Janasena First List 2024: రానున్న ఎన్నికల్లో 24 శాసనసభ, 3 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయనున్నట్లు జనసేనాని ప్రకటించారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు 5 అంకె ఇష్టమని అందువల్లే మరికొన్ని స్థానాలు, అభ్యర్థులపై పూర్తి స్పష్టత ఉన్నప్పటికీ తొలి జాబితాలో 5 స్థానాలే ప్రకటించారని తెలిసింది. మిగిలిన స్థానాల్లో ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లోనే ఎక్కువగా సీట్లు కోరుతున్నారు. భీమవరం నుంచే బరిలో దిగాలని పవన్ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అనకాపల్లి ఎంపీ స్థానం నుంచి ఆయన సోదరుడు నాగబాబు, మచిలీపట్నం నుంచి బాలశౌరి పోటీ దాదాపుగా ఖాయమైంది. కాకినాడ నుంచి సానా సతీశ్‌తో పాటు మరో రెండు పేర్లు పరిశీలనలో ఉన్నాయి.
తొలి జాబితాలో 5 శాసనసభ స్థానాలివే:
* తెనాలి - నాదెండ్ల మనోహర్
* నెల్లిమర్ల - లోకం మాధవి
* అనకాపల్లి - కొణతాల రామకృష్ణ
* రాజానగరం - బత్తుల బలరామ కృష్ణ
* కాకినాడ రూరల్ - పంతం నానాజీ
శాసనసభ నియోజకవర్గాల్లో జనసేన ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లోనే ఎక్కువ స్థానాలు తీసుకుంటోంది. ఉమ్మడి తూర్పు గోదావరిలో ఇప్పటికే కాకినాడ గ్రామీణ, రాజానగరం స్థానాలకు అభ్యర్థులను పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రకటించారు. రాజోలులో సైతం పోటీకి సిద్ధమవుతున్నారు. వీటికి తోడు రాజమహేంద్రవరం గ్రామీణ, పిఠాపురం స్థానాలనూ ఆ పార్టీ కోరుకుంటోంది. ఇక్కడ టీడీపీకి బలమైన అభ్యర్థులు ఉండటంతో కూలంకషంగా చర్చ జరుగుతోంది.
వీరిద్దరు బలమైన అభ్యర్థులే: రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గంలో జనసేన నుంచి కందుల దుర్గేష్ బలమైన అభ్యర్థిగా ఉన్నారు. అక్కడ టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి కూడా సీటు కావాలంటున్నారు. ఇద్దరూ బలమైన అభ్యర్థులేనని ఇద్దరికీ అవకాశం కల్పిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు.
జనసేన కోరుతున్న స్థానాలివే: ఇతర జిల్లాల్లో శ్రీకాకుళం జిల్లా పాలకొండ స్థానం జనసేన కావాలంటోంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో పెందుర్తి, యలమంచిలి, విశాఖ దక్షిణ స్థానాల్లో ఏవైనా రెండు జనసేనకు దక్కే ఆస్కారం ఉంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో విజయవాడ పశ్చిమ, అవనిగడ్డ స్థానాలతోపాటు ప్రకాశం జిల్లాలో దర్శి కూడా అడుగుతున్నారు. తిరుపతి, చిత్తూరు శాసనసభా స్థానాల్లో ఒకటి కోరుతోంది. మదనపల్లి స్థానంపైనా ఆ పార్టీ దృష్టి పెట్టింది. గుంటూరు పశ్చిమ, అనంతపురం స్థానాలను జనసేన నేతలు కోరుతున్నారు.
వీటిలో తెనాలి నుంచి జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, విజయనగరం జిల్లా నెల్లిమర్ల నుంచి లోకం మాధవి, అనకాపల్లి నుంచి కొణతాల రామకృష్ణ, కాకినాడ గ్రామీణం నుంచి పంతం నానాజీ, రాజానగరం నుంచి బత్తుల బలరామకృష్ణ పోటీలో ఉంటారని వెల్లడించారు.