KTR Brother in Law Farm House Case: తెలంగాణలోని జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ కేసులో పోలీసుల విచారణ ముగిసింది. మోకిలా పోలీసుల ఎదుట ఈ కేసులో ఏ2గా ఉన్న విజయ్ మద్దూరి హాజరయ్యారు. కొన్ని రోజులుగా విచారణకు హాజరుకాని విజయ్ మద్దూరి బుధవారం పోలీసుల ఎదుట విచారణకు హాజరవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. జన్వాడ ఫామ్ హౌస్ కేసులో ఏ1గా ఉన్న తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ బావమరిది రాజ్‌పాకాల ఉన్న విషయం తెలిసిందే. రాజ్‌పాకాలకు విజయ్ స్నేహితుడు. ఫామ్ హౌస్‌లో జరిగిన పార్టీలో పాల్గొన్న విజయ్ మద్దూరి సాంపిల్స్‌ను పరీక్షించగా ఆయన డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. దీంతో విజయ్ మద్దూరిని పోలీసులు ఈ వ్యవహారంలో ప్రశ్నించారు.
పోలీసుల ప్రశ్నలు ఇవే : పార్టీలో మాదకద్రవ్యాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు సరఫరా చేశారు అని పోలీసులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఎన్నిసార్లు మాదకద్రవ్యాలు తీసుకున్నారు అనే కోణంలోనూ పోలీసులు విజయ్ మద్దూరిని ప్రశ్నించినట్లు సమాచారం. దాదాపుగా నాలుగు గంటల పాటు విజయ్ మద్దూరిని పోలీసులు విచారించారు. గతంలో రాజ్ పాకాల ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పిన పలు సమాధానాల ఆధారంగా కూడా విజయ్ మద్దూరికి పోలీసులు పలు ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది.
సుమారు 4 గంటల విచారణ అనంతరం మోకిల పోలీస్ స్టేషన్ నుంచి విజయ్ మద్దూరి వెళ్లిపోయారు. రాజ్ పాకాల ఫామ్ హౌస్‌లో జరిగిన లిక్కర్ పార్టీలో విజయ్ మద్దూరికి టెస్ట్ చేయగా, డ్రగ్స్ తీసుకున్నట్లు పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. జన్వాడ ఫామ్ హౌస్ లిక్కర్ పార్టీ కేసు విషయంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్ర చర్చలకు దారితీసింది.
జన్వాడ ఫామ్‌హౌస్ మద్యం పార్టీ కేసు - విచారణకు హాజరైన రాజ్ పాకాల