Khammam Student US Scholarships Story : అమెరికాలో ఒక్క యూనివర్సిటీలో ఉపకారవేతనం సాధించడమే చాలా కష్టం. అలాంటిది ఈ కుర్రాడేమో ఏకంగా 4 ప్రఖ్యాత యూనివర్సిటీల్లో స్కాలర్‌షిప్‌కు ఎంపికయ్యాడు. ప్రతిష్ఠాత్మక జార్జియా యూనివర్సిటీలో ఉచితంగా చదివే అవకాశం సొంతం చేసుకున్నాడు. ఆల్‌రౌండ్ ప్రతిభ చూపించి కలల కెరీర్‌కు మార్గం వేసుకున్నాడు.
ఖమ్మంకు చెందిన సాకేత్ సాగర్‌కు చిన్నప్పటి నుంచే అమెరికాలో చదవాలనే కోరిక ఉండేది. అందుకు అర్హత పొందాలంటే ఏం చేయాలని 8వ తరగతి నుంచే సామాజిక మాధ్యమాల్లో వెతికేవాడు. 8 నుంచి 12వ తరగతి వరకూ అత్యధిక మార్కులు వచ్చినా ఆంగ్లం, సామాజిక కార్యక్రమాల్లోనూ చురుగ్గా ఉండాలని తెలుసుకున్నాడు.
ఇందుకు 10వ తరగతి నుంచే SAT, IELTS పరీక్షలకు సాకేత్ సన్నద్ధమవటడం ప్రారంభించాడు. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుండగానే అమెరికాలోని పలు యూనివర్సిటీల్లో ప్రవేశాలకు నిర్వహించే పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నాడు. అమ్మానాన్నలూ ప్రోత్సహించడంతో మరింత శ్రద్ధగా సాకేత్ చదివాడు.
"తొమ్మిదో తరగతి నుంచి యూఎస్‌లో చదువుకోవాలనే కోరిక ఉండేది. తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్ వరకు ఎన్ని మార్కులు తెచ్చుకోవాలో తెలుసుకున్నాను. యూట్యూబ్‌లో ఇలా ఎంతమంది యూఎస్‌లో చదవడానికి ప్రిపేర్ అవుతున్నారని వెతికాను. ఎస్ఐటీ ఎగ్జామ్ ఇంటర్ మొదటి ఏడాదిలోనే రాశాను. అందులో మంచి స్కోర్ వచ్చింది. ఇలా అమెరికా యూనివర్సిటీలో స్కాలర్షిప్ సాధించాను. ప్రముఖ జార్జియా యూనివర్సిటీ నుంచి 100 శాతం స్కాలర్షిప్ సాధించాను. ఇలా కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి సొంతంగా ఒక కంపెనీ పెడతాను." - సాకేత్ సాగర్, యూఎస్ స్కాలర్‌షిప్‌కు ఎంపికైన విద్యార్థి
తల్లిదండ్రులపై ఆర్థికభారం మోపకుండా అత్యుత్తమ ప్రతిభతో డ్రెక్సెల్, ఆరిజోనా, సిన్సినాటి, అట్లాంటాలోని జార్జియా యూనివర్సిటీల్లో స్కాలర్‌షిప్‌కు సాకేత్ అర్హత సంపాదించాడు. న్యూయార్క్‌లోని పేస్ యూనివర్సిటీలోనూ ప్రతిభకు కొలమానంగా భావించే ప్రెసిడెన్షియల్ స్కాలర్‌షిప్‌కు అర్హత పొందాడు. వంద శాతం ఉపకార వేతనం ప్రకటించడంతో జార్జియా యూనివర్సిటీలోనే చేరాలని ఈ కుర్రాడు నిశ్చయించుకున్నాడు.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌లో పట్టా పొందాలి : ఇంటర్లో ఇంగ్లీష్ టీచర్ నాగరాజు, వెంకీ సార్లు తన విజయంలో కీలకపాత్ర పోషించారని సాకేత్ చెబుతున్నాడు. తనలాగే యూఎస్‌లో వందశాతం స్కాలర్‌షిప్‌తో చదివేందుకు ఏం చేయాలో వివరిస్తున్నాడు ఈ కుర్రాడు. కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి పేరొందిన యూనివర్సిటీలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌లో పట్టా పొందాలని లక్ష్యంగా సాకేత్ పెట్టుకున్నాడు. చదువు పూర్తి అయ్యాక సొంత కంపెనీ స్థాపించి ఉపాధి కల్పిస్తానని పేర్కొన్నాడు.
తమ కుమారుడి ధీమా చూసి ప్రోత్సహించాం : కుమారుడి ధీమా చూసి తాము ప్రోత్సహించాం. ఎంతో మంది సాధించలేని అమెరికా యూనివర్సిటీ స్కాలర్షిప్ను తమ కుమారుడు పొందాడు. చిన్నవయసులోనే పెద్ద లక్ష్యాన్ని నిర్దేశించుకున్న సాకేత్ అందుకు అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా సిద్ధమై విజయం సాధించాడు. విదేశాల్లో చదవాలనే ఆసక్తి, కష్టపడే తత్వం ఉంటే తనలాగే ఎవరైనా వందశాతం స్కాలర్షిప్ సాధించగలరు. అని సాకేత్ తల్లిదండ్రులు చెబుతున్నారు.
YUVA : పేదింటి విద్యాకుసుమం- ట్యూషన్లు చెబుతూనే 4 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువతి - YUVA STORY