Kickboxer Attack on Electricity Meter Reading Staff : కరెంటు బిల్లు చెల్లించమన్నందుకు విద్యుత్ సిబ్బందిపై ఓ కిక్ బాక్సర్ దాడి చేసి తీవ్రంగా గాయపర్చిన సంఘటన సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. తీవ్రంగా గాయపడిన కరెంటు సిబ్బందిని తోటి సిబ్బంది స్థానికులు కలిసి ఈఎస్ఐసీ ఆసుపత్రికి తరలించారు. అనంతరం విద్యుత్ ఉద్యోగ సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ తర్వాత సనత్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
విద్యుత్ సంఘ నాయకులు తెలిపిన వివరాలు ప్రకారం, ఎర్రగడ్డ ప్రాంతంలో విద్యుత్ లైన్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న హెచ్.శ్రీకాంత్, మీటర్ రీడర్ సాయి గణేశ్ ఉదయం మోతీనగర్ మీటర్ రీడింగ్‌కు వెళ్లారు. మోతీనగర్‌లోని రాముల పేరిట ఉన్న ఇంటి వద్దకు వెళ్లి కరెంటు బిల్లు బకాయి రూ.9,858 చెల్లించాల్సి ఉందని చెప్పారు. ఇంటి యజమాని కుమారుడు(కిక్ బాక్సర్) వచ్చి బిల్లు చెల్లించమని ఏం చేసుకుంటారో చేసుకొండని దురుసుగా ప్రవర్తించాడు. దీంతో విద్యుత్ సిబ్బంది ఎంసీబీ ఆఫ్ చేసి విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.
విద్యుత్ నిలిపివేయడంతో పట్టలేని కోపంతో ఆ యువకుడు మీటర్ రీడర్ సాయి గణేశ్‌ను పిడి గుద్దులతో తీవ్రంగా కొట్టి, మీదపడి తన్నాడు. అడ్డుకోబోయిన శ్రీకాంత్పైదాడి చేశారు. ఈ సంఘటనలో సాయి గణేశ్ కుడి కన్ను, ఇతర శరీర భాగాలపై తీవ్ర గాయాలు అయ్యాయి. ఆ యువకుడిని స్థానికులు అడ్డుకోవడంతో అక్కడి నుంచి శ్రీకాంత్ అతనిని వెంటనే ఈఎస్ఐసీ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. వైద్యుల పర్యవేక్షణలో అతడు చికిత్స పొందుతున్నాడు. వెంటనే బాధితులు సనత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సనత్‌నగర్ పోలీసులు బీఎన్ఎస్ చట్టం ప్రకారం 142, 115 క్లాజ్-2 కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
విద్యుత్ ఉద్యోగ సంఘం తీవ్ర ఆగ్రహం : మీటర్ రీడర్, లైన్ ఇన్స్పెక్టర్పై జరిగిన దాడిని విద్యుత్ ఉద్యోగ సంఘం తీవ్రంగా ఖండించింది. మీటర్ రీడర్లపై ఇటీవల దాడులు పెరుగుతున్నాయని అన్నారు. దీంతో తాము ఉద్యోగం చేయాలా వద్దా అనే సంశయం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సంఘటనపై యూనియన్ ప్రతినిధులతో చర్చించి కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. ఈ సంఘటనను సీఎండీ, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామని చెప్పారు. మీటర్ రీడర్‌పై దాడి చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.