AB Venkateswara Rao Vote was Lost : సీనియర్ ఐపీఎస్ అధికారిపై వైసీపీ ప్రభుత్వం మరో మారు కక్ష సాధింపు చర్యలకు పాల్పడింది. ఇన్నాళ్లు సస్పెన్షన్ పేరుతో ఆయన్ను పక్కన పెట్టిన ప్రభుత్వం, తాజాగా ఏబీ వెంకటేశ్వరరావు ఓటు హక్కును కూడా గల్లంతు చేసింది. ఆయనతో పాటుగా అతని సతీమణి ఓటును డిలీట్ చేసింది. విజయవాడ తూర్పు నియోజకవర్గం పరిధిలో ఓటు వేసేందుకు వెంకటేశ్వరరావు వెళ్లగా ఈ విషయం బయటపడింది.
డీజీ ర్యాంకు కలిగిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై ఐదేళ్లుగా కక్ష సాధించిన వైసీపీ ప్రభుత్వం, చివరికి ఆయనతో పాటుగా అతని సతీమణి ఓటు హక్కు లేకుండా చేసింది. విజయవాడ తూర్పు నియోజకవర్గం పరిధిలో నివసించే ఏబీ వెంకటేశ్వరరావు, ఆయన సతీమణి ఆలూరి కవితకు లయోలా కళాశాల ప్రాంగణంలోని 59వ నంబరు పోలింగ్ కేంద్రంలో ఓట్లు ఉండేవి. ఓటు వేసేందుకు సోమవారం ఉదయం దంపతులిద్దరూ పోలింగ్ కేంద్రానికి వెళ్లగా, జాబితాలో నుంచి పేర్లు తొలగించేసినట్లు ఉందని అధికారులు తెలిపారు.
వారి పేర్లు ఉన్న చోట ‘‘డిలీటెడ్’’ అని ఉందని చూపించారు. ఏబీవీ, ఆయన సతీమణి పేర్లు డిసెంబరు వరకూ జాబితాలో కొనసాగాయి. ఆయనకు ఎలాంటి నోటీసు, సమాచారం ఇవ్వకుండానే ఓటు తొలగించేశారు. అక్రమ కేసులు, సస్పెన్షన్లు, పోస్టింగు ఇవ్వకుండా వేధింపులతో ఐదేళ్లుగా కక్ష సాధించిన జగన్ ప్రభుత్వం, చివరికి ఇలా పైశాచిక ఆనందం పొందింది. గతంలో జగన్ ప్రభుత్వ వేధింపులకు గురైన రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఓటు హక్కు కోసం ఏకంగా హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది.
ఐదేళ్ల పాటు తీవ్ర ఇబ్బందులు: నిజాయతీ, సమర్థత కలిగిన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును కక్ష సాధింపులతో జగన్ సర్కార్ ఈ ఐదేళ్ల పాటు తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. ఆయనపై వైసీపీ ప్రభుత్వం విధించిన సస్పెన్షన్ చెల్లదంటూ కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ తీర్పు వెలువరించి కర్రుకాల్చి వాత పెట్టింది. ఐదేళ్లుగా పోస్టింగ్, వేతనాలు ఇవ్వకుండా వేధింపులకు గురి చేసినా ఒంటరిగానే ఏబీ వెంకటేశ్వరరావు పోరాటం చేశారు. హైకోర్టు, సుప్రీంకోర్టు చెప్పినా మళ్లీ సస్పెన్షన్ విధించారు. పదవీవిరమణ సమయంలోనూ వేధింపులకు గురిచేసిన ఆయనకు ఎట్టకేలకు ఊరట లభించింది. కాగా, వైసపీ ఆయన ఓటు రూపంలో సైతం ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.