Jagan Cheated Higher Caste Poor People : ఓ సినిమాలో హాస్యనటుడు ఇంటి పైకప్పునకు కోడిని వేలాడదీస్తారు. దాన్ని చూసి భోజనం చేస్తూ మాంసం కూర తింటున్నట్లుగా అనుభూతి పొందుతారు. అచ్చం ఇదే మాదిరిగా తయారైంది రాష్ట్రంలో వివిధ వర్గాల కోసం జగన్ ఏర్పాటు చేసిన కార్పొరేషన్ల పరిస్థితి. నిధులను దండిగా కేటాయించినట్లు కాగితాలపై చూపిస్తారు. కానీ ఆ వర్గాలకు ఒక్క రూపాయి కూడా రాయితీ రుణం అందదు. ఉపాధి లభించదు. ‘నవరత్నాల’ నిధులనే సామాజిక వర్గాల వారీగా విభజించారు. వాటినే కార్పొరేషన్లలో చూపించి తిమ్మిని బమ్మి చేశారు. ఇదీ కార్పొరేషన్ల పేరిట ఐదేళ్లపాటు ఆయన చేసిన మాయ. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను మోసం చేసిన జగన్.. అగ్రకులాల్లోని పేదలను కూడా ఇలాగే వంచించారు. క్షత్రియ, వైశ్య, బ్రాహ్మణ, రెడ్డి, కమ్మ, కాపు తదితర అగ్రకులాల్లోని పేదల సంక్షేమానికి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ప్రత్యేకంగా నిధులు ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. మ్యానిఫెస్టోలోనూ ఇదే అంశాన్ని నమ్మబలికారు. తీరా అధికారంలోకి రాగానే హామీని, మ్యానిఫెస్టోను గంగలో కలిపారు.
కాపులను మోసం చేసిన జగన్ - టీడీపీ అమలు చేసిన పథకాలూ ఎత్తివేత - YS Jagan Cheated Kapu Community
'క్షత్రియ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, రెడ్డి, కమ్మ తదితర అగ్రకులాల్లోని పేదల సంక్షేమానికి కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాం. వాటికి తగిన నిధులు కేటాయిస్తాం. ఈ వర్గాల పేదలు ఆర్థికంగా ఎదిగేందుకు అండగా నిలుస్తాం.' ఎన్నికల మ్యానిఫెస్టోలో జగన్
పేదలకు స్వయం ఉపాధి కోసం రాయితీ రుణాలు అందజేసి వారికి అండగా నిలవడమే కార్పొరేషన్ల లక్ష్యం. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం 2014-19 మధ్య ఇదే చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో గతంలోని ప్రభుత్వాలు కూడా ఇలాగే కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వివిధ వర్గాల అభ్యున్నతికి వెన్నుదన్నుగా నిలిచాయి. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అధికారం చేపట్టే నాటికే వివిధ వర్గాలకు కార్పొరేషన్లు ఉండగా అగ్రకులాల్లోని పేదలకు ప్రత్యేకంగా ‘ఆర్థికంగా వెనకబడిన తరగతుల కార్పొరేషన్’ ఏర్పాటు చేశారు. మళ్లీ దాని పరిధిలో రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, క్షత్రియ బ్రాహ్మణ తదితర కార్పొరేషన్లను నెలకొల్పారు. వీటి ద్వారా ఆయా అగ్రకులాల్లోని పేదలకు నిధులు కేటాయించి రాయితీ రుణాలు అందజేస్తానని హామీ ఇచ్చారు. ఈ రుణాలతో స్వయం ఉపాధి పొంది ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చని ఆ వర్గం పేదలు ఆశగా ఎదురుచూశారు. కానీ జగన్ తీరంతా రివర్సే కదా! ఐదేళ్లలో ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. వాటిని తన రాజకీయ కుతంత్రాలను అమలుచేసే సంస్థలుగా మార్చారు.
బీసీలకు జగన్ తీరని ద్రోహం - బ్యాక్‌బోన్ అని కీర్తిస్తూనే వెన్నుపోటు - CM Jagan Cheated BC
పింఛన్లు, ఉపకారవేతనాలు కార్పొరేషన్ల నిధులే : సామాజిక భద్రత పింఛన్లు, ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంటు తదితరాలకు బడ్జెట్‌లో కేటాయించే నిధులనే మళ్లీ కార్పొరేషన్లలో చూపించారు. వివిధ పథకాల కింద లబ్ధిపొందే అగ్రకులాల వారిని సామాజిక వర్గాల వారీగా విభజించి వారికి వెచ్చించిన మొత్తాన్ని ఆయా వర్గాల కోసం ఏర్పాటు చేసిన కార్పొరేషన్లలో మళ్లీ చూపించారు. ప్రతి ప్రభుత్వమూ అర్హులకు సాధారణంగా ఇచ్చే పథకాలే ఇవి. పైగా అందరికీ వర్తించేవే. వీటిని కూడా కార్పొరేషన్ల కింద చూపించి అగ్రకులాల్లోని వారికి ప్రత్యేకంగా మేలు చేసినట్టు మసిపూసి మారేడుకాయ చేశారు జగన్.
వైఎస్సార్సీపీ పునరావాస కేంద్రాలుగా : అగ్రకులాల్లోని పేదల కోసం కార్పొరేషన్లు ఏర్పాటు చేసినట్టు జగన్ పైకి చెప్పినా దాని వెనక ఆయన కుతంత్రం వేరే ఉంది. ఆ వర్గాల్లోని పేదల సంక్షేమాన్ని పక్కన పెట్టి రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ కార్పొరేషన్లను వైఎస్సార్సీపీ రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చేశారు. ఒక్కో కార్పొరేషన్‌కు ఒక ఛైర్మన్, 12 మంది డైరెక్టర్లను నియమించారు. ఈ పదవులన్నింటినీ తన అనుచరగణం, అస్మదీయులకే కట్టబెట్టారు. జీతభత్యాలు, ఇతర సౌకర్యాల కింద వారికి ఇప్పటివరకు రూ.లక్షల ప్రజాధనాన్ని చెల్లించారు.
పేద మహిళలకూ టోకరానే : జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ‘ఈబీసీ నేస్తం’ కింద 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు అగ్రకులాల పేద మహిళలకు రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తానని ప్రకటించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి రావడానికి రెండు రోజుల ముందు మూడో విడత కింద 4.19 లక్షల మంది ఖాతాల్లో రూ.600 కోట్లు విడుదల చేస్తున్నట్లు బటన్ నొక్కారు. కానీ జగన్ ‘బటన్’ ఓ జీవితకాలపు లేటు కదా! బటన్ నొక్కి దాదాపు 45 రోజులు దాటినా ఇప్పటివరకు ఒక్కరికి కూడా బ్యాంకు ఖాతాల్లో నగదు జమ కాలేదు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉన్న దృష్ట్యా ఇప్పట్లో ఆ నిధులు జమ అయ్యే అవకాశమూ లేదు. తన అస్మదీయులు, అనుచరులు చేపట్టిన కాంట్రాక్ట్ పనులకు సంబంధించి మాత్రం కోడ్ రావడానికి కొన్ని రోజుల ముందే రూ.వేల కోట్ల బిల్లులు చెల్లించారు. నిజంగా అగ్రకులాల్లోని పేద మహిళలకు ఆర్థికసాయం అందించాలన్న ఆలోచనే ఉంటే జగన్ ముందుగానే నిధులు విడుదల చేసేవారు. కానీ వారికి ఆర్థిక లబ్ధి చేకూర్చడం ఇష్టం లేకనే ముఖ్యమంత్రి ఈ ‘జగన్నాటకం’ ఆడారు!
ఓట్లు మాకు, పాట్లు మీకు- కాపులను నమ్మించి మోసం చేసిన సీఎం జగన్