IAS Officer Dhanunjaya Reddy Wife Aparna Irregularities : ఆమె హైదరాబాద్ జేఎన్‌టీయూలో ప్రొఫెసర్‌గా పని చేసేవారు. వైఎస్సార్సీపీ అధికారం చేపట్టిన ఏడాదికల్లా ఏపీకి వచ్చేశారు. రాష్ట్రంలోని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో భౌతికశాస్త్రం ప్రొఫెసర్‌గా నియమితులయ్యారు. ఆ వెంటే డిప్యుటేషన్‌పై అటవీ, శాస్త్ర సాంకేతికశాఖ పరిధిలోని ఏపీ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (అప్కాస్ట్) సభ్య కార్యదర్శిగా రాష్ట్ర స్థాయి పోస్టును దక్కించుకున్నారు. అధికారులు హుటాహుటిన దస్త్రాలన్నీ క్లియర్ చేసి ఆమెను ఆ పోస్టులో నియమించారు.
ఇంత పలుకుబడి ఉన్న ఆమె ఎవరో తెలుసా వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అన్నీ తానై వ్యవహరించి, సీఎంఓలో చక్రం తిప్పిన ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డి భార్య వై. అపర్ణ. ఆమె ఆఘమేఘాలపై రాష్ట్రానికి రావడంలో ధనుంజయరెడ్డి కీలకంగా వ్యవహరించారు. అప్కాస్ట్‌లో సభ్య కార్యదర్శిగా అపర్ణ అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో నియామకం మొదలు ఆమె హయాంలో జరిగిన పనులన్నింటిపైనా సమగ్ర విచారణ చేపట్టాలన్న డిమాండ్లు వస్తున్నాయి.
నిబంధనలకు విరుద్ధంగా విశ్రాంత ఉద్యోగులు నియమికం : అప్కాస్ట్‌లో విద్యార్థులు, యువతకు శాస్త్రసాంకేతిక పరిజ్ఞానం పట్ల అవగాహన పెంచే కార్యక్రమాల నిర్వహణ కంటే సివిల్ ఇంజినీరింగ్ పనులపైనే ఎక్కువ దృష్టి సారించి అపర్ణ లబ్ధి పొందారని, ఇందుకోసం విశ్రాంత ఉద్యోగులు ఇద్దరిని నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టు పద్ధతిలో నియమించుకున్నారని విమర్శలు కూడా ఉన్నాయి. రాజమహేంద్రవరంలోని బొమ్మూరులో 15 కోట్ల రూపాయలతో నిర్మించిన ఉప ప్రాంతీయ సైన్సు సెంటర్ (ఎస్‌ఆర్‌సీసీ) గ్రౌండ్ లెవల్ కంటే 20 అడుగుల లోతులో ఉంది. ఇక్కడి స్థలం భవనాల నిర్మాణానికి అనుకూలం కాదని నిపుణుల కమిటీ తేల్చి చెప్పింది. ఆ మేరకు నివేదిక ఇచ్చింది. వాటిని పక్కన పెట్టి హడావుడిగా పనులు చేపట్టారు. ఈ నిర్మాణంలో అవకతవకలు బోలెడన్ని చోటు చేసుకున్నట్లు సమాచారం.
లోపాలూ లేకపోతే ఇన్ని ఆంక్షలు ఎందుకు? : రాజమహేంద్రవరం బొమ్మూరులో నిర్మించిన ఉప ప్రాంతీయ సైన్సు సెంటర్ (ఎస్‌ఆర్‌సీసీ)ను పరిశీలించేందుకు గురువారం ఈనాడు ప్రతినిధి వెళ్లగా అక్కడ పని చేసే అజయ్ కుమార్ అనే ఉద్యోగి అడ్డుకున్నారు. లోపలికి వెళ్లడానికి వీల్లేదని నిలువరించారు. "మీరు లోపలికి వెళ్లాలంటే అపర్ణ మేడమ్ అనుమతి ఉండాలి. ఆమె అనుమతి లేఖ ఇస్తేనే లోపలికి పంపిస్తాం" అంటూ దురుసుగా మాట్లాడారు. అక్కడ ఏ లోపాలూ లేకపోతే ఇన్ని ఆంక్షలు ఎందుకనే ప్రశ్నలు వ్యక్తం అమవుతున్నాయి.