Interview with TET Toppers 3 Young Girls Grab Top 3 Ranks in APTET 2024 : భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి చాలా అవకాశాలు వస్తుంటాయి. కానీ, వాటిని సద్వినియోగం చేసుకునేవారినే విజయం వరిస్తుంది. అదే చేశారా సరస్వతీ పుత్రికలు. ఉపాధ్యాయులు కావాలనే దృఢ సంకల్పంతో చదివి ఏపీ టెట్‌లో టాప్ ర్యాంకులతో మెరిశారు. లక్ష్యానికి ఊతమిచ్చేలా మొదటి 3 ర్యాంకులు సాధించి వారెవ్వా అనిపించారు. ఇదేకాక వారంతా ఒకే జిల్లాకు చెందినవారు. ఇంతకీ ఆ ఔత్సాహికులు ఎవరు? ఎలా సన్నద్ధమయ్యారు. వారి భవిష్యత్ లక్ష్యాలేంటో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.
ఎలాగైనా ఉపాధ్యాయ కొలువు సాధించాలనే సంకల్పం ఈ యువతుల్లో బలంగా నాటుకుంది. అందుకే, ఆహర్నిశలు కష్టపడి చదివారు. ఏపీ టెట్‌లో మొదటి 3 ర్యాంకులు సాధించి విజయానికి బాటలు వేసుకున్నారు. ఏపీ టెట్ ఫలితాల్లో 50.79% మంది అర్హత సాధించారు. అందులో మొదటి 3 ర్యాంకులు సాధించిన విద్యార్థులు విజయనగర వాసులే. వీళ్లే కాదు జిల్లావ్యాప్తంగా సుమారు 20 మంది విద్యార్థులు 145 మార్కులకు పైగా తెచ్చుకున్నారు.130 నుంచి 140 మార్కులు వచ్చినవారి సంఖ్య వందల్లో ఉంటుంది.
ఏపీ టెట్ మొదటి ర్యాంకు సాధించిన ఈ యువతి పేరు కొండ్రు అశ్విని. విజయ నగరం జిల్లా కేంద్రానికి చెందిన కొండ్రు శంకరరావు, వెంకటలక్ష్మిల పెద్ద కూమార్తె. తండ్రి ఆటో డ్రైవర్. కన్నవాళ్ల కష్టం చూసి చిన్నప్పుడే టీచర్ కావాలని లక్ష్యంగా పెట్టుకుంది అశ్విని. ఫలితంగా 2024 ఏపీ టెట్ ఫలితాల్లో 150కి 150 మార్కులు సాధించి లక్ష్యం వైపు వేగంగా అడుగులేస్తోంది.
చదువంతా ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే పూర్తి చేసింది అశ్విని. 2016లో డైట్ చదివింది. 2018 నుంచి టెట్ రాస్తూనే ఉంది. 5సార్లు టెట్ రాస్తే 3సార్లు 140కి పైగా మార్కులు సాధించి పలుమార్లు డీఎస్సీ (DSC) రాసింది. కానీ, విజయానికి అడుగుదూరంలో నిలిచిపోయింది. ఐనా నిరాశ చెందకుండా ప్రయత్నించి 2024ఏపీ టెట్ పేపర్-1ఏ ఎస్జీటీ (SGT) లో 150కి 150మార్కులు సాధించింది. కుటుంబంలో ఎవ్వరూ చదువుకోలేదు అందుకే పిల్లలను బాగా చదివించామని అశ్విని తల్లిదండ్రులు అంటున్నారు. ఆర్థికంగా అంతంతమాత్రంగానే ఉన్నా కుమార్తెకు అన్నివిధాలా సహకరించినట్లు చెబుతున్నారు. టెట్‌లో వందశాతం మార్కులు సాధించినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అశ్వినితో పాటు విజయనగరం వీటీ అగ్రహారానికి చెందిన దాసరి ధనలక్ష్మి 149.99 మార్కులతో ద్వితీయ స్థానంలో ఉండగా చీపురుపల్లికి చెందిన దేవ హారిక 149.46మార్కులతో తృతీయ స్థానంలో నిలిచింది. ఈ ముగ్గురూ వినెక్స్ కోచింగ్ సెంటర్‌లోనే శిక్షణ పొందుతున్నట్లు చెబుతున్నారు.
'ఇదే ఉత్సాహంతో మరింత కష్టపడి చదివి డీఎస్సీలో మంచి మార్కులు తెచ్చుకోవడానికి కృషి చేస్తాం. చెబుతున్నారీ ఉపాధ్యాయ కొలువులు సాధించడమే మా లక్ష్యం.' - టెట్ ర్యాంకర్లు
ఉపాధ్యాయులు కావాలని చాలామంది భావిస్తారు. అందులో విజయం సాధించడంలోనే వెనకబడిపోతారు. మొదట్లో వీరి పరిస్థితి కూడా అదే. అయితే, వీరికి అనుభవాలే ప్రతిభ పాఠావాలు అయ్యాయి. రెట్టింపు శ్రమతో ముందడుగేసి మొదటి 3 ర్యాంకులు సొంతం చేసుకున్నారు. ఫలితంగా టీచర్ కొలువుకు మార్గం సుగమం చేసుకున్నారు.
వందకు వంద శాతం మార్కులు.. ఎలా చదివావమ్మ?
మెగా డీఎస్సీ ప్రకటన వాయిదా- మరో నాలుగైదు రోజుల్లో నోటిఫికేషన్ వివరాలు