Investigation on Medigadda Barrage Seventh Block Pier : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ ఆనకట్ట కుంగిన నేపథ్యంలో అందుకు కారణాలను అన్వేషించే కసరత్తు కొనసాగుతోంది. పియర్స్ దెబ్బతిన్న ఏడో బ్లాక్ పరిస్థితికి సంబంధించిన అన్ని రకాల ఇన్వెస్టిగేషన్స్ చేశారు. ఆనకట్ట నిర్మించిన ఎల్ అండ్ టీ సంస్థ(L&T) రెండు ప్రైవేట్ కంపెనీలకు ఈ పనిని అప్పగించింది. ఎలక్ట్రోరల్ రెసిస్టివిటీ విధానంలో భూ గర్భ పరీక్షలు నిర్వహించారు. ఏడో బ్లాకులో ఉన్న 20వ నంబర్ పియర్ సహా ఇతర పియర్స్‌కు సంబంధించిన అన్ని అంశాలను పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నారు.
డిజైన్, నిర్మాణం, నాణ్యత, నిర్వహణ, తదితర అన్ని అంశాలతో పాటు ప్రస్తుత స్థితికి సంబంధించి అన్ని కోణాల్లో పరీక్షలు నిర్వహించారు. వాటన్నింటిని ప్రస్తుతం విశ్లేషిస్తున్నారు. ఒక రోగికి అన్ని రకాల పరీక్షలు చేసిన తర్వాత విశ్లేషణ చేసి ఎలా ఫలితాలు ఇస్తారో, అదే తరహాలో ఈ బ్లాక్ పియర్స్ విషయంలో కూడా ఫలితాలు రావాల్సి ఉందని ఓ ఇంజినీర్ పేర్కొన్నారు. అన్ని అంశాల విశ్లేషణ తర్వాత పియర్స్‌కు సంబంధించి ఎక్కడ లోపం జరిగింది. ఏం జరిగిందన్న విషయమై స్పష్టత రావడంతో పాటు పునరుద్ధరణ పనుల విషయమై కూడా ఓ అంచనాకు వచ్చే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
Medigadda Barrage Piers Analysis : ఇన్వెస్టిగేషన్స్‌కు సంబంధించిన అంశాలను విశ్లేషించి ఫలితాలు వచ్చిన తర్వాతనే జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ బృందం రాష్ట్ర పర్యటనకు రావొచ్చని అంటున్నారు. ఏడో బ్లాక్‌తో పాటు ఇరువైపులా ఉన్న ఆరు, ఎనిమిదో బ్లాకులకు సంబంధించి కూడా పరీక్షలు కొనసాగుతున్నాయి. వాటితో పాటు ఆనకట్టలోని మిగిలిన బ్లాకులకు సంబంధించిన పరీక్షలు కూడా నిర్వహించనున్నారు. వాటికి సంబంధించి కూడా అన్ని కోణాల్లోనూ పరీక్షలు నిర్వహిస్తారు.
అన్నారం ఆనకట్ట వద్ద కూడా ఇటీవల సీపేజీ సమస్య ఉత్పన్నమైంది. వెంటనే గ్రౌటింగ్ చేసి లీకేజీని అరికట్టారు. అక్కడ కూడా పరీక్షలు నిర్వహించనున్నారు. మేడిగడ్డ తరహా పరిజ్ఞానాన్నే అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు కూడా ఉపయోగించారు. దీంతో అక్కడ కూడా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. మొదట అన్నారం(Annaram), ఆ తర్వాత సుందిళ్ల ఆనకట్టల వద్ద కూడా పరీక్షలు నిర్వహించనున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు కలంకం - పదేళ్లలో రాష్ట్రాన్ని దివాలా తీయించారు : సీఎం రేవంత్‌రెడ్డి