BEST FACILITIES TO LOCO PILOTS: విధి నిర్వహణలో భాగంగా లోకో పైలట్లు సుదూర ప్రాంతాలకు రైళ్లను నడపాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం లోకో పైలట్లు, అసిస్టెంట్ లోకో పైలట్లకు 8 గంటల పాటు విశ్రాంతి తప్పని సరిగా కల్పిస్తారు. దీని కోసం అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లలో విశ్రాంతి భవనాలను నిర్మించగా, విజయవాడ రన్నింగ్ రూం ప్రత్యేకంగా నిలుస్తోంది. ఈ కేంద్రంలో సదరన్ రైల్వే, ఈస్ట్ కోస్ట్ రైల్వే , దక్షిణ మధ్య రైల్వే జోన్లలోని 6 డివిజన్ల పరిధిలో సిబ్బందికి విశ్రాంతి సదుపాయం కల్పించారు.
విజయవాడ రైల్వే స్టేషన్ సమీపంలో స్టార్ హోటల్‌ను తలపించేలా అధునాతన పెద్ద భవనాన్ని నిర్మించి ఆధునీకరించారు. ఈ రన్నింగ్ రూంలో 66 గదులు ఉండగా, 202 బెడ్లు ఏర్పాటు చేశారు. నిత్యం 285 మందికిపైగా విశ్రాంతి తీసుకుంటారు. ప్రతి గదిలోనూ ఏసీలు, మంచాలు, మెత్తని పరుపులు, దోమతెరలు ఏర్పాటు చేశారు. వాషింగ్ మెషిన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉంటూ వీరికి కావాల్సిన సదుపాయాలు కల్పిస్తారు.
రైల్వే ప్రయాణికులకు శుభవార్త - ఈ రైళ్లకు అదనపు బోగీలు - extra general coaches in trains
రోజూ కోట్లాది మంది రైలు ప్రయాణికులు సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడంలో అత్యంత కీలక పాత్ర పోషించే వారు లోకో పైలట్లు, అసిస్టెంట్ లోకో పైలట్లే. అనునిత్యం అప్రమత్తంగా ఉంటూ రేయింబవళ్లు పట్టాలపై రైళ్లను పరుగులు పెట్టిస్తారు. సుదూర ప్రాంతాలకూ సజావుగా రైళ్లు నడపుతూ కీలక భూమిక పోషిస్తారు. రోజంతా కష్టపడి అలసిన వీరికి విశ్రాంతి, వసతి కల్పించడంపై రైల్వే శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. రన్నింగ్ రూంల పేరిట అధునాతన భవనాలను నిర్మించి సకల సదుపాయాలను కల్పిస్తోంది.
ఈ రన్నింగ్ రూంలో లోకోపైలట్ల ఆరోగ్య పరిరక్షణ కోసం మెడిటేషన్ సదుపాయాన్నీ కల్పించారు. వ్యాయామం చేసుకోవడం, కాళ్లకు ఫిజియోథెరపీ చేసుకునేందుకు ఏర్పాట్లు చేశారు. బీపీ, షుగర్ తనిఖీ చేసుకోవడం సహా ఫస్ట్ ఎయిడ్ కిట్లను ఇస్తారు. విశాలమైన రీడింగ్ రూం కూడా ఉంది. పచ్చని చెట్లతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉద్యోగులు సేద తీరుతున్నారు. లోకోపైలట్లు నిర్ణీత గంటల పాటు విశ్రాంతి తీసుకునేలా, సమయాన్ని తప్పని సరిగా సాఫ్ట్ వేర్‌లో పొందుపరుస్తారు. రన్నింగ్ రూంకు వచ్చే వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుని, చిన్న సమస్య ఉన్నట్లు గుర్తించినా వెంటనే సరి చేస్తారు.
సిబ్బందికి మూడు పూటలా నాణ్యమైన, రుచికరమైన భోజనాన్ని అందిస్తున్నారు. ఇక్కడ క్యాంటీన్లో కేవలం 5 రూపాయలకే భోజనం పెడతారు. చాలా తక్కువ రుసుంతో భోజనం పార్సిల్ తీసుకెళ్లేందుకు అనుమతిస్తారు. మహిళా సిబ్బంది కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసి నిరంతర భద్రత, నిఘా ఏర్పాటు చేశారు. సౌకర్యాలు చాలా బాగున్నాయని ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. లోకోపైలట్ల ఆరోగ్య సంరక్షణే ముఖ్యమని, అందుకే సౌకర్యాలు కల్పించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. జాతీయ స్థాయిలో బెస్ట్ రన్నింగ్ రూంగా అవార్డులు సాధించడమే సదుపాయాల కల్పనకు నిదర్శనమంటున్నారు.