Land Titling Act Problems in Annamayya District : మండలం కొత్త మాధవరానికి చెందిన సుబ్బారావుకు 3.10 ఎకరాలుంది. కుటుంబ సభ్యులకు అనారోగ్య కారణాలతో వైద్య ఖర్చులకు అప్పులు చేశారు. అప్పుల్ని తీర్చడానికి ఉన్న పొలాన్ని విక్రయించడానికి బేరం పెట్టారు. వ్యవహారం చివర దశలో ఉండగా కొనుగోలుదారు భూముల వివరాలు పరిశీలించగా సుబ్బారావు పేరిట లేదని తేలింది. తనకు తెలియకుండా భూముల బదలాయింపుపై రెవెన్యూ అధికారులను కలిసి పోరాటం సాగించి అలిసిపోయారు. చివరకు గ్రామసమీపంలోని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయం తెలిసి భార్య, కుమార్తె సైతం ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడడం రాష్ట్రంలో సంచలనం కలిగించింది.
కడప నగర సమీపంలో సీకేదిన్నె మండలం మామిళ్లపల్లెకు చెందిన రామ్మోహన్‌రెడ్డికి అయిదెకరాలుంది. భూములపై బ్యాంకు రుణాలు సైతం ఏళ్ల తరబడి తీసుకున్నారు. సర్వహక్కులు ఉన్నప్పటికీ పూర్వీకుల నుంచి సంక్రమించిన ఆస్తి ఇటీవల వేరే వ్యక్తుల పేరుతో ఆన్‌లైన్‌లో నమోదైంది. దీనిపై న్యాయపోరాటం చేస్తున్నా ఫలితం లేకుండాపోయింది.
ముద్దనూరు మండలంలో వైఎస్సార్సీపీ నేత చిన్న దుద్యాల గ్రామానికి చెందిన ప్రభావతికి చెందిన 4.54 ఎకరాల భూమిని నకిలీ పత్రాలతో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆమెకు వంశపార్యంగా సక్రమించింది. కలెక్టర్, ఎస్పీకి బాధితురాలు ఫిర్యాదు చేసింది. తీవ్ర వివాదానంతరం రిజిస్ట్రేషన్‌శాఖ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసింది. తీవ్ర పోరాటం తర్వాత మహిళకు న్యాయం జరిగింది.
వైయస్‌ఆర్ జిల్లాలో ఎవరి భూములకూ రక్షణ లేదు. ఆస్తులకు భద్రత లేదు. కళ్లు మూస్తే కబ్జాలు. కాదంటే వివాదాలు. వైఎస్సార్సీపీ రాబందుల ధాటికి సామాన్యులు విలవిలలాడుతున్న నేపథ్యంలో అరాచకాలకు ఊతమిచ్చే చట్టం వస్తే ఆక్రమణలకు అధికారికం చేసే పరిస్థితే వస్తే పరిస్థితి ఏమిటి ? అంటూ రెండు జిల్లాల ప్రజానీకం భయానక వాతావరణంలో చర్చోపచర్చలతో ఆందోళన పడుతున్నారు. ఈ భయానక చిత్రానికి కర్త కర్మ క్రియ జగన్. ఆయన స్వీయ దర్శకత్వంలో నడిచే వైఎస్సార్సీపీ ప్రభుత్వం ‘ల్యాండ్ టైటలింగ్ యాక్టు’ను తీసుకొచ్చింది. ఈ చట్టంపై ఊరూవాడా జనం తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఆస్తులకు రక్షణ లేకుండా విలవిలలాడుతుండగా, కొత్తగా అమల్లోకి వచ్చే చట్టంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇదే తరుణంలో చాలా మంది భయంతో రిజిస్ట్రేషన్లకు వెళ్లడంలేదు. నిత్యం కిటకిటలాడే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు బోసిపోయి కనిపిస్తున్నాయి. రిజిస్ట్రేషన్ అవసరాలున్న వారు ఎన్నికల వరకు ఆగుదామనే అభిప్రాయానికి క్రయ విక్రయదారులొచ్చారు.
భూమి కనిపించని ఆభరణం. ఇలా ఎన్నో అవసరాలు తీరుస్తూ ఆకాంక్షలను నెరవేర్చే ఈ భూమి భద్రంగా ఉన్నప్పుడే కుటుంబానికి భరోసా. సామాన్యుడి భూములపై హక్కులను కాలరాసే వ్యవహారం నడిచింది. కోర్టులు.. చట్టాలు ఉన్నా వాటికి అతీతంగా కొత్తగా భూమి హక్కు చట్టం తీసుకొచ్చింది. ఇప్పటికే అక్రమాల పరంగా చూస్తే జిల్లాలోని బద్వేలు, మైదుకూరు, ప్రొద్దుటూరు, కమలాపురం నియోజకవర్గాల్లో ఎ నియోజకవర్గాల్లో ఎక్కువగా ఉన్నాయి. ఒకరి భూములు మరొకరిపై యాజమానుల ప్రమేయం లేకుండా బదిలీ అయిపోయాయి. అవసరాల సమయంలో పరిశీలించుకుంటే భూములు తమ పేరిట లేని వ్యవహారం తెలుసుకుని లబోదిబోమంటున్నారు. కొంతమంది పోరాటం చేయలేక భూముల్ని వదులుకున్న దాఖలాలున్నాయి. మరికొందరైతే పోరాటంతో అలిసి పోయి చివరికి ఆత్మహత్యలు.. ఆత్మహత్యాయత్నాలకు పాల్పడ్డారు.
ప్రజలను మోసం చేయడానికే: 'భూములు కొనుగోలు తర్వాత అసలు పత్రాలు ఇవ్వకుండా కేవలం జిరాక్స్ పత్రాలు ఇవ్వడమేంటి? స్థిరాస్తిని చూపి రుణాలు తెచ్చుకోవాలంటే అసలు పత్రాలు చూపాలి. అవి లేకుండా రుణాలు ఇవ్వరు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం ప్రజలను మోసం చేయడానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చింది.' -వెంకటరెడ్డి, బి.కొత్తపల్లె, ఖాజీపేట మండలం
వైఎస్సార్సీపీకీ గుణపాఠం చెప్పాలి : 'ఈ చట్టంతో పత్రాలున్నా స్థిరాస్తులకు భద్రత ఉండదు. పక్కా ఆధారాలను సమర్పించినా సంబంధిత అధికారి చేతివాటంతో దారుణంగా నష్టపోవడం ఖాయం. ప్రజల ఆస్తులను దోచుకోవడానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తీసుకొచ్చింది. దీన్ని వ్యతిరేకించి వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలి. '-బోడెల బాబుల్‌రెడ్డి, శంకరాపురం, ప్రొద్దుటూరు మండలం
ఆస్తులకు భద్రత కరవు : 'వైఎస్సార్సీపీ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టం చాలా ప్రమాదకరం. భూయజమానులు విదేశాల్లో ఉంటే ఇది మరీ ప్రమాదకరంలా మారుతుంది. వ్యక్తిగత ఆస్తులపై ప్రభుత్వ పెత్తనాన్ని ప్రజలు గమనించారు. ఈ చట్టం అమలుకు రీసర్వే పేరుతో ప్రభుత్వం డిజిటల్ రికార్డులు తయారు చేస్తుంది. ఈ చట్టాన్ని రద్దు చేయాలి.'-రాజశేఖర్, బురుజుపల్లె, కొండాపురం
ఆస్తులకు రక్షణ ఉండదు : 'ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం తమకు అనుకూలంగా మార్చుకుంది. నీతి ఆయోగ్ సూచనలు పట్టించుకోలేదు. చట్టం అమలయ్యే పక్షంలో రెవెన్యూ అధికారులదే పెత్తనం అవుతుంది. వివాదం తలెత్తినా సివిల్ కోర్టుకు వెళ్లే హక్కు లేదు. హైకోర్టులోనే తేల్చుకోవాల్సి ఉంటుంది. సామాన్యుల ఆస్తులకు రక్షణ ఉండదు.'-వెంకట సుబ్బారెడ్డి, న్యాయవాది, అమరావతి
పాసుపుస్తకాలపై సీఎం జగన్ ఫొటో ఎందుకు? : 'వారసత్వంగా వస్తున్న భూహక్కులు కోల్పోయే ప్రమాదం ఉంది. రీసర్వే పేరుతో మా భూమిహక్కు పత్రాలపై సీఎం జగన్ చిత్రాలు ప్రచురించడం దారుణం. ఇలా చేస్తే మా భూముల హక్కులపై అనుభవం ఉన్నా అధికారుల తీరుతో రైతులకు ఉరితాడుగా మారుతుంది.మా భూములపై హక్కులు లేకుండా పోతాయి.'-శ్రీనివాసులురెడ్డి, కొర్రపాడు
ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదు : 'వారసత్వంగా 3.60 ఎకరాలకు సంబంధించి రికార్డులు నా దగ్గర ఉన్నాయి. రీసర్వేలో 1.45 ఎకరాలు తొలగించి 2.15 ఎకరాలు మాత్రమే రికార్డులో నమోదు చేశారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదు.'-ఎన్.రామ్మోహన్‌రెడ్డి, ఆవులవాండ్లపల్లె, చక్రాయపేట మండలం
జగన్ భూ దాహానికి ముసుగు చట్టం - ఆ లక్షల ఎకరాలు ఎవరి ఖాతాలోకి? - AP LAND TITLING ACT 2023