Children Life Imprisonment killing Their Father in TG : అల్లారుముద్దుగా పెంచాడు. రెక్కల కష్టంతో చదివించాడు. ఐదుగురు కుమార్తెలు, కుమారుడిని ఎలాంటి లోటూ రాకుండా చూశాడు. కానీ కడుపున పుట్టిన వారే కాటికి పంపుతారని అనుకోలేదు ఆ తండ్రి. రిటైర్‌మెంట్ డబ్బులు ఇవ్వాలని తండ్రిని హతమార్చిన కేసులో నిందితులకు కోర్టు జీవిత ఖైదు విధించింది. నిందితుల్లో ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. 2018లో జరిగిన ఈ ఘటన అప్పట్లో కలకలం రేపింది.
Judgment On Father Murder Case : తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా జిల్లేలగూడకు చెందిన మేడిపల్లి కృష్ణ, వాటర్ వర్స్క్ డిపార్ట్‌మెంట్‌లో పని చేశాడు. అతనికి ఐదుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వీరిలో మొదటి, మూడో కుమార్తెలకు వివాహం చేశాడు. రెండో కుమార్తె మాధురి, నాల్గో కుమార్తె అంజలి, ఐదో కుమార్తె ప్రియాంకకు వివాహం జరగలేదు. కుమారుడు తరుణ్ అందరి కన్నా చిన్నవాడు. ఐటీఐ పూర్తి చేసిన తరుణ్, ఎముక క్యాన్సర్ కారణంగా తన కుడి కాలును పోగొట్టుకున్నాడు. 2018 జూన్‌లో తండ్రి కృష్ణ పదవీ విరమణ పొందాడు.
అతని రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ అన్నీ పొందాడు. కాగా ఆ డబ్బుల కోసం తరుణ్, ముగ్గురు కుమార్తెలు నిత్యం తండ్రితో గొడవపడేవారు. వేధింపులు తట్టుకోలేని కృష్ణ సమీపంలోని నందనవనం కాలనీలోని వేరే ఇంట్లోకి మారాడు. 2018 నవంబర్‌లో ఒక రోజు తన సొంతింటికి వెళ్లాడు. ఇదే సమయంలో ఇంట్లో తరుణ్, ప్రియాంక, మాధురి, అంజలి ఉన్నారు. రిటైర్‌మెంట్ డబ్బులు ఇవ్వాలని మరో మారు తండ్రితో పిల్లలు వాగ్వాదానికి దిగారు.
ప్రమాదంగా చిత్రీకరించాలనుకున్న నిందితులు : కృష్ణ అందుకు ఒప్పుకోకపోవడంతో ఇనుప రాడ్డుతో తరుణ్ దాడి చేశాడు. కాళ్లు, తలపై తీవ్రంగా కొట్టాడు. దీంతో కృష్ణ కుప్పకూలిపోయాడు. ఇందుకు కుమార్తెలు సహకరించారు. హత్య అనంతరం అంజలి, ప్రియాంక రక్తపు మరకలు తుడిచి ప్రమాదంగా చిత్రీకరించాలనుకున్నారు. సమీప ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై మృతుని సోదరుడు సుదర్శన్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన మీర్‌పేట్ పోలీసులు, సాక్ష్యాధారాలు కోర్టుకు సమర్పించారు. విచారణ జరిపిన రంగారెడ్డి కోర్టు నిందితులు తరుణ్, అంజలి, ప్రియాంకకు జీవిత ఖైదుతో పాటు రూ.500 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది.
Vijayawada Minor Girl Case: కామాంధుడికి జీవితఖైదు..మూడు లక్షల జరిమానా