IMD Issues Rainfall Alert to Andhra Pradesh : పశ్చిమ మధ్య బంగాళాఖాతం-వాయువ్య బంగాళాఖాతం సమీపంలో అల్పపీడనం ఏర్పడిందని విశాఖ వాతావరణశాఖ తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో రాగల 24 గంటల్లో ఉత్తరాంధ్రలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. అల్లూరి, పార్వతీపురం మన్యం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించామని అధికారులు తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కోనసీమ, N.T.R, పల్నాడు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు ఎల్లో అలర్ట్ లో ఉన్నాయన్నారు. తీరంలో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు ఉంటాయని చెబుతున్న విశాఖ వాతావరణ శాఖ ముఖ్య అధికారి తెలిపారు. 8వ తేదీ వరకు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి పెనుగంచిప్రోలు మండలంలోని వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. కూచివాగు వంతెన పైనుంచి వరద ప్రవహించడంతో అనిగండ్లపాడు, గుమ్మడిదూరు, శివాపురం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరద పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తూ హెచ్చరికలు జారీ చేశారు.
మైలవరం ఎర్రచెరువుకు గండి పడింది. వరద పొంగపొర్లడంతో గ్రామాల్లోకి వరద నీరు వస్తుందని గ్రామస్తులు వాపోయారు. వందల ఎకరాలకు పంట పొలాలకు తీవ్ర నష్టం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, నాయకులు అప్రమత్తమై గండిని పూర్చేందుకు చర్యలు చేపట్టారు. భారీ వర్షాలకు కృష్ణా జిల్లా బాపులపాడు మండలం ఆరుగొలను, ఓగిరాల, రంగయ్యప్పారావుపేటలను బుడమేరు ముంచెత్తింది.
భారీ వరద ప్రవాహంతో ఆరుగొలను విద్యుత్తు ఉపకేంద్రంలోకి నీరు చేరి విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు రహదారుల జలమయంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. పొలాల్లోకి వరద నీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి. పంటలు నీటమునిగి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Godavari Water level reaches 44 ft in Bhadrachalam : ఏలూరు జిల్లా జీలుగుమిల్లి, కుకునూరు, వేలేరుపాడు మండలాల్లో కురిసిన భారీ వర్షానికి వరద పోటెత్తింది. ఇప్పటికే భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 44 అడుగులకు చేరి విలీన మండలాల్లోని గ్రామాలు నీటమునిగాయి. జీలుగుమిల్లి మండలంలో వాగులు, కాలువలు పొంగి ప్రవహిస్తున్నాయి. రహదారులు కోతకు గురై పలు గ్రామాలకు రాకపోకలు నిలిపోయాయి. వంక వారి గూడెం వద్ద కల్వర్టు కొట్టుకుపోవడంతో రెవెన్యూ ఉద్యోగులు బ్యానర్లను ఏర్పాటు చేశారు. కల్వర్టు వద్ద ఉంటూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
కాకినాడ జిల్లా ముమ్మిడివరం వద్ద వరద ఉద్ధృతి అంతకంతకు పెరుగుతోంది. భారీ వర్షాలకు తూర్పు గోదావరి జిల్లా ధవలేశ్వరం బ్యారేజి వద్ద నీటిమట్టం గణనీయంగా పెరుగుతోంది. సముద్రంలోకి 10 లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దీంతో గౌతమి, వృద్ధ గౌతమి గోదావరి నదీపాయల్లో వరద ప్రవాహం పోటెత్తింది. ముమ్మిడివరం మండలంలోని వివేకానంద వారది వద్ద వరద ప్రవాహానికి సమీపంలో లంక భూములు ముంపునకు గురవుతున్నాయి. యానాం బాలయోగి వారధి వద్ద వరద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దన్న అధికారుల హెచ్చరికతో నావలు గట్టుకే పరిమితమయ్యాయి. పుదుచ్చేరి పర్యాటక శాఖ గోదావరిలో నిర్వహించే వాటర్ స్పోర్ట్స్ ప్రాంగణం నీటమునిగింది.
24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం - పలుచోట్ల భారీ వర్షాలు - Weather Update in AP
గోదావరికి వరద పెరుగుతున్న నేపథ్యంలో కోనసీమ జిల్లాలో నదీపాయల్లో వరద ప్రవాహం పెరిగింది. సరిహద్దులో ఉన్న పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం కనకాయలంక కాజ్వే ముంపు బారిన పడింది. దీంతో ప్రజలు చాకలి పాలెం వైపు రాకపోకలు సాగించేందుకు పడవలను ఉపయోగిస్తున్నారు. జులై, ఆగస్టు నెలల్లో వచ్చిన వరదలకు కాజ్వే సుమారు 20 రోజులపాటు ముంపులో ఉంది. మళ్లీ ఇప్పడు ముంపు బారిన పడ్డామని బాధితులు వాపోయారు. నదిని దాటేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రభుత్వం స్పందించి వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.