HYDRA Focus On Ponds FTL : నగరంలో చెరువుల పునరుద్దరణపై దృష్టి సారించిన హైడ్రా మరో కీలక నిర్ణయం తీసుకుంది. నివాసాల మధ్య ఉన్న చెరువుల ఎఫ్టీఎల్ నిర్ధారించి వాటి పునరుద్దరణ కోసం చర్యలు చేపట్టనున్నట్లు కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. అందులో భాగంగా ఔటర్ రింగురోడ్డుకు సమీపంలోని ఖాజాగూడ వద్ద ఉన్న తౌటోని కుంటను సందర్శించిన రంగనాథ్ ఆ చెరువు పునరుద్దరణకు తీసుకోవాల్సిన చర్యలపై రెవెన్యూ, నీటిపారుదలశాఖ, జీహెచ్ఎంసీ అధికారులతో సమీక్షించారు.
తౌటోనికుంటను పరిశీలించిన హైడ్రా రంగనాథ్ : మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ ఖాళీ స్థలంలో వర్షపు నీరు నిలవడంతో సమీపంలోని అపార్ట్ మెంట్ల సెల్లార్లోకి నీరు చేరుతుందని స్థానికులు ఫిర్యాదు చేశారు. ఆ వరద నీరంతా తౌటోనికుంటకు చేరితే సమస్య తొలగిపోతుందని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై స్వయంగా వెళ్లి అక్కడి పరిస్థితిని పరిశీలించిన రంగనాథ్ యూనివర్సిటీ ఖాళీ స్థలంలోని వరద నీరు సులభంగా తౌటోని కుంటకు చేరేలా కాలువ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. తౌచోని కుంట నిండితే దిగువనున్న భగీరధమ్మ చెరువుకు కూడా నీరు చేరుతుందని సూచించారు. తక్షణమే పనులు చేపట్టేలా కార్యచరణ రూపొందించాలని అధికారులను రంగనాథ్ ఆదేశించారు.
చెరువుల సుందరీకణ దిశగా హైడ్రా : నీటి వనరులైన చెరువులు కుంటలు పునరుద్దరణ, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కోసం ఏర్పాటైన హైడ్రా ఇప్పటికే పలు చోట్ల అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి నిర్మించిన నిర్మాణాలను, బహుళ అంతస్తుల బిల్డింగ్లను నేలమట్టం చేసింది. వీటితో పాటు ప్రకృతి విపత్తుల సమయంలో కూడా హైడ్రా ముందుండి విపత్తు సహాయక చర్యలను కూడా పర్యవేక్షిస్తుంది.
ఏర్పాటైన కొద్ది రోజుల్లోనే అక్రమార్కుల గుండెళ్లో రైళ్లు పరుగెత్తే విధంగా చేయడంలో హైడ్రా సఫలమైంది. మరోవైపు హైదరాబాద్లో కీలకమైన 100 చెరువుల్లో ఆక్రమణలు తొలిగించి సుందరీకరణ చేసి పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తోంది. ఎన్ఆర్ఎస్ఏ( నేషనల్ రిమోట్ సెన్సింగ్ తీసిన ఫొటోలు, మ్యాప్లతో సహాయంతో వాస్తవ విస్తీర్ణాన్ని గుర్తించి నిక్షిప్తం చేసేందుకు హైడ్రా ప్రయత్నిస్తోంది.
హైడ్రాతో సర్వే ఆఫ్ ఇండియా - ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను గుర్తించేందుకు భారీ కసరత్తు