BOAT LICENSE : రాష్ట్రంలో గోదావరి నది మీదుగా పడవలు, లాంచీల్లో రవాణా అధికంగానే ఉంటుంది. కానీ, అక్కడక్కడా పలుమార్లు చోటుచేసుకుంటున్న పడవ ప్రమాదాల్లో పదుల సంఖ్యలో ప్రజలు మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది.
- దిబ్బలపల్లవపాలెం- ఏటిపొర గ్రామాల మధ్య ఉప్పుటేరుపై పడవల రాకపోకలు కొనసాగుతుండగా దాదాపు 15 ఏళ్ల కిందట బియ్యపుతిప్ప సమీపంలో జరిగిన పడవ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు.
- 8 సంవత్సరాల కిందట పేరుపాలెంనార్తు నెల్లిపల్లవపాలెం - గెదళ్లవంపు గ్రామాల మధ్య జరిగిన పడవ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.
- 15 సంవత్సరాల కిందట పేరుపాలెంనార్తు ఏటిమొండి- కొత్తోట గ్రామాల మధ్య ఉన్న ఉప్పుటేరులో పడవ మునిగి నలుగురు కూలీలు ప్రాణాలు కోల్పోయారు.
తరచూ పడవ ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించడం ఆందోళన కలిగిస్తోంది. ఎటువంటి అనుమతులు లేకుండా ఉప్పుటేరుపై ప్రమాదకర పరిస్థితుల్లో ప్రజలను దాటిస్తున్నా అధికారులు నిర్లక్ష్యంగా ఉంటున్నారు.
తుపాను ప్రభావంతో పాపికొండలకు నిలిచిన ప్రయాణం - బోట్ల నిలిపివేత
మొగల్తూరు మండలం పేరుపాలెంసౌత్ పంచాయతీ దిబ్బలపల్లవపాలెం- కృష్ణా జిల్లా ఏటిపొర గ్రామాల మధ్య ఉప్పుటేరుపై పడవలు అనధికారకంగా నడుపిస్తున్నారు. ఎనిమిదేళ్ల కిందట వరకూ ఈ రేవు పంచాయతీ నిర్వహణలో ఉండగా.. పంచాయతీ ఆధ్వర్యంలో ఏటా వేలం నిర్వహించేవారు. దీంతో పంచాయతీకి ఎంతో కొంత ఆదాయం వచ్చేది. ఇదిలా ఉండగా గతంలో కచ్చులూరులో జరిగిన బోటు ప్రమాదంలో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. దీంతో అప్పటి ప్రభుత్వం జల రవాణాకు విధి విధానాలు ఖరారు చేసి అమల్లోకి తీసుకొచ్చింది. దీంతో రేవులన్నింటినీ మూసివేయగా అందులో దిబ్బలపల్లవపాలెం- ఏటిపొర రేవు కూడా ఉంది. ఈ నేపథ్యంలో రేవు వేలం పాట కూడా నిలిచిపోయింది.
జల రవాణాకు అనుమతులు తప్పనిసరి. ఉప్పుటేరులు, మురుగుకాలువలు, నదీజలాలపై ప్రజా రవాణా చేసే పంటులు, పడవలకు ప్రభుత్వం నుంచి అనుమతి పొంది ఉండాలి. పడవలు, లాంచీలను నడిపే సరంగులు లైసెన్సు పొందినవారై, సుశిక్షితులై ఉండాలి. కానీ, పేరుపాలెంలో రేవు దాటిస్తున్న పడవకు అనుమతి లేకపోగా సరంగుకు లైసెన్స్ కూడా లేదు. ఈ ప్రాంతం సముద్రానికి సమీపంలోనే ఉండటంతో ప్రవాహం ఉద్ధృతంగా ఉంటుంది. పడవ ప్రయాణికులకు కనీసం లైఫ్‌జాకెట్లు కూడా అందుబాటులో ఉంచడం లేదు.
ప్రభుత్వం ఆదేశాలు...
కార్గో, ప్రయాణికుల బోట్లు, లాంచీలు, పడవల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే మార్గదర్శకాలు జారీ చేసింది. భద్రతా ప్రమాణాలు ఉంటేనే కార్యకలాపాలకు అనుమతి ఉంటుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. నదులు, కాల్వలు, రిజర్వాయర్లలో లాంచీలు, పడవలు నడిపే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచిస్తూ మార్గదర్శకాలు ఇచ్చింది. రూట్ సర్వే, సర్టిఫికేషన్, కార్యకలాపాల నిర్వహణ ఉంటుందని స్పష్టం చేసింది. ఇండియన్ మారిటైమ్ వర్సిటీ మార్గదర్శకాలకు అనుగుణంగానే కార్యకలాపాలు కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది. భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా బోట్లను నడిపించాలని, ప్రతి బోటు, లాంచీలోనూ సమాచార వ్యవస్థ కోసం వీహెచ్ఎఫ్ సెట్లు కలిగి ఉండాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
టూరిజం బోట్లకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అనుమతుల కోసం ముందుగా దవళేశ్వరం లోని టూరిజం బోర్డు కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. ఇచ్చిన సమాచారం మేరకు బోటు సూపరింటిండెంట్ బోటును పరిశీలిస్తారు. ప్రయాణికుల సామర్థ్యం మేరకు ఫిట్నెస్, ఇంజిన్ సామర్థ్యాన్ని పరిశీలిస్తారు. బోటు నడిపే వ్యక్తుల లైసెన్స్ కూడాపరిశీలిస్తారు.
Boat Journey: నాగార్జున కొండకు తిరిగి లాంచీ సర్వీసులు.. క్యూ కడుతున్న పర్యటకులు