Prathipati Pullarao Son Sharath Judicial Remand : జీఎస్టీ ఎగవేత, నిర్మాణ పనుల్లో నిధుల మళ్లింపునకు పాల్పడ్డారనే ఆరోపణలపై అరెస్టు అయిన ఏపీ మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్‌కు న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. శరత్‌ను గురువారం హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్న అనంతరం విజయవాడకు తీసుకొచ్చారు. గురువారం రాత్రి వైద్య పరీక్షల అనంతరం క్రీస్తు రాజపురంలోని ఒకటో అదనపు చీఫ్ మెట్రోపాలిటిన్ మేజిస్ట్రేట్ కోర్టు జడ్జి కరీముల్లా నివాసంలో పోలీసులు శరత్‌ను హాజరు పరిచారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ఈ కేసులో 409 సెక్షన్ చెల్లదన్నారు. 469 సెక్షన్‌ను పరిగణనలోకి తీసుకుని 14 రోజులు జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. అనంతరం పోలీసులు శరత్‌ను విజయవాడలోని జిల్లా జైలుకు తరలించారు. శరత్‌పై మాచవరం పీఎస్‌లో కేసు నమోదు అయ్యింది. ప్రత్తిపాటి కుమారుడు, భార్య, బావమరిది సహా ఏడుగురిపై కేసు నమోదు చేశారు.
Prathipati Sharath Arrest : విజయవాడ ఫస్ట్ ఏసీఎంఎం కోర్టులో శరత్ తరపు లాయర్లు బెయిల్ పిటిషన్ వేశారు. లోతైన విచారణకు 10 రోజులు కస్టడీకి కోరుతూ పోలీసు తరఫు లాయర్లు కూడా పిటిషన్ దాఖలు చేశారు. కౌంటర్ దాఖలు చేయాలని ఇరు వర్గాలను కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది.
శరత్ అరెస్టు అక్రమం - ముమ్మాటికి ప్రభుత్వ కక్ష సాధింపు చర్య: టీడీపీ
న్యాయాన్ని, ధర్మాన్ని నమ్ముకున్నాం : గద్దె దిగే సమయంలో కూడా సీఎం జగన్ తన విధ్వంసం, విద్వేషాన్ని కొనసాగిస్తున్నాడని మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మండిపడ్డారు. గురువారం తన కుమారుడు శరత్‌ను 16 గంటల పాటు గుర్తు తెలియని ప్రాంతాల్లో తిప్పారని ఆయన ఆరోపించారు. రాజకీయంగా ప్రజాక్షేత్రంలో తనను ఎదుర్కోలేక అక్రమ కేసులు పెట్టి తన కుమారుడిని అరెస్టు చేసి తనను నైతికంగా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. తాను న్యాయాన్ని, ధర్మాన్ని నమ్ముకున్నానని తెలిపారు.
అరాచకం అకృత్యాలు నమ్ముకున్న జగన్‌ను అవే తొక్కిపెడతాయని ప్రత్తిపాటి పుల్లారావు వ్యాఖ్యానించారు. ఏపీ స్టేట్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఎవరి ఆధీనంలో ఉందని ప్రశ్నించారు. ప్రతిపక్షాలపై కక్ష సాధింపు కోసమేనా ప్రభుత్వానికి సంబంధం లేకుండా రెవెన్యూ ఇంటెలిజెన్స్ సృష్టించిందని మండిపడ్డారు. డీఆర్ఐ ఇప్పటి వరకు పెట్టిన కేసులన్నీ తెలుగుదేశం నేతలపైనేనని విమర్శించారు. తెలుగుదేశం జనసేన సభలు విజయవంతం అవుతుండటంతో వాటి నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు డీఆర్ఐ అక్రమ కేసుల్ని తెరపైకి తెస్తోందని ఆరోపించారు. జగన్ రెడ్డి చేస్తున్న కుట్రలు, కుతంత్రాలు తెలుగుదేశం పార్టీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీయలేవని ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు.
జగన్ క్షమాపణ కోరాలి : సీఎం ఆత్మలుగా చెప్పుకునే వ్యక్తులు కూడా ఆయన్ని నమ్మడం లేదని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఎన్నికలకు అభ్యర్థులు కూడా దొరకరనే భయంతో, జగన్ అక్రమ కేసులు పెట్టి ఉనికి చాటుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. తన దోపిడీ, అక్రమాల నుంచి జగన్ తప్పించుకోలేడని అన్నారు. శరత్‌పై పెట్టిన అక్రమ కేసు తక్షణమే ఉపసంహరించుకుని ప్రజల్ని జగన్ క్షమాపణ కోరాలని ఆయన డిమాండ్ చేశారు.
పోలీసుల అదుపులో ప్రత్తిపాటి కుమారుడు - విజయవాడ సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
గురువారం ఏం జరిగింది : ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ అక్రమ అరెస్టుపై టీడీపీ నేతలు భగ్గుమన్నారు. చిలకలూరిపేటలో రోడ్లపైకి వచ్చి నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. సరైన సమాచారం ఇవ్వకుండా తీసుకువెళ్లడంపై ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ గురువారం రాత్రి విజయవాడలోని పోలీస్ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించారు. టీడీపీ నేతలు ప్రత్తిపాటి పుల్లారావు, గద్దె రామ్మోహన్, కొమ్మారెడ్డి పట్టాభిరామ్, మాణిక్యాలరావు, న్యాయవాది లక్ష్మీనారాయణ, ఇతర నాయకులు అక్కడకు చేరడంతో పోలీసులు గేటు వద్ద అడ్డుకోని మోహరించారు. సీపీని కలిసేందుకు అనుమతి ఇవ్వాలంటూ నాయకులు ఆందోళనకు దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. చివరికి నలుగురికే అనుమతించడంతో గద్దె రామ్మోహన్, పుల్లారావు, పట్టాభి, న్యాయవాది లక్ష్మీనారాయణ లోపలికి వెళ్లి డీసీపీ కంచె శ్రీనివాసరావుతో మాట్లాడారు.
తన కుమారుడిని ఎవరు, ఎందుకు అరెస్టు చేశారో చెప్పలేదని, నోటీసులు ఇవ్వకుండా అక్రమంగా అరెస్టు చేశారని ప్రత్తిపాటి వివరించారు. మాచవరం పోలీసులు అరెస్టు చేశారని డీసీపీ తెలిపారు. గంటలో న్యాయమూర్తి ఎదుట హాజరు పరుస్తామని హామీ ఇచ్చారు.
న్యాయవాది లక్ష్మీనారాయణ మాట్లాడుతూ సీఐడీతో పాటు తాజాగా కొత్తగా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ రంగంలోకి దిగి ప్రతిపక్షాలను ఇబ్బందులు పెడుతోందని ఆరోపించారు. జీఎస్టీ యాక్ట్ కింద ఎవరిపై దర్యాప్తు చేయాలన్నా ముందుగా నోటీసులు ఇవ్వాలని, కానీ శరత్‌కు అలా ఇవ్వలేదని తెలిపారు. ఆయన 2017లో అదనపు డైరెక్టర్‌గా రెండు నెలలు మాత్రమే పని చేశారని తెలిపారు. ఎక్కడా ఆరోపణలు లేవని అన్నారు.
కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ ఒత్తిడి వల్లే ఈ తప్పుడు కేసు నమోదు చేశారని విమర్శించారు. శరత్ ఆచూకీ కోసం ఉదయం నుంచి తిరిగి తిరిగి చివరకు కమిషనర్ కార్యాలయానికి వచ్చామన్నారు.