Diarrhea Cases in Joint Anantapur District : ఉమ్మడి అనంతపురం జిల్లాలో అతిసార వ్యాధి లక్షణాలతో అనేక మంది మంచం పడుతున్నారు. ఐదేళ్లపాటు గ్రామీణ నీటి సరఫరా పథకాల నిర్వహణను వైఎస్సార్సీపీ ప్రభుత్వం గాలికొదిలేసింది. తాగునీటి ట్యాంకుల్ని శుభ్రం చేయలేదు. పైపులైన్ల లీకేజీని పట్టించుకోలేదు.! పైగా వర్షాలు కురవడంతో. గ్రామాల్లోని బోర్లలోకి నీరు చేరి కలుషితమవుతోంది. అనంతపురం జిల్లా వ్యాప్తంగా అతిసారం లక్షణాలతో ముగ్గురు మృత్యువాత పడ్డారు! అనేక మంది వాంతులు విరేచనాలతో అనంతపురం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Diarrhea Cases in AP : ఉమ్మడి అనంతపురం జిల్లాలో 1600 గ్రామాలకు తాగునీరు అందిస్తున్న శ్రీరామిరెడ్డి, శ్రీ సత్యసాయి తాగునీటి పథకాల నిర్వహణ తీసికట్టుగా మారింది. ఈ రెండు పథకాల్లో పనిచేస్తున్న కార్మికులకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం నెలల తరబడి జీతాలు చెల్లించకపోవడంతో తాగునీటి సరఫరా గాడితప్పింది! వేసవిలో తాగునీటి బోర్లు, దెబ్బతిన్న పైపులైన్ల మరమ్మతుల కోసం రూ.70 కోట్లు మంజూరు చేయాలని అనంతపురం జిల్లా ఎస్సీ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. వైద్యారోగ్యశాఖ కూడా వర్షాకాలానికి ముందే ప్రజల్ని అప్రమత్తం చేయలేదు. ఇవన్నీ వెరసి ప్రజారోగ్యానికి శాపంగా మారాయి.
ఈ లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చేయవద్దు : వాంతులు, విరేచనాలు ఎక్కువగా ఉంటే నిర్లక్ష్యం చేయొద్దని వైద్యులు సూచిస్తున్నారు. అతిసార రోగుల కోసం అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో ప్రత్యేకంగా వార్డు ఏర్పాటు చేశామని తెలిపారు. ఇందులోసుమారు 40 మంది చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. ఉరవకొండ చుట్టపక్కల మండలాల్లో ఈ కేసులు ఎక్కువగా ఉండటంతో అక్కడి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేకంగా వార్డు ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నామని వైద్యులు వివరించారు.
"ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశాం. అతిసార రోగులకు త్వరితగతిన వైద్య అందిస్తున్నాం. ప్రతిరోజు మున్సిపల్ శాఖకు, ఉన్నతాధికారులకు రోగుల సమాచారాన్ని పంపుతున్నాం. బాధితులు వాంతులు, విరేచనాలు ఎక్కువగా ఉంటే నిర్లక్ష్యం చేయొద్దని చెబుతున్నాం. వెంటనే వారు ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకోవాలి." - వెంకటేశ్వరరావు, అనంతపురం సర్వజనాసుపత్రి సూపరింటెండెంట్
చిన్నారుల్లో ఎక్కువగా అతిసార వ్యాధికి గురవుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. మరోవైపు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రోజుకు 40 నుంచి 60 మంది రోగులు వాంతులు విరేచనాలతో ఆసుపత్రిలో చేరుతున్నారని అంటున్నారు. మరోవైపు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించినా అనంతపురం అధికారులు ప్రజలను అప్రమత్తం చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారనే విమర్శలున్నాయి.
ఉమ్మడి గుంటూరులో భారీగా పెరిగిన డయేరియా కేసులు! - 40 Affected by Diarrhea in Guntur