Kalaralu in Ongole Dasara Celebrations : దసరా ఉత్సవాల్లో ఒంగోలుకే శతాబ్దాలుగా ప్రత్యేకమైనవి కళారాలు. శరన్నవరాత్రుల్లో అమ్మవారి అలంకరణలు, అభిషేకాలు ఒక ఎత్తైతే కళారాల ఊరేగింపు మరో ఎత్తు. దుర్గాష్టమి, మహర్నవమి రోజుల్లో అర్ధరాత్రి పూట నుంచి సాగే ఈ వేడుకలను కనులారా తిలకించేందుకు ఒంగోలు నగరంతో పాటు ఎక్కడెక్కడి నుంచో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. కళారాలను దర్శించుకుని అమ్మవార్లకు మొక్కులు సమర్పిస్తారు. విజయ దశమి పర్వదినాన్ని పురస్కరించుకుని కళారాల మహోత్సవానికి జిల్లా కేంద్రం సిద్ధమైంది. ఈ తరుణంలో ఒంగోలుకే ప్రత్యేకమై తలమానికంగా నిలుస్తున్న ఈ వేడుక ప్రాశస్త్యం గురించి ఓసారి తెలుసుకుందాం.
ఇదీ స్థల పురాణం : 'యుద్ధంలో రక్తబీజుడు అనే రాక్షసుడి తలను అమ్మవారు ఖడ్గంతో ఖండించగా రక్తం ధారలుగా నేల మీద పారింది. అనంతరం ప్రతి రక్తపు చుక్క నుంచి మళ్లీ ఒక రాక్షసుడు తిరిగి పుట్టుకొస్తాడు. ఫలితంగా రోజంతా యుద్ధం చేసినా రక్త బీజుడి సంహారం పూర్తి కాలేదు. అప్పుడు అమ్మవారు కాళికాదేవి అవతారమెత్తారు. పెద్ద నాలుకతో రక్తం భూమిపై పడకుండా తాగేసి రాక్షస సంహారం చేశారు. దీంతో ప్రజలంతా కాళికామాతకు జయ జయ ధ్వానాలు పలికి తమ మధ్యనే ఉండిపోవాలని వేడుకున్నారు. ప్రతిగా అమ్మవారు తన భక్తులకు దుష్ట శక్తుల భయం లేకుండా చేసేందుకు తన అంశతో నిబిడీకృతమైన కళారాన్ని(నోరు తెరిచి ఉన్న శిరస్సు భాగం) ప్రసాదించారు. తనతో పాటు నరసింహస్వామి కూడా కళారంగా ప్రజలకు అండగా ఉంటారని తెలిపారు.' అనేది ఇక్కడి స్థల పురాణం.
ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు - భారీగా తరలి వచ్చిన భక్తులు
దుష్టశక్తులు తమ దరిచేరవనేది భక్తుల నమ్మకం : ఒంగోలులో నిర్వహించే కళారాల ఉత్సవానికి వందల సంవత్సరాల చరిత్ర ఉంది. పూర్వం చిన్న గూడు బండ్లపై అమ్మవారి కళారాన్ని ఊరేగించేవారు. తప్పెట్లు వాయిస్తూ కాగడాలు పట్టుకుని అర్ధరాత్రి నుంచి అన్ని వీధుల్లో తెల్లవారే వరకు తిరిగేవారు. కళారాన్ని దర్శించుకుంటే మళ్లీ ఏడాది వరకూ ఎలాంటి దుష్టశక్తులు తమ దరిచేరవనేది భక్తుల నమ్మకం. తమ వీధిలోకి వచ్చిన కళారాన్ని చూసి కాయకర్పూరాలు సమర్పించి మొక్కులు చెల్లించుకునేవారు. ఇందుకోసం ఎంత రాత్రయినా సరే ఎదురుచూస్తుంటారు. కాలక్రమేణా ఉత్సవ నిర్వహణ తీరులో ఆధునికత చోటు చేసుకుంది. డీజేలు, నృత్యాలు, కళారూపాలు, బాణసంచా శబ్దాలతో ఇప్పుడు ఊరేగింపు నిర్వహిస్తున్నారు.
కాళికామాత కళారాలను అట్టహాసంగా ఊరేగింపు : బాలాజీరావుపేట(కనక దుర్గాదేవి), గంటాపాలెం(పార్వతీమాత), బీవీఎస్ హాల్ కూడలి(బాలాత్రిపుర సుందరీదేవి, నరసింహస్వామి), అంకమ్మపాలెం(కాళికామాత), కేశవస్వామిపేట(మహిషాసుర మర్దిని) చోట్ల నుంచి కళారాలు ఊరేగింపుగా బయలుదేరుతాయి. నాలుగు కళారాలు పసుపు వర్ణంలో, కాళికాదేవి ఎరుపు రంగులో, నరసింహస్వామి తెల్లటి రంగులో దర్శనమిస్తుంటారు.
వైభవంగా శరన్నవరాత్రి మహోత్సవాలు - ఆలయాలకు క్యూ కట్టిన భక్తులు
దుర్గాష్టమి రోజు బాలాజీరావుపేట నుంచి కనకదుర్గాదేవి, బీవీఎస్ హాల్ సెంటర్ నుంచి బాలా త్రిపుర సుందరీదేవి, అంకమ్మపాలెం నుంచి కాళికామాత కళారాలను అట్టహాసంగా ఊరేగిస్తారు. దేవతామూర్తులంతా రాత్రి వేళ నగరంలోని పలు మార్గాల్లో పయనించి, తెల్లవారుజామున మస్తాన్‌దర్గా కూడలికి చేరుతారు. అక్కడ గుమికూడిన వేలాది మంది భక్తులకు దర్శన భాగ్యం కలిగిస్తారు. మహర్నవమి రోజున పార్వతీదేవి, నరసింహస్వామి, మహిషాసురమర్దిని అమ్మవార్ల కళారాల ఉత్సవం ఉంటుంది.