INDIA ALLIANCE MEETING IN VIJAYAWADA: దేశంలో ద్రవ్యోల్బణం, ఆకలి మరణాలు పెరుగుతున్నాయని, పెద్దోళ్లు పెద్దోళ్లుగా, పేదోళ్లు పేదోళ్లుగా ఉండిపోతున్నారని ఇండియా కూటమి నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. మోదీ గ్యారంటీ పథకాలు ఎక్కడున్నాయంటూ ప్రశ్నించారు. ఆరెస్సెస్ అజెండాను అమలు చేయడానికి మోదీ ప్రాధాన్యం ఇస్తున్నారే తప్ప, పేదప్రజల సంక్షేమం, అభివృద్ధిపై ధ్యాస లేదన్నారు.
ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ విజయవాడ గాంధీనగర్లోని జింఖానా మైదానంలో జరిగిన ఎన్నికల బహిరంగ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, మాజీమంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, వివిధ పార్టీల నుంచి నాయకులు హాజరయ్యారు. ఈ సభకు ముఖ్యఅతిధిగా హాజరైన ఆలిండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ మోదీ పాలనపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
దేశంలో 30 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని, వీటిని భర్తీ చేయడానికి మోదీ ప్రభుత్వానికి మనసొప్పడం లేదన్నారు. స్విస్ బ్యాంకుల నుంచి 15 లక్షల కోట్ల నల్లధనం తెస్తామన్నారని, ఆ నల్లధనం ఎక్కడుందని ఖర్గే ప్రశ్నించారు. ప్రతీ ఏడాది 2కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోదీ మాట తప్పారని ఆరోపించారు. రైతుల ఆదాయాన్ని డబుల్ చేస్తామని హామీ ఇచ్చారని, ఈ హామీ కూడా నెరవేరలేదన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ, మోదీని ఓడించడం ప్రజాస్వామికవాదుల లక్ష్యం కావాలని పిలుపునిచ్చారు. బీజేపీ, ఆరెస్సెస్ సిద్ధాంతాలు ప్రమాదకరమైనవని, అందుకే వ్యతిరేకిస్తూ ఉన్నామని చెప్పారు. ఏపీలో ఉన్న పార్టీలకు మోదీని గుడ్డిగా అనుసరించడం తప్ప సిద్ధాంతాలు లేవని ఖర్గే ఎద్దేవా చేశారు.
న్యాయానికి, నేరానికి జరుగుతున్న పోరాటం - కడపలో గెలిచేది నేనే: షర్మిల - YS Sharmila Interview
కీలకమైన ఎన్నికలు: ఈ ఎన్నికలు చాలా కీలకమైనవని, వీటిపైనే ప్రజాస్వామ్య పరిరక్షణ ఆధారపడి ఉందని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి అభిప్రాయపడ్డారు. దేశ చరిత్రను మార్చడానికి బీజేపీ, ఆరెస్సెస్ ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ఫాసిస్టు హిందూరాజ్యం ఏర్పాటుకు ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ రాజ్యాంగం ఉన్నంతవరకు వాళ్ల ఆటలు సాగవని, అందుకే రాజ్యాంగం మార్చడానికి 400 సీట్లు కావాలంటున్నారని ఆరోపించారు. మోదీని వ్యతిరేకించేవారిని జైళ్లలో కుక్కుతున్నారని, వారిపై ఛార్జిషీట్లు కూడా పెట్టడం లేదని సీతారాం ఏచూరి ఆరోపించారు. సెక్యులరిజం నిర్వచనాన్ని బీజేపీ పాలకులు మార్చేశారని, ప్రభుత్వం ఒక మతాన్ని ప్రోత్సహించే విధానం రాజ్యాంగ విరుద్ధమని ఆయన అభిప్రాయపడ్డారు.
బొగ్గు, ఇనుము గనులను ప్రైవేటీకరణ చేస్తున్నారని, 16లక్షల కోట్ల మేర పెట్టుబడిదారులకు బకాయిలను మాఫీ చేశారని గుర్తుచేశారు. మతన్మోదాన్ని రెచ్చగొడుతూ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామన్నారని, తర్వాత ఎందుకు కాదన్నారని ప్రశ్నించారు. రాష్ట్ర రాజకీయాల్లో మోదీ సూత్రధారి పాత్ర పోషిస్తున్నారని జనసేన, టీడీపీ నాయకులు తందానతాన అంటున్నారని విమర్శించారు.
'కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఏముందో ప్రజలకు బాగా తెలుసు- అందుకే మీలో ఆందోళన!' - Kharge Letter To Modi
2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ: సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా మాట్లాడుతూ ప్రజలు ఎన్డీయే కూటమికి వ్యతిరేకంగా ఓటేయాలని పిలుపునిచ్చారు. పదేళ్లుగా మోదీ అధికారంలో ఉండి ఏం చేశారని నిలదీశారు. ఏడాదికి 2 కోట్లు ఉద్యోగాలు ఇస్తామన్నారని, ఎక్కడ ఇచ్చారని ప్రశ్నించారు. నిత్యవసర ధరలు, గ్యాస్ ధరలు తగ్గిస్తామని చెప్పి మాట తప్పారని ఆరోపించారు. మోదీ అలవికాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని రాజా ధ్వజమెత్తారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పారని, వేలమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని గుర్తుచేశారు.
పేదరికంలో 125 దేశాల్లో 111వ ర్యాంకులో ఉన్నామని, అభివృద్ధి ఎక్కడని ప్రశ్నించారు. ప్రత్యేక హోదాపై మన్మోహన్ సింగ్ హామీ ఇచ్చారని, మోదీ మాత్రం మోకాలొడ్డారని ఆరోపించారు. ప్రైవేట్ సెక్టార్లో రిజర్వేషన్లు ఎందుకు తేలేకపోతున్నారని రాజా ప్రశ్నించారు. మోదీని అధికారం నుంచి తొలగిస్తేనే ప్రజాస్వామ్య పరిరక్షణ సాధ్యమని రాజా అభిప్రాయపడ్డారు. సభ అనంతరం విజయవాడ లోక్ సభ పరిధిలో పోటీ చేస్తున్న ఇండియా కూటమి అభ్యర్థులను మల్లికార్జున ఖర్గే ప్రజలకు పరిచయం చేశారు. ఇండియా కూటమి అభ్యర్ధులకు ఓటు వేయాలని అభ్యర్థించారు.