Jala Mandali Reaction on Sunkishala Project Wall Collapse : హైదరాబాద్ మహానగర ప్రజల దాహార్తి తీర్చేందుకు నల్గొండ జిల్లా పెద్దవూర మండలంలో సుంకిశాల వద్ద నిర్మిస్తున్న ప్రాజెక్టులో సైడ్‌వాల్ కూలిన ఘటనపై జలమండలి వివరణ ఇచ్చింది. ఈ ప్రాజెక్టుని మేఘా ఇంజినీరింగ్ సంస్థ టెండర్ దక్కించుకొని, ఇన్‌టెక్ వెల్‌లో సంపు, పంపు హౌజ్, 3 టన్నెళ్లు, పంప్ హౌజ్ సూపర్ స్ట్రక్చర్‌ను నిర్మిస్తుంది. సుంకిశాల ప్రాజెక్టు ఇన్ టెక్‌వెల్ పనులు 60 శాతం పంపింగ్ మెయిన్ పనులు 70, ఎలక్ట్రో మెకానికల్ పనులు, 40 శాతం పూర్తైనట్లు జలమండలి తెలిపింది.
ఆ ప్రాజెక్టును వర్షాభావ పరిస్థితులు వేసవి కాలంలో నిరంతరాయంగా హైదరాబాద్ నగరానికి నీటి సరఫరా చేయడానికి నిర్మిస్తున్నట్లు జలమండలి వెల్లడించింది. 2021 జులైలో పనులు ప్రారంభం కాగా, రిజర్వాయర్ టన్నెల్ వైపున్న సైడ్‌వాల్స్ 2023 జులైలోనే పూర్తిచేశారని తెలిపింది. 2023 డిసెంబరు నాటికి మొత్తం 4 సైడ్ వాల్ బ్లాకుల్లో, 3 సైడ్ వాల్ బ్లాకులు రిజర్వాయర్ ఫుల్ లెవల్ ఎత్తు వరకు పూర్తయ్యాయని, సంపు ఫ్లోర్ లెవల్ 137 ఉండగా, 43 మీటర్ల నిర్మాణం పూర్తి చేశారని వివరించింది.
వరద పెరగడంతో సుంకిశాల ప్రాజెక్టు టన్నెల్లోకి నీళ్లు : ఈ ఏడాది జనవరి నాటికి నాలుగో సైడ్ వాల్ బ్లాక్‌రూఫ్ స్లాబ్ లెవల్ వరకు పనులు పురోగతిలో ఉన్నట్లు జలమండలి తెలిపింది. వచ్చే వేసవిలోగా నీరు అందించాలనే ఉద్దేశంతో మిడిల్ టన్నెల్ పూర్తి చేయడానికి ఏజెన్సీ నిర్ణయం తీసుకుంది. ఆ ప్రకారం సంపువైపు టన్నెల్‌పై గేటును ఏర్పాటు చేశారు. రిజర్వాయర్ వైపున్న మట్టిని తొలగించారు. రిజర్వాయర్‌కు వరద ఆలస్యంగా వస్తుందని ఏజెన్సీ భావించింది.
మిడిల్ టన్నెల్ కోసం గేట్ ఫిక్సింగ్ పనులు చేపట్టింది. జులై 29, 30, 31 న గేటు బిగింపు పనులు జరిగాయి. ఆ సమయంలో నాగార్జునసాగర్‌కు ఒక్కసారిగా 3.5లక్షల క్యూసెక్కుల ప్రవాహం రావడంతో నీళ్లు టన్నెల్లోకి చేరాయి. టన్నెల్ గేట్‌ధ్వంసమై అనుసంధానంగా ఉన్న సైడ్ వాల్ కూలిపోయింది. ఇదంతా 5 నిమిషాల స్వల్ప వ్యవధిలోనే జరిగిందని జలమండలి వివరించింది.
Sunkishala Retaining Wall Damaged : రిజర్వాయర్ సంపు పూర్తి స్థాయి నీటిమట్టంతో నిండింది. ప్రస్తుత నీటిమట్టం తగ్గిన తర్వాత దెబ్బతిన్న సైడ్ వాల్ భాగాన్ని నిర్మాణ సంస్థ సొంత ఖర్చుతో పునర్మిస్తుందని జలమండలి వివరించింది. ఈ పునర్మిర్మాణ పనులకు సుమారు రూ.20 కోట్ల వరకు ఖర్చు అవుతుందని ప్రాథమికంగా అంచనా వేసింది. ఆ ఘటనపై బోర్డు స్థాయిలో ఉన్నత ఇంజినీర్లతో, ఒక విచారణ కమిటీ ఏర్పాటు చేసినట్లు జలమండలి స్పష్టం చేసింది.
విచారణ సభ్యులుగా జలమండలి ఈడీ, రెవెన్యూ డైరెక్టర్, ప్రాజెక్టు డైరెక్టర్ ఉంటారని ప్రకటించింది. కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటారని మార్చిలో పూర్తి చేయాలనున్న పనులు మరో 2 నెలలు ఆలస్యమయ్యే అవకాశం ఉందని జలమండలి అభిప్రాయపడింది. ఈ ఘటన వల్ల హైదరాబాద్ తాగునీటి సరఫరాకు ఎలాంటి ఆటంకం కలగదని, ప్రస్తుత సరఫరా వచ్చే ఏడాది వరకు యథావిధిగా కొనసాగుతుందని జలమండలి వెల్లడించింది.