Mining Department Sensational Report on Illegal Sand Mining : భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలకు పర్యావరణ సంస్థ అనుమతి ఇవ్వకపోయినా, దర్జాగా తవ్వుతున్నారని, లీజు మంజూరు కాకపోయినా తవ్వేస్తున్నారంటూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. అయితే కొన్నినెలల క్రితం ఎన్జీటీ ఆదేశాలతో అన్ని జిల్లాల్లో కలెక్టర్లు ఇసుక తవ్వకాలు లేని రీచ్‌లనే పరిశీలించి, అక్రమ తవ్వకాలు లేవంటూ నివేదికలు ఇచ్చారు. ప్రభుత్వ పెద్దల సూచనలతో గనులశాఖ ఉన్నతాధికారులు చెప్పినచోటే కలెక్టర్లు తనిఖీలు చేసి మమ అనిపించారు. అనంతరం వారంతా ఒకేలా ఎన్జీటీకి నివేదిక ఇచ్చారు.
కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖ అధికారులు మాత్రం రాష్ట్రంలో ఇసుక తవ్వకాల్లో భారీగా ఉల్లంఘనలు జరిగాయంటూ ఆధారాలతో నివేదిక అందజేశారు. దీంతో కలెక్టర్ల తీరును ఎన్జీటీ ఆక్షేపించింది. హైకోర్టులో పిల్‌పై విచారణ సందర్భంగా ఎన్జీటీకి కలెక్టర్లు ఇచ్చిన తప్పుడు నివేదిక అంశం ప్రస్తావనకు వచ్చింది. దీంతో కలెక్టర్ల బృందం మరోసారి రీచ్‌లను పరిశీలించి నివేదిక ఇవ్వాలంటూ హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో కలెక్టర్లు రీచ్‌ల్లో మళ్లీ తనిఖీలు చేసి, ఎక్కడా అక్రమ తవ్వకాలు లేవని ధ్రువీకరించాలంటూ గనులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది గత నెల 22న మెమో జారీచేశారు. ఈ నివేదికలు అన్నీ వచ్చేలా గనులశాఖ సంచాలకులు పర్యవేక్షించాలని అందులో పేర్కొన్నారు.
అన్నమయ్య, అనంతపురం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు, కృష్ణా, గుంటూరు, పల్నాడు, నెల్లూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, తిరుపతి, చిత్తూరు, కర్నూలు, వైయస్‌ఆర్, విజయనగరం జిల్లాల కలెక్టర్లు తవ్వకాలపై నివేదిక ఇవ్వాలి. అన్ని జిల్లాల్లో ఇసుక గుత్తేదారులకు ముందే చెప్పి, తనిఖీలు చేశారు. ఎక్కడా ఉల్లంఘనలు లేవని, కొన్నిచోట్ల నదుల్లో గుంతలు ఉన్నా, స్థానికులు ఇళ్లు కట్టుకునేందుకు ఇసుక తవ్వి, ఎడ్లబండ్లలో తరలించుకున్నారని నివేదిక ఇచ్చినట్లు సమాచారం.
కృష్ణా జిల్లా గనులశాఖ అధికారితో కూడిన బృందం ఇటీవల రొయ్యూరు, పాపవినాశనం, లంకలపల్లి, అప్పారావుపేట తదితర రీచ్‌లు పరిశీలించింది. ఇందులో రెండు అనుమతి లేని రీచ్‌లని గుర్తించింది. భారీ యంత్రాలతో కొన్ని నెలలుగా తవ్వినట్లు తేల్చింది. రెవెన్యూ, పోలీసు, సెబ్ అధికారులతో కూడా ధ్రువీకరణ తీసుకొని, అక్రమాలు నిజమంటూ నివేదిక ఇచ్చింది. ఈ జిల్లా ఇసుక గుత్తేదారైన జీసీకేసీ సంస్థ ఎన్నో తప్పులు చేసిందని, అనుమతిచ్చిన రీచ్ బయట తవ్వేసిందని, అసలు అనుమతులు లేనిచోటా తవ్విందని జిల్లా గనులశాఖ అధికారి తుది నివేదిక ఇచ్చారు. తప్పుచేసిన జీసీకేసీ సంస్థపై చర్యలు తీసుకోవాలని, ఆ సంస్థ తీరుతో ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగిందని నివేదికలో స్పష్టం చేసినట్లు తెలిసింది.
ఇసుకాసురులు - ఐదేళ్ల వైసీపీ పాలనలో అడ్డగోలుగా తవ్వకాలు - sand exploitation in YCP rule
ఈ నివేదికతో గనులశాఖ ఉన్నతాధికారులు తల పట్టుకుంటున్నారు. దీన్ని హైకోర్టుకు సమర్పిస్తే ఇబ్బందికర పరిస్థితి వస్తుందని భావిస్తున్నారు. దీంతో కృష్ణా జిల్లా గనులశాఖ అధికారి ద్వారా మరోసారి అనుకూల నివేదిక ఇప్పించేందుకు ఒత్తిడి చేస్తున్నారని తెలిసింది. ఆయన మాత్రం వాస్తవాలు దాచితే మున్ముందు ఇబ్బందని, అందుకే ఉన్నది ఉన్నట్లు నివేదిక ఇచ్చానని, దాన్ని మార్చే ప్రసక్తి లేదంటూ భీష్మించుకు కూర్చున్నట్లు సమాచారం. ఆయన్ను సెలవుపై పంపి, వేరే అధికారిని నియమించి, అనుకూల నివేదిక తెప్పించాలని చూస్తున్నట్లు తెలిసింది. వాస్తవానికి ఈ కేసు ఈ నెల మొదటి వారంలోనే హైకోర్టులో విచారణకు రాగా, కలెక్టర్ల నివేదికలు అన్నీ రాకపోవడంతో వచ్చే నెల 8కి వాయిదా వేశారు. ఆలోపు కృష్ణా జిల్లా నివేదికను మార్చేందుకు విశ్వప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం.
ఇసుక ధరపై హైకోర్టు విస్మయం - బంగారంతో పోటీ పడుతోందంటూ వ్యాఖ్య