JD And Vijayakumar Complaint to EC Against Volunteers: వాలంటీర్లపై ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాకు జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు జేడి లక్ష్మీనారాయణ, లిబరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు విజయకుమార్‌లు ఫిర్యాదు చేశారు. వాలంటీర్లు, మెప్మా వారిని ఇతర ప్రాంతాలకు బదిలీలు చేయాలని నేతలు సీఈవోను కోరారు. ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరిగేలా చూడాలన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు పెట్టాలని జేడీ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు ఎన్నికలను ఒక యుద్ధంగా అభివర్ణిస్తూ ప్రచారం చేస్తున్నాయని పేర్కొన్నారు. మద్యం, నగదు విక్రయాలపై తగిన చర్యలు తీసుకోవాలని సీఈవోను ఇరుపార్టీ నేతలు కోరినట్లు తెలిపారు. మద్యం దుకాణాల్లో డిజిటల్ చెల్లింపుల విధానం అమలు చేయాలన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కెమెరాలు ఏర్పాటు చేయాలని జేడీ కోరారు.
సస్పెండ్ చేస్తున్న వాలంటీర్లు ఇప్పుడు బాహాటంగా అధికార పార్టీ కోసం పని చేస్తున్నారని నేతలు స్పష్టం చేశారు. వాలంటీర్లను ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ లాంటి దూర ప్రాంతాలకు బదిలీ చేయాలని సీఈవోను జేడీ కోరారు. ఎక్కడ ఉన్న వాలంటీర్లు అక్కడే ఉంటే పారదర్శకంగా ఎన్నికలు జరగవని సీఈవోకు వివరించారు. రాష్ట్రంలో ఫ్లయింగ్ స్క్వాడ్లు నిఘా పెట్టినా డబ్బు పంపిణీనీ అరికడుతున్న దాఖలాలు కనిపించడం లేదని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విజయ కుమార్ స్పష్టం చేశారు.
ప్రస్తుత పార్టీలు గత ఎన్నికల కంటే ఈసారి మరింత ఎక్కువ ఖర్చు చేస్తాయని తెలిపారు. గతంలో ఓటుకు రెండు వేలు పంపిణీ చేయగా ఈసారి ఇంకా ఎక్కువ చేసే అవకాశం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. మద్యం విక్రయాలను నగదు రూపంలో కాకుండా డిజిటల్‌గా తీసుకోవాలని సీఈవోను కోరిన్నట్లు వివరించారు. పారదర్శకంగా ఎన్నికలు జరిపించాలని సీఈవోను కోరామని తెలిపారు. రైతు భరోసా లాంటి పథకాలు ఒక్క బటన్ నొక్కి ఇవ్వగలిగినప్పుడు పెన్షన్ కూడా ఒక్క బటన్ తోనే ఇవ్వొచ్చు కదా అని ప్రశ్నించారు.
పింఛన్ల పంపిణీ నుంచి వాలంటీర్లను దూరంగా ఉంచాలన్న ఈసీ అన్ని నగదు పంపిణీ పథకాల నుంచి వారిని దూరంగా ఉంచాలని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. వాలంటీర్లతో నగదు పంపిణీ చేయించవద్దని సీఈవోను ఈసీఐ ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. నగదు పంపిణీ పథకాల్లో ప్రభుత్వ ఉద్యోగులను వాడుకోవాలని సూచించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాకు ఈసీఐ ఆదేశాలు జారీ చేసింది.