Kondaveedu Fest in Palnadu District: కొండవీడు కోట ప్రాశస్త్యం, రెడ్డిరాజుల పాలనా వైభవం, తెలుగు సాహిత్య ఘనకీర్తిని భావితరాలకు అందించేందుకు వారధిగా నిలుస్తోంది కొండవీడు ఫెస్ట్. రెండు రోజుల పాటు సాగిన ఈ ఉత్సవాల్లో యువత, విద్యార్థులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సుందరమైన ఘాట్‌రోడ్డు, పురాతన కట్టడాలు, ప్రాచీన దేవాలయాలు, అరుదైన ఔషధ వృక్షాలను చూస్తూ సరికొత్త అనుభూతిని సొంతం చేసుకున్నారు. రాష్ట్రంలోనే కొండవీడు గొప్ప పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకున్నట్లు పల్నాడు జిల్లా అధికారులు తెలిపారు. పర్యాటకులు, సందర్శకులకు అవసరమైన అన్ని సౌకర్యాలతో పాటు ఉత్సవాల్లో సాహస క్రీడలు, హెలీ రైడ్ అందుబాటులోకి తెచ్చారు.
కొండవీడు కోటలో ఇజ్రాయిల్ హీబ్రూ విశ్వవిద్యాలయ బృందం
చరిత్రలో కొండవీడు కోటకు ప్రత్యేక స్థానం ఉంది. 17వందల అడుగుల గిరిదుర్గం శత్రు దుర్భేద్యంగా ప్రఖ్యాతి గాంచింది. అలాంటి కోటలో నిర్వహించిన కొండవీడు ఫెస్ట్- 2024 కార్యక్రమం సందర్శకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. కొండలపైనే రాజు, రాణిల కోటలు, కారాగారం, వజ్రాగారం, ధాన్యాగారం, అశ్వ, గజ శాలలు, మందిరాలను చూసి పర్యాటకులు సరికొత్త అనుభూతులను సొంతం చేసుకున్నారు. సుందరమైన ఘాట్ రోడ్, ప్రాచీన దేవాలయాలు, అరుదైన ఔషధ వృక్షాలను చూస్తూ నూతన ఉత్తేజాన్ని పొందారు. కొండవీడు ఉత్సవాలలో సాహస క్రీడంలతో పాటు హెలిరైడ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హెలిరైడ్ ట్రిప్‌కు పెద్దలకు 4వేల 5వందల రూపాయలు పిల్లలకు 4వేలు ఉండగా వాటిని తగ్గిస్తూ పెద్దలకు 3వేల 800 పిల్లలకు 3వేల500గా ఖరారు చేశారు.
కొండవీటి కోటలో శాసనాలు.. 17, 18 శతాబ్దానికి చెందినవిగా గుర్తింపు
పిల్లలు, పెద్దలు కోట అందాలను ఆకాశం నుంచి వీక్షించేందుకు ఆసక్తి చూపారు. ఉద్యానశాఖ ఏర్పాటు చేసిన ఫల, పుష్ప ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. స్వాగత ద్వారం, నెమళ్లు, ఏనుగులు, కొంగలు, ఎద్దుల బండి, సైకిల్, కోనేరు నర్సరీ వంటి వాటిని వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించారు. కొండవీడు గొప్పతనం, రెడ్డిరాజుల పాలనా వైభవాలను ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలనే ఉద్యేశంతోనే ఉత్సవాలను ఘనంగా నిర్వహించినట్లు పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు.
Kondaveedu Fort: కొండవీడు అభివృద్ధికి మరిన్ని నిధులు: మంత్రి బాలినేని
విద్యార్థులు, కళాకారులు, జబర్దస్త్ బృంద సభ్యులు కళా ప్రదర్శనలతో సందడి చేశారు కొండవీడు రాజ్యం, ఖిల్లా నమూనా సైకత శిల్పం చూపరుల మనసుల్ని కట్టిపడేసింది. చారిత్రక అంశాలు తెలిపే గ్యాలరీ ఆకట్టుకుంది. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జంపింగ్ తదితర ఆట వస్తువులు పిల్లలను అక్కున చేర్చుకున్నాయి. బోటింగ్, ఆర్చరీ, గన్ షూటింగ్, ట్రెక్కింగ్, రాక్ క్లైంబింగ్ వంటి సాహస క్రీడల్లో యువత ఉత్సాహంగా పాల్గొని సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు.