Who Will Win in Krishna: కోస్తా జిల్లాలో మచిలీపట్నం మరో ముఖ్యమైన లోక్‌సభ నియోజకవర్గం. గత ఎన్నికల్లో ఇక్కడ వైఎస్సార్సీపీ జెండా ఎగిరింది. ఈసారి అందుకు ప్రతికూలంగా ప్రజల తీర్పు ఉండనుందని ప్రజల నాడిని బట్టి తెలుస్తోంది. ఐదేళ్లుగా ఎలాంటి అభివృద్ధి లేకపోవడం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కొరవడటం ఇక్కడి ప్రధాన సమస్యలు. బందర్ పోర్టు నిర్మాణం ఆలస్యంపైనా ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. వీటికి తోడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి రావడం, చాలా ప్రభావం చూపనుంది. ప్రస్తుత ఎంపీ బాలశౌరి కూటమి అభ్యర్థిగా బరిలో దిగగా, వైసీపీ మాత్రం వెతికి, వెతికి అభ్యర్థులు దొరక్క అలసిపోయి, చివరికి సింహాద్రి రమేష్‌ని పోటీలో దింపింది. ప్రచారంలో కూటమి లోక్‌సభ అభ్యర్థి బాలశౌరితో పాటు అసెంబ్లీ అభ్యర్థులు దూసుకెళ్తుండగా వైసీపీ మాత్రం వెనకబడింది.
మచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గం, ఎక్కువ సార్లు కాంగ్రెస్‌ను ఆదరించిన నియోజకవర్గం. తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత ఓసారి తెలుగుదేశం, మరోసారి కాంగ్రెస్‌లను ప్రజలు గెలిపిస్తూ వచ్చారు. 2009, 2014 ఎన్నికల్లో మాత్రం తెలుగుదేశం అభ్యర్థి కొనకళ్ల నారాయణ గెలిచారు. 2019 ఎన్నికల్లో ఇక్కడి ప్రజలు వైసీపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరిని ఆదరించారు. ప్రస్తుతం ఆయన అధికార వైసీపీతో విభేదించి జనసేనలో చేరి ఆపార్టీ నుంచి ఇదే స్థానంలో పోటీ చేస్తున్నారు. అభ్యర్థులు దొరక్కపోవడంతో వైసీపీ, అవనిగడ్డ అసెంబ్లీ నుంచి సింహాద్రి రమేష్‌ని తీసుకొచ్చి బరిలో దింపింది. పేరు ప్రకటించిన తర్వాతా చాలారోజుల వరకూ అసలు చంద్రశేఖర్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఎక్కడా కనిపించలేదు. మరోవైపు కూటమి అభ్యర్థి బాలశౌరి అందర్నీ కలుపుకొని ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఈయనకి గతంలో ఇక్కడ గెలిచి, ప్రస్తుత ఎన్నికల్లో టికెట్ ఆశించిన తెలుగుదేశం నేత కొనకళ్ల నారాయణ సైతం పూర్తి మద్దతు ప్రకటించి, గెలుపు కోసం ప్రచారం నిర్వహిస్తున్నారు. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 5.11లక్షల ఓట్లొచ్చాయి. జనసేనకు 1.13లక్షల ఓట్లు పడ్డాయి. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నేతలతోనూ వరుస సమావేశాలు పెట్టి.. మూడు పార్టీలను బాలశౌరి సమన్వయం చేస్తున్నారు. దీనికితోడు ఎమ్మెల్యే పేర్ని నాని, అతని కుమారుడు కిట్టు అరాచకాలను బాలశౌరి దీటుగా ఎదుర్కోవడంతో ఆపార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం పెరిగింది. పైగా బాలశౌరి గత ఐదేళ్లలో మచిలీపట్నం ఎంపీగా అభివృద్ధిలో స్పష్టమైన ముద్ర వేశారు. బందరు పోర్టుకు కేంద్ర అనుమతులు, రుణాలు తీసుకురావడం, గుడివాడ రైల్వేవంతెన, పెద్దఎత్తున కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆసుపత్రుల్లో వసతులు, మత్స్యకారులకు సౌకర్యాలు.. లాంటివి కేంద్ర, సీఎస్‌ఆర్ నిధులతో భారీగా చేపట్టారు. ఇవన్నీ కలిపి.. బాలశౌరి స్పష్టమైన మెజార్టీతో గెలవబోతున్నట్లు కనిపిస్తోంది. ఈ పార్లమెంట్ పరిధిలో మచిలీపట్నం, పెనమలూరు,పెడన, గుడివాడ, గన్నవరం, అవనిగడ్డ, పామర్రు నియోజకవర్గాలు ఉన్నాయి.
వైఎస్సార్సీపీ పేదల వికాసం కోసం కాదు- మాఫియా వికాసం పని చేసింది : మోదీ - PM Modi fired at Congress YCP
పెనమలూరు అసెంబ్లీలో తెలుగుదేశం అభ్యర్థిగా బోడె ప్రసాద్ బరిలో ఉండగా, వైసీపీ నుంచి మంత్రి జోగి రమేష్‌ను,పెడన నుంచి ఇక్కడి తీసుకొచ్చారు. పెడనలో గత ఐదేళ్లుగా దోపిడీ, దౌర్జన్యాలతో జోగి చెలరేగిపోయారనే ఆరోపణలు ఉన్నాయి. అక్కడ వ్యతిరేకత గమనించే మైలవరం నుంచి బరిలో ఉండాలని జోగి రమేష్ ప్రయత్నించారు. ఈ క్రమంలో స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌తో విభేదాలు మొదలై, అంతకంతకూ ముదిరాయి. స్వయంగా జగన్ ఇద్దరు నేతలకూ సర్దిచెప్పినా పరిస్థితిలో మార్పు రాలేదు. ఈ తర్వాత జరిగిన పరిణామాల్లో జగన్, జోగి రమేష్‌ని పెనమలూరుకు మార్చారు. ఇక్కడికి మకాం మార్చిన వెంటనే.. సొంత పార్టీ శ్రేణుల నుంచే విపరీతమైన వ్యతిరేకత వ్యక్తమైంది. జోగి వద్దంటూ, ఏకంగా వైసీపీ నేతలే నియోజకవర్గంలో బ్యానర్లు కట్టారు. జోగి వచ్చీ రావడంతోనే.. పెనమలూరులోనూ దందా మొదలెట్టారు. ఇసుక దోపిడీతో పాటు రియల్‌ఎస్టేట్, విద్యా, వ్యాపార సంస్థలకు.. జోగి వర్గం బెదిరింపులు ఎక్కువయ్యాయి. ఖర్చులుంటాయ్, డబ్బులు పంపాలంటూ.. కబురు పంపడం పెద్ద దుమారమే లేపింది. మరోవైపు గత ఎన్నికల్లో ఓడినా నిత్యం ప్రజల్లో ఉండటం బోడెకు కలిసొచ్చింది. వీటితో పాటు ఇక్కడ 2019లో గెలిచిన పార్థసారథి తెలుగుదేశంలో చేరడం అదనపు బలం. ఇవన్నీ కలగలిపి గట్టిపోటీ ఎదురైనా బోడె ప్రసాద్ మరోసారి గెలుస్తారనే మాట ప్రజల నుంచి వినిపిస్తోంది.
గుడివాడ రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొన్న అసెంబ్లీ నియోజకవర్గం. తెలుగుదేశంతో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి, ఆ తర్వాత అదే పార్టీతో విభేదించి వైసీపీలో చేరి ఆ పార్టీ నుంచి గెలుస్తూ వస్తున్నారు కొడాలి నాని. గత నాలుగుసార్లుగా ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన గత ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో మరింతగా చెలరేగిపోయారు. అసెంబ్లీలో, బయట చంద్రబాబు, లోకేష్‌తో పాటు వారి కుటుంబంపై వ్యక్తిగత విమర్శలు చేశారు. కుటుంబాన్ని అవమానించేలా ప్రవర్తించారు. దీంతో నియోజకవర్గ ప్రజలు ఈయనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. పైగా ఇన్నేళ్లుగా ఎమ్మెల్యేగా, రెండున్నరేళ్ల పాటు మంత్రిగా ఉన్నా, నియోజకవర్గంలో ఈ అభివృద్ధి చేశానని చెప్పుకోలేదని దుస్థితి. ఇక్కడ రోడ్లు నరకానికి దారులు అన్నట్లుగా ఉన్నాయి. ఇవేమీ పట్టించుకోని కొడాలి నాని, కేవలం విమర్శలతోనే కాలం గడిపారు. మరోవైపు క్యాసినోతో అప్రతిష్ట మూటకట్టుకున్నారు. ఈసారి ఈయనకు ఎలాగైనా చెక్ పెట్టాలని భావించిన తెలుగుదేశం, గత ఎన్నికలో పోటీ చేసిన రావి వెంకటేశ్వరరావుని కాదని, వెనిగండ్ల రాముకు టికెట్ ఇచ్చింది. టికెట్ ప్రకటనంటే ముందుగానే నియోజకవర్గంలో పర్యటించి ప్రజల ఇబ్బందులు తెలుసుకున్నారు రాము. వీలైనంత మేర సాయం చేస్తూ వచ్చారు. ఇన్నేళ్లుగా కొడాలి నాని చేస్తున్న అరాచకాలు, దౌర్జన్యాలతో పాటు అభివృద్ధి లేమిని వివరించి ఓసారి తనను ఆదరించాలని అభ్యర్థిస్తూ ప్రచారం చేస్తూ వచ్చారు.
మచిలీపట్నం అసెంబ్లీలో తెలుగుదేశం తరఫున కూటమి అభ్యర్థిగా కొల్లు రవీంద్ర బరిలోకి దిగగా, వైసీపీ నుంచి పేర్ని నాని కుమారుడు పేర్ని కిట్టు పోటీలో ఉన్నారు. సౌమ్యుడైన కొల్లు రవీంద్రను అసలు సంబంధమే లేని హత్య కేసులో అరెస్టు చేసి 50 రోజులకు పైగా జైలులో ఉంచారని, అవకాశం దొరికిన ప్రతిసారీ కేసులు పెట్టి వేధించారనే అభిప్రాయాన్ని ప్రజలు వ్యక్తంచేస్తున్నారు. దీంతో విపరీతమైన సానుభూతి పెరిగింది. జనసేన ఓట్లు అదనపు బలం. పేర్ని కిట్టుకి స్థానికంగా విపరీతమైన వ్యతిరేకత పెరిగింది. కిట్టు తనవర్గంతో కలిసి మచిలీపట్నంలోని ప్రతిపక్ష పార్టీల నేతలపై వరుస దాడులకు తెగబడడం, దానికి తండ్రి నాని వత్తాసు పలకడాన్ని ప్రజలు అసలు హర్షించడం లేదు. పైగా బాధితులపైనే కేసులు పెట్టించి, పోలీసులతో కొట్టించడం లాంటివి ఎక్కువయ్యాయి. ఈ వికృత చేష్టలతో ఆయన ఓటమిని ఆయనే కొనితెచ్చుకున్నారని స్థానికంగా వినిపిస్తోన్న మాట.
పెడన అసెంబ్లీలో తెలుగుదేశం అభ్యర్థిగా కాగిత కృష్ణప్రసాద్, వైసీపీ నుంచి జెడ్పీ ఛైర్మన్ ఉప్పాల హారిక భర్త రామును పోటీలో దింపింది. ఇక్కడ గత ఎన్నికల్లో పోటీ చేసిన జోగి రమేష్, చేయని దౌర్జన్యాలు, అక్రమాలు లేవు. ఈవ్యతిరేకత మారుతుందని ఆశించిన వైసీపీ రామును బరిలో దింపింది. అయినా అంత సానకూలత కనిపించడం లేదు. తెలుగుదేశం అభ్యర్థి కృష్ణప్రసాద్‌కు సౌమ్యుడిగా మంచి పేరుంది. ఇక్కడ హోరాహోరీ పోరు నెలకొంది.
రాష్ట్రంలో తెలుగుదేశంకి కంచుకోటలుగా ఉన్న నియోజకవర్గాల్లో గన్నవరం ఒకటి. ఇక్కడ గత ఎన్నికల్లో తెలుగుదేశం నుంచి పోటీ చేసి గెలిచిన వంశీ,తర్వాత వైసీపీలో చేరి మళ్లీ ఆ పార్టీ నుంచే పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రావు, తెలుగుదేశంలో చేరి పోటీ చేస్తున్నారు. వైసీపీలో చేరిన తర్వాత వంశీ తీరు పూర్తిగా మారిపోయింది. చంద్రబాబుతో పాటు లోకేష్ వారి కుటుంబసభ్యులపై వ్యక్తిగత విమర్శలతో చెడ్డపేరు మూటకట్టుకున్నారు. పైగా తెలుగుదేశం క్యాడర్, నేతలపై వరుసగా దాడులకి దిగారు. గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపైనే దాడికి దిగి ద్వంసం చేశారు. ఈ చేష్టలతో తన ఓటమిని తానే కొని తెచ్చుకున్నారు వంశీ. ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు, ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఈయనకి దుట్టా రామచంద్రరావు లాంటి వైసీపీ నేతలూ మద్దతు పలుకుతున్నారు. ఈసారి యార్లగడ్డ గెలుపు ఖాయంగా కనిపిస్తోంది.
ప్రతి ఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకోవాలి- ప్రజల్లో అవగాహన సదస్సు - Voter Awareness Programme in Ongole
పామర్రు 2009లో ఏర్పడిన తర్వాత ఇప్పటికి మూడు ఎన్నికలు జరిగితే, రెండుసార్లు కాంగ్రెస్, ఒకసారి వైసీపీ గెలిచాయి. ఇక్కడ ఈసారి తెలుగుదేశం జెండా ఎగరేయాలని అభ్యర్థి వర్ల కుమార్‌రాజా గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. మూడేళ్లుగా ఆయన స్థానికంగా ఉంటూ పార్టీ శ్రేణులను ఏకం చేశారు. పల్లెబాటతో గ్రామీణ ప్రాంతంలో పట్టు పెంచుకున్నారు. కుమార్‌రాజా తండ్రి వర్ల రామయ్య ఇదే నియోజకవరం నుంచి 2014లో పోటీ చేసి వెయ్యి ఓట్ల తేడాతో ఓడిపోయారు. అందుకే ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ప్రయత్నిస్తున్నారు. వైసీపీ అభ్యర్థిగా మరోసారి బరిలోకి దిగిన సిట్టింగ్ ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్‌పై జనంలో వ్యతిరేకత తీవ్రంగా ఉంది. ఈ ఐదేళ్లలో భారీగా అక్రమాలకు పాల్పడ్డారు. ఇసుక, బుసుక పెద్దఎత్తున కొల్లగొట్టారు. కానీ.. ఇక్కడ వైసీపీకి బలమైన ఓటు బ్యాంకు ఉండడంతో, పోటీ నువ్వానేనా అన్నట్లు ఉంది.
అవనిగడ్డలో గత ఎన్నికల్లో తెలుగుదేశం నుంచి పోటీ చేసిన మండలి బుద్ధప్రసాద్, ఈసారి జనసేన అభ్యర్థిగా బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో గెలిచిన సింహాద్రి రమేష్‌బాబు, మరోసారి వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. సౌమ్యుడిగా, ప్రజల కోసం కృషి చేసే వ్యక్తిగా బుద్ధప్రసాద్‌కి పేరుంది. ఐదేళ్లుగా వైసీపీ అరాచకాలను ఎదుర్కొంటూ ముందుకెళ్తున్నారు. కూటమిలో ఉండటంతో తెలుగుదేశం మద్దతు ఎలాగో ఉంటుంది. వైసీపీ నుంచి గట్టిపోటీ కనిపిస్తోన్నా, తెలుగుదేశం వైపే స్వల్పంగా మొగ్గు ఉంది.
విజయవాడలో సైకిల్ సవారీ - అన్నదమ్ముళ్ల సమరంలో కూటమికే పట్టం - Vijayawada Lok Sabha Constituency