Rain Alert in AP : బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈరోజు లోపు అల్పపీడనం ఏర్పడనుంది. తర్వాత రెండు రోజుల్లో తీవ్ర అల్పపీడనంగా బలపడి, పశ్చిమ-వాయవ్య దిశగా పయనిస్తూ తమిళనాడు తీరం వైపు వెళ్లే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో మంగళవారం నుంచి గురువారం వరకు ఏపీలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
మంగళవారం ప్రకాశం, చిత్తూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో, బుధవారం తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు, పశ్చిమగోదావరి, నెల్లూరు, ప్రకాశం, డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని అంచనా వేస్తోంది. మిగిలిన అన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలకు అవకాశముందని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. బుధవారం తమిళనాడు, గురు, శుక్రవారాల్లో ఒడిశాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలకు అవకాశముంది. బుధ, గురువారాల్లో సముద్రం అలజడిగా మారుతుందని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది.