Fire Accident at Visakha Railway Station Today : కోర్బా ఎక్స్‌ప్రెస్ రైల్లో మంటలు చెలరేగిన వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది పరిస్థితిని అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. నాలుగు అగ్నిమాపక యంత్రాలతో మంటలు అదుపులోకి తెచ్చారు. స్టేషన్‌లో ఉన్న ప్రయాణికులను ఘటనాస్థలానికి దూరంగా పంపించి ఎవరికీ ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నారు.
Korba Express Fire Accident Updates : ఈ ఘటనలో మూడు బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయని రైల్వే అధికారులు తెలిపారు. కోర్బా నుంచి ఉదయం ఆరు గంటలకు రైలు విశాఖకు వచ్చిందని పేర్కొన్నారు. మధ్యాహ్నం 2 గంటలకు తిరుపతి వెళ్లాల్సి ఉందన్నారు. అగ్నిప్రమాదానికి షార్ట్‌సర్క్యూట్ కారణమని భావిస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకు గల కారణాలు తెలుసుకునేందుకు లోతుగా పరిశీలన చేస్తున్నట్లు అధికారులు చెప్పారు.
ఇక తగులబడిపోయిన బోగీలను రైలు నుంచి వేరుచేసి అక్కడి నుంచి తరలించేందుకు చర్యలు చేపట్టామని రైల్వే అధికారులు పేర్కొన్నారు మిగిలిన బోగీలతో షెడ్యూల్ ప్రకారమే రైలు తిరుపతికి వెళ్తుందని తెలిపారు. దీనిపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు ఈ ఘటనలో ఎవ్వరికీ ఏమీ కాకపోవడంతో అక్కడివారు ఊపిరి పీల్చుకున్నారు.
ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు : ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని విశాఖ జాయింట్ పోలీస్ కమిషనర్ ఫకీరప్ప తెలిపారు. ఉదయాన్నే వచ్చిన ప్రయాణికులంతా రైలు నుంచి దిగిపోయారని చెప్పారు. 10 గంటలకు రైల్లో మంటలు చెలరేగాయని చెప్పారు. వెంటనే రైల్వే సిబ్బంది, పోలీసులు అప్రమత్తమయ్యారని వివరించారు. నాలుగు అగ్నిమాపక యంత్రాల ద్వారా మంటలార్పారని పేర్కొన్నారు.
దగ్ధమైన బోగీలను రైలు నుంచి వేరు చేసి తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారని ఫకీరప్ప వివరించారు. అగ్నిప్రమాద ఘటనపై రైల్వే సిబ్బంది పరిశీలిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. మరోవైపు కోర్బా ఎక్స్‌ప్రెస్ ప్రమాదంపై హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత స్పందించారు. డీఆర్ఎంతో ఫోన్లో మాట్లాడి ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏదైనా సాయం కావాలంటే వెంటనే చేస్తామని ఆమె చెప్పారు.
మెడికవర్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం - భయంతో పరుగులు తీసిన రోగులు - Hospital Fire Accident