Jagananna Vidya Devena Scheme: చదువే ఆస్తి, పేదల పక్షపాతినంటూ సీఎం జగన్ మైకు దొరికినప్పుడల్లా గొప్పలు చెబుతారు. కానీ వాస్తవ పరిస్థితిల్లో మాత్రం ఆయన విద్యార్థులపై పగ పట్టినట్లు వ్యవహరిస్తున్నారు. ఓట్ల కక్కుర్తితో ఆయన ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానాన్నే మార్చేయడంతో తల్లిదండ్రులకు అప్పులే మిగిలాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకు ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులను నేరుగా కళాశాలల యాజమన్యాలకు చెల్లించే విధానం ఉండేది.
తాను ఎన్ని డబ్బులు ఇస్తున్నానో తల్లిదండ్రులకు తెలియాలని అనుకున్నారో లేదా ఆ డబ్బులతోనూ ఓట్ల వేట కొనసాగించాలనుకున్నారో కానీ జగన్ పగ్గాలు చేపట్టగానే అప్పటివరకూ సాగిన విధానంలో మార్పులు చేశారు. జగనన్న విద్యా దీవెన పేరిట ఫీజులను తల్లుల ఖాతాల్లో జమ చేయడం మొదలెట్టారు. గత విద్యా సంవత్సరంలో యువత ఓట్ల కోసం అందులో మళ్లీ మార్పులు తీసుకొచ్చారు. విద్యార్థులు, తల్లుల పేరిట సంయుక్త ఖాతా ఉండాలంటూ నిబంధన పెట్టారు.
అలాగైనా నిధులను సక్రమంగా విడుదల చేశారా.? అంటే అదీ లేదు. యాజమాన్యాల ఒత్తిడితో మరో మార్గం లేని తల్లిదండ్రులు అప్పులు చేసి మరీ ఫీజులు కట్టాల్సి వచ్చింది. విద్యార్థులు, తల్లుల పేరిట సంయుక్త ఖాతా విధానంలో ప్రభుత్వం ఇచ్చే ఫీజులతో కళాశాలలకు సంబంధం లేకుండా పోయింది. దీంతో సర్కారు విడుదల చేసే నిధులతో నిమిత్తం లేకుండా యాజమాన్యాలు వారి విధానంలో ఫీజులు వసూలు చేసుకోసాగాయి.
ఫీజు బకాయిలన్నీ కడితేనే పరీక్షలకు అనుమతిస్తున్నాయి. దీంతో పేదలు ఎక్కడో చోట అప్పులు తీసుకొచ్చి మరీ చెల్లిస్తున్నారు. గతంలో ప్రభుత్వమే కళాశాలలకు చెల్లించడం వల్ల తల్లిదండ్రులను యజమాన్యాలు అంతగా ఇబ్బంది పెట్టేవి కావు. కానీ ఇప్పుడు ప్రభుత్వ బకాయిలను విద్యార్థులే చెల్లించాల్సి వస్తోంది. ఒకవేళ ఫీజులు కట్టకపోతే హాల్‌టికెట్లు ఇవ్వడం లేదు. విద్యార్థులను పరీక్షలకు హాజరు కానివ్వడం లేదు.
కొన్ని సందర్భాల్లో ఫీజులు చెల్లించని వారి పేర్లను నోటీసు బోర్డుల్లో పెడుతున్నారు. మరోవైపు చదువు పూర్తయినా ఫీజులు పూర్తిగా చెల్లించకపోతే యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. ఇది విద్యార్థుల ఉన్నత చదువులు, ఉద్యోగాలకు తీవ్ర ఇబ్బందిగా మారుతోంది. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అని ప్రతి సభలోనూ మాట్లాడే జగన్ ప్రేమ నిజమే అయితే విద్యాసంవత్సరం ముగియవస్తున్నా ఫీజుల బకాయిలు ఉంచుతారా? కుటుంబాలు అప్పుల్లో మునిగిపోతున్నాయని తెలిసినా కిమ్మనకుండా ఉంటారా? అంటూ బాధితులు వాపోతున్నారు.
పేదలను ఇబ్బంది పెట్టే జగనే అసలైన పెత్తందారి అంటూ మండిపడుతున్నారు. ఈ ఐదేళ్ల పాలనలో విద్యార్థుల తల్లిదండ్రులపై 3 వేల 174 కోట్ల భారం పడింది. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఒక త్రైమాసికం ఫీజులకు జగన్ బటన్ నొక్కినా ఇంతవరకు 50శాతంపైగా విద్యార్థుల ఖాతాల్లో డబ్బులు జమ కాలేదు. ఒక్కో త్రైమాసికానికి 708 కోట్ల చొప్పున మూడు విడతలు చెల్లించాల్సి ఉంది. కరోనా సమయంలో తరగతులు నిర్వహించలేదంటూ 2020-21లో ఒక త్రైమాసికం ఫీజును జగన్ సర్కారు ఎగ్గొట్టింది.
కానీ, కళాశాలలు మాత్రం ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో తరగతుల నిర్వహణ, పరీక్షల నిర్వహించామనే సాకుతో విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేశాయి. పోస్టుగ్రాడ్యుయేషన్ కోర్సులకు 2020-21 నుంచి ప్రైవేటు కళాశాలల్లో ఫీజుల చెల్లింపు నిలిపివేశారు. అప్పటి వరకు ప్రవేశాలు పొందిన వారికి ఇవ్వాల్సింది, అంతకు ముందు చెల్లించాల్సిన బకాయిలు కలిపి 450 కోట్లు ఉన్నాయి. వీటిని ప్రభుత్వం ఇవ్వకపోవడంతో చాలామంది తమ సర్టిఫికెట్లను కళాశాలల వద్దే ఉంచేశారు. అవసరమైన వారు మాత్రం అప్పులు చేసి, ఫీజులు కట్టి తీసుకెళ్తున్నారు.
వసతి గృహాల్లో ఉండే డిగ్రీ, బీటెక్ విద్యార్థులకు 20వేలు, పాలిటెక్నిక్ చదివేవారికి 15వేలు, ఐటీఐ వారికి 10వేలు ఇస్తామంటూ ప్రారంభించిన వసతి దీవెనకు జగన్ మంగళం పాడేశారు. ఈ పథకం కింద ఏ ఏడాదీ పూర్తిగా డబ్బులు చెల్లించిన దాఖలాలు లేవు. రెండు విడతలుగా చెల్లిస్తామని చెప్పిన సర్కారు ఆ తర్వాత ఒక్క విడతనే విడుదల చేస్తోంది. 2022-23 విద్యా సంవత్సరంలో ఒకేసారి చెల్లించింది. అదీ సగం మాత్రమే వచ్చాయి. 2023-24కు సంబంధించి ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. కానీ, చాలామంది తల్లిదండ్రులకు వాలంటీర్ల ద్వారా అందించిన పత్రాల్లో మాత్రం వసతి దీవెన ఇచ్చినట్లు చూపారు.
ట్రిపుల్ ఐటీల్లో బీటెక్ చదువుతున్న వారికి వసతి దీవెన డబ్బులే ఆధారం. అక్కడ వసతి గృహంలో ఉంటున్నందుకు ఆ డబ్బులనే వారు నిర్వాహకులకు చెల్లించేవారు. ప్రభుత్వం ఇవ్వకపోవడంతో పేద పిల్లలు సొంతంగానే ఖర్చులు భరించాల్సి వస్తోంది. ట్రిపుల్ ఐటీలు రాష్ట్ర ప్రభుత్వానికి చెందినవైనా నిర్వహణ కష్టంగా ఉందంటూ విద్యార్థుల నుంచి బలవంతంగా వసూలు చేస్తుండటంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి.
సీఎం జగన్ తన రాజకీయ స్వార్థం కోసం పింఛన్లు నిలిపివేశారు: టీడీపీ - TDP Leaders Met CS Jawahar Reddy