Key Leaders Absent for CM Jagan Meeting: ఉమ్మడి ప్రకాశం జిల్లా వేదికగా ఒంగోలులో జరిగిన ముఖ్యమంత్రి జగన్ సభకు ఆ పార్టిలో ముఖ్యనేతలు డుమ్మా కొట్టారు. నిన్న మొన్నటి వరకూ జగనే మా దేవుడు అని కీర్తించిన వారు తమ నేత జిల్లాకు వస్తే, కనీసం పలకరించడానికి కూడా రాలేదు. ఒంగోలు సమీపంలో ఎన్.అగ్రహారంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విచ్చేశారు. జిల్లాకు ఆయన ఎప్పుడు వచ్చినా దిగువ స్థాయి నుంచి పైస్థాయి వరకూ ప్రజా ప్రతినిధులు, నాయకులు హాజరై, పార్టీ నేతను కలిసి ఆయన మెప్పుకోసం ప్రయత్నించేవారు.
ఆయన కళ్లల్లో కనబడటం కోసం నానా ప్రయత్నాలు చేసేవారు. హెలికాప్టర్ దిగిన దగ్గర నుంచి తిరిగి వెళ్లే వరకూ అడుగులకు మడుగులు వత్తుతూ మెప్పుకోసం ప్రయత్నించేవారు. అలాంటిది ఒంగోలు వచ్చిన ఆయనకు ముఖ్యనేతలు కొందరు డుమ్మా కొట్టడం విశేషం. ప్రధానంగా ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రధాన కేంద్రానికి జగన్ వస్తే, పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసులరెడ్డి రాలేదు.
ప్రొటోకాల్ ప్రకారం ఎంపీకి కూడా గుర్తింపు ఉంది. ఆయన నియోజకవర్గానికి ముఖ్యమంత్రి వస్తే స్వాగతం పలకడం దగ్గర నుంచీ అన్నీ ఏర్పాట్లు చూసుకోవాలి. కానీ ఆయన పత్తాలేదు. పోనీ ఆయనేదో బిజీగా ఉండి ఉంటే, కనీసం ఆయన కుమారుడు రాఘవరెడ్డిని కూడా పంపలేదు. దీంతో ఆయన పార్టీ మారతారని గత కొద్ది కాలంగా జరుగుతున్న ప్రచారానికి ఎంపీ గైర్హాజరు ఊతమిచ్చింది.
సీఎం పర్యటనతో 2 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన బస్సులు - ప్రజల అవస్థలు
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కందుకూరు , దర్శి ఎమ్మెల్యేలు ఎమ్. మహిధర్ రెడ్డి, మద్దిశెట్టి వేణుగోపాలరావులు కూడా హాజరు కాలేదు. టికెట్లు లేవని తేల్చిన సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్ బాబు, కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూధన్ యాదవ్‌లు కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు హాజరు కానప్పటికీ ముఖ్యమంత్రి సభకు మాత్రం హాజరయ్యారు.
కాకపోతే, శిద్ధా కుమారుడు, టీటీడీ పాలకమండలి సభ్యుడు శిద్ధా సునీల్ హాజరయ్యారు. ఈ కార్యక్రమం అంతా ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. జగన్ మాట్లాడినంత సేపు ఆయన పక్కన బాలినేనితో పాటు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి చెవిరెడ్డి భాస్కర రెడ్డి నిలబడి ఉన్నారు. ఇటీవలే రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయిన, ప్రకాశం జిల్లాకు చెందిన వైవీ సుబ్బారెడ్డి కూడా హాజరు కాలేదు.
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన ప్రసంగంలో ఎంతసేపూ పేదలు, పెత్తందారులు అంటూ చంద్రబాబు మీద విమర్శలు చేయడానికే ఎక్కువ సమయం కేటాయించారు. జిల్లా సమస్యలు, గానీ, జిల్లాకు చేసిన అభివృద్ధిగానీ ప్రస్థావించలేదు. పైగా జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు పేర్లుగానీ, ప్రస్థావనగానీ తీసుకురాకపోవడం విశేషం. బాలినేని పేరు కూడా ఎక్కడా ప్రస్థావించలేదు. ఇళ్ల పట్టాలు పంపీణీ సమయంలో గానీ, ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలు వివరించడంలో గానీ మున్సిపల్ పరిపాలన కార్యదర్శి శ్రీలక్ష్మీ హడావుడి బాగా కనిపించింది.