రతినిధి ఇప్పించిన ఇంటి స్థలాన్ని ఆయనకు సన్నిహితంగా ఉండే ఓ పోలీసు ఆక్రమించాడని నరసరావుపేట కలెక్టరేట్ ఎదుట పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలానికి చెందిన దళిత యువకుడు ఉయ్యాల శివకృష్ణ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వైఎస్సార్ జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం యాదవనగర్‌కు చెందిన తమ్మిశెట్టి గుర్రమ్మ, బత్తల వెంకటసుబ్బమ్మ తల్లీకుమార్తెలు. డీకేటీ పట్టా ఇచ్చి, భూమి చూపించలేదని తహసీల్దారు కార్యాలయంలో ఆత్మహత్యాయత్నం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా జరిగిన భూ దందాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవడం ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాల్ . ఇందుకోసం ప్రత్యేక సర్వే చేయాల్సిన అవసరం ఉంది. వీలైనంత త్వరగా భూ ఆక్రమణదారులపై ఉక్కుపాదం మోపి వారి చెర నుంచి భూములను విడిపించాల్సిన బాధ్యత రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌పై ఉంది. ఎన్డీయే సర్కారులోనైనా న్యాయం జరుగుతుందని భావిస్తున్న జగన్ సర్కారు బాధితుల నమ్మకాన్ని ప్రస్తుత పాలకులు నిలబెట్టుకోవాలి.
వెలుగులోకి వైఎస్ భారతి పీఏ అక్రమాలు - YS Bharti PA Land Grabbing