Kusala Honey Farming Business in Eluru District : తేనె పెంపకం అంత సులభమేమీ కాదు. ప్రకృతి ప్రసాదించిన మధురాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం చాలా కష్టమే. పక్షులు, కీటకాల దాడిని తట్టుకోవాలి. అంతేకాదు దొంగల బెడద కూడా ఎక్కువే. ఇంత క్లిష్టమైన ప్రక్రియ అయినా వ్యాపారం చేయాలన్న తలంపుతో ముందుకు సాగారు బొడ్డుపల్లి సురేష్, కొప్పాక శ్రీనివాసరావు. వీరికి గరిమెళ్ల భాస్కర్ గంగాధర్ తోడయ్యారు. ముగ్గురివీ వ్యవసాయ కుటుంబాలే. మొదట్లో ప్రైవేటు ఉద్యోగాలు చేసిన వీరు స్వయం ఉపాధి దిశగా అడుగులు వేశారు.
ఏలూరు జిల్లా విజయరాయిలోని ఎపికల్చర్‌లో శిక్షణ తీసుకున్నారు. 2014లో తేనెటీగల పెంపకం ప్రారంభించి అదే ఏడాది తేనె వ్యాపారం మొదలుపెట్టారు. మొదట్లో నెలకు 200 కేజీల వరకు తేనె తయారు చేశారు. తేనె పట్ల వినియోగదారుల్లో అపోహలు, పెద్ద కంపెనీలు పోటీలో ఉండటంతో వ్యాపారం సజావుగా సాగలేదు. అయినా పట్టు విడవకుండా ప్రయత్నించడంతో అనతికాలంలోనే సవాళ్ల నుంచి బయటపడ్డారు.
'తొలినాళ్లలో 15 బాక్సులతో ప్రారంభించి ఐదేళ్లు తిరిగేసరికి సొంత నిధులతో 800కుపైగా బాక్సులు ఏర్పాటు చేసుకున్నాం. జంగారెడ్డిగూడెంలోని ఓ తోటతో పాటు అరకు, కర్నూలులో ఎపికల్చర్ చేస్తున్నాం. ఆదరణ లభించడంతో నెలకు 1500 కేజీల వరకూ తేనె ఉత్పత్తి చేస్తున్నాం. మంచి లాభాలు వస్తున్నాయి. కస్టమర్స్ కూడా చాలా సంతృప్తిగా ఉన్నారు.' -సురేష్ కుమార్, తేనె పెంపకందారు
వ్యాపారానికి పట్టణమే అవసరం లేదు - మంచి ఆలోచన ఉంటే చాలంటున్న యువతి - Eco Friendly Bags
'కుశల' న్యాచురల్ హనీ అనే పేరుతో సొంతంగా సంస్థను రిజిస్టర్ చేయించి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తూ వ్యాపారాన్ని అంచలంచెలుగా పెంచుకున్నారు. కల్తీకి తావు లేని స్వచ్ఛమైన తేనె ఉత్పత్తి చేయడంతో ఏడాదికి 70లక్షల టర్నోవర్ వ్యాపారం చేస్తున్నారు. తేనెతో పాటు ఉపఉత్పత్తులైన పుప్పొడి, రాయల్ జెల్లీ, మైనం నుంచి కూడా అదనంగా సంపాదిస్తున్నారు.
తేనెటీగల పెంపకం కష్టంతో కూడుకున్న పని. కూలీలు దొరకరు. ఒకవేళ వచ్చినా తేనెటీగల దాడి వల్ల ఎక్కువ కాలం ఎవరూ పని చేసేవారు కాదు. మహిళా సాధికారత కల్పించాలన్న ఉద్దేశంతో మహిళలను ఎంచుకుని తేనెటీగల పెంపకంలో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఆరుగురు మహిళలు పని చేస్తుండగా ఒక్కొక్కరికీ నెలకు 18వేలకు పైనే జీతాలు ఇస్తున్నారు. తేనె వ్యాపారం లాభసాటిగా ఉందని ఆసక్తి ఉన్నవారు ముందుకొస్తే తేనెటీగల పెంపకంలో శిక్షణ ఇస్తామంటున్నారు ఈ మిత్రులు.
ఉద్యోగం వద్దనుకుని పొలం బాట పట్టాడు - లాభాలు గడిస్తున్నాడు - YOUNG FARMER EARNING MORE