Ramoji Rao Memorial Meeting : సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన రామోజీరావు వేలాది మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగిన విధానం అందరికీ ఆదర్శనీయమని ఈనాడు ఏపీ సంపాదకుడు ఎం.నాగేశ్వరరావు అన్నారు. గుంటూరులో నిర్వహించిన రామోజీరావు సంస్మరణ సభకు హాజరైన ఆయన, రామోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 35 ఏళ్లుగా రామోజీరావుతో ఉన్న అనుబంధాన్ని నాగేశ్వరరావు సభికులతో పంచుకున్నారు. మరణాన్ని కూడా ముందే ఊహించిన దార్శనికుడు రామోజీరావు అని కొనియాడారు.
గుంటూరులో రామోజీరావు సంస్మరణ సభ : గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జన చైతన్య వేదిక, ఠాగూర్ మెమోరియల్ థియేటర్ ట్రస్ట్‌ల ఆధ్వర్యంలో అక్షరయోధులు రామోజీరావు సంస్మరణ సభ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాజకీయ, పాత్రికేయ, సాహిత్యరంగాలకు చెందిన ప్రముఖులు రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ దివంగత రామోజీరావు సేవలను కొనియాడారు. సమాజ రుగ్మతులపై నిరంతరం పోరాడిన సామాజిక విప్లవకారుడిగా రామోజీరావును అభివర్ణించారు. రామోజీరావు జీవిత విశేషాలను ప్రతిబింబించే ఫొటో ఎగ్జిబిషన్ అందరినీ ఆకట్టుకుంది.
అక్షర యోధుని సేవలు గుర్తుచేసుకున్న ప్రముఖులు : ఈనాడు, ఈటీవీ ద్వారా తెలుగు భాష ఉద్యమానికి రామోజీరావు ఎనలేని కృషి చేశారని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ గుర్తు చేసుకున్నారు. రామోజీరావు నిరంతర శ్రమజీవి, స్వాప్నికుడని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి కొనియాడారు. రాజకీయ ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగక నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి చివరి క్షణం వరకూ నిజాయతీ, నిబద్ధతతో ఈనాడును ప్రజల పక్షాన నిలిపి ప్రజాస్వామ్యాన్ని కాపాడిన అక్షరయోధుడు రామోజీరావు అని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు అన్నారు.
ఈనాడుతో సరికొత్త చరిత్రకు శ్రీకారం : ప్రభుత్వ వైఫల్యాలపై నిరంతరం యుద్ధం చేస్తూ, ప్రజలకు బాసటగా నిలుస్తూ ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషి చేసిన అక్షరయోధులు రామోజీరావు అని లావు శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు. మార్గదర్శితో వ్యాపార రంగంలో విజయం సాధించిన రామోజీరావు, ఈనాడుతో సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారన్నారు.
అనేక కష్టాలు, ఇబ్బందులకు వెరవక ఈ స్థాయికి చేరుకున్నారు. నేటి యువత రామోజీరావు నిబద్ధత, దృఢ సంకల్పం, క్రమశిక్షణలను అలవర్చుకోవాలని కోరారు. సమాజ రుగ్మతులపై నిరంతరం పోరాడిన సామాజిక విప్లవకారుడు రామోజీరావు అని ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ అన్నారు.
తెలుగు భాషకు ఎనలేని కృషి చేశారు : ఈనాడు, ఈటీవీల ద్వారా తెలుగు భాష ఉద్యమానికి ఎనలేని కృషి చేశారన్నారు. తెలుగు భాష మృతభాషగా మారుతున్న సమయంలో తెలుగు భాష వికాశానికి సర్వశక్తులు వినియోగించారన్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా రామోజీరావు గుర్తింపు పొందారని, అనేక సంస్థలను ఏర్పాటు చేసి ఎంతో మందికి ఉపాధి కల్పించారని ఎమ్మెల్యే గళ్లా మాధవి కొనియాడారు. ఆయన చేసిన సేవలు ఎన్నటికీ మరువలేనవని, అందుకే జర్నలిజం దిక్సూచి రామోజీరావు అని, పత్రికా రంగాల్లో రామోజీ రావు ఒక లెజెండ్‌గా నిలిచిపోయారన్నారు.
సమాజ హితం కోసం అనుక్షణం పనిచేసిన రామోజీరావు కీర్తి అజరామరమని అభిప్రాయపడ్డారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ప్రభుత్వానికి ధీటుగా సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టిన ఏకైక వ్యక్తి రామోజీరావు అని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అన్నారు. రైతులు, మహిళలు, యువత, చిన్నారుల ఇలా అన్ని వర్గాలకు ఉపయోగపడేలా ఈనాడు పత్రికను తీర్చిదిద్దారన్నారు.
సహాయంలో ముందుంటారు : ఇప్పటివరకు ఎవరూ చేయని విధంగా రామోజీరావు తెలుగు రాష్ట్రాల్లో సేవా కార్యక్రమాల కోసం 120 కోట్ల రూపాయలు విరాళాలు అందించారని వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి అన్నారు. 25 వేల మందికి ప్రత్యక్షంగా, మరో 25 వేల మందికి పరోక్షంగా ఉపాధి కల్పించిన రామోజీ ఆదర్శప్రాయుడని పేర్కొన్నారు. మార్గదర్శిపై విష ప్రచారం చేసినా వాటన్నిటినీ ఎదుర్కొన్న ధీశాలి రామోజీరావు అని తెలిపారు. 1990 దశాబ్దంలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన సంపూర్ణ అక్షరాస్యత ఉద్యమానికి, సారా వ్యతిరేక ఉద్యమానికి ఊతమిచ్చిన సామాజిక స్పృహ గల మహా మనిషి రామోజీ అని కొనియాడారు.
Eenadu Editor Nageswara Rao On Ramoji : గత 35 ఏళ్లుగా రామోజీరావు గారితో ఉన్న అనుబంధాన్ని ఈనాడు ఏపీ సంపాదకులు ఎం.నాగేశ్వరరావు పంచుకున్నారు. సాధారణ డిగ్రీ చేసిన రామోజీరావు వేలాది మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగిన విధానం అందరికీ ఆదర్శమన్నారు. ప్రతి మనిషి ఎదుగుదలకు రామోజీరావు పాటించిన క్రమశిక్షణ, నిబద్ధత, ధైర్య సాహసాలు అవసరమన్నారు. పనిలోనే ఆనందం, పనితోనే ఆనందం, పనిలోనే విశ్రాంతి తీసుకున్న అసామాన్యమైన వ్యక్తి రామోజీరావు అని అభిప్రాయపడ్డారు.
ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో రామోజీరావు సంస్మరణ సభ - హాజరైన ప్రముఖులు - Ramoji Rao Memorial Meet