Hydra Commissioner Statement on N Convention Demolition : ప్రముఖ సినీనటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేత రాష్ట్ర రాజధానిలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కూడా ఈ కూల్చివేతలపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై సమగ్ర వివరణ ఇచ్చారు.
తుమ్మిడికుంట చెరువులోని ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలోని ఆక్రమణలను హైడ్రా, జీహెచ్ఎంసీ, టౌన్ ప్లానింగ్, ఇరిగినేషన్, రెవెన్యూ శాఖ అధికారులు తొలగించినట్లు పేర్కొన్నారు. తొలగించిన అనేక నిర్మాణాల్లో అనధికారిక నిర్మాణంగా ఉన్న ఎన్ కన్వెన్షన్ ఒకటని రంగనాథ్ తెలిపారు. 2014లో హెచ్ఎండీఏ తుమ్మిడికుంట చెరువు పూర్తి స్థాయి నీటి మట్టం, బఫర్ జోన్లకు సంబంధించి ప్రాథమిక నోటిఫికేషన్ ఇచ్చిందని, 2016లో తుది నోటీఫికేషన్ జారీ చేసిందని తెలిపారు.
2014లో ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేశాక ఎన్ కన్వెన్షన్ యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించినట్లు పేర్కొన్నారు. ఎఫ్టీఎల్ నిర్ధారణకు సంబంధించి చట్టబద్దమైన ప్రక్రియను అనుసరించాలని హైకోర్టు ఎన్ కన్వెన్షన్‌ను ఆదేశించిందని, ఆ ప్రకారం ఎన్ కన్వెన్షన్ యాజమాన్యం సమక్షంలోనే ఎఫ్టీఎల్ సర్వే జరిగినట్లు తెలిపారు. ఆ సర్వే నివేదికపై 2017లో ఎన్ కన్వెన్షన్ మియాపూర్ అదనపు జిల్లా కోర్టును ఆశ్రయించిందని, ఆ కేసు కోర్టులో పెండింగ్‌లో ఉందే తప్ప ఎలాంటి స్టే ఇవ్వలేదన్నారు.
ఎన్ కన్వెన్షన్ కబ్జాలో 3.30 ఎకరాలు స్వాహా : అదేవిధంగా ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో నిర్మించిన అనధికారిక నిర్మాణాల ద్వారా ఎన్ కన్వెన్షన్ వ్యవస్థను తారుమారు చేసి వాణిజ్య కార్యకలాపాలను కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఎఫ్టీఎల్ పరిధిలో 1 ఎకరా 12 గుంటలు, బఫర్ జోన్ లో 2 ఎకరాల 18 గుంటలు ఆక్రమించి అనధికారిక నిర్మాణాలు చేపట్టారని, వాటికి జీహెచ్ఎంసీ నుంచి ఎలాంటి భవన నిర్మాణ అనుమతులు లేవని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. భవన నిర్మాణ అనుమతుల కోసం ప్రయత్నించగా అధికారులు తిరస్కరించారని వివరించారు.
తుమ్మిడికుంట చెరువు ఆక్రమణల వల్ల నీటి నిల్వ సామర్థ్యం 50 నుంచి 60 శాతం మేర కుంచించుకుపోవడంతో దిగువ ప్రాంతాలు నిత్యం భారీ వర్షాల వల్ల ముంపునకు గురవుతున్నాయన్నారు. దిగువ, మధ్య తరగతి ప్రజల ఇళ్లలోకి వరద నీరు చేరి తీవ్ర ఆస్తినష్టం వాటిల్లుతుందన్నారు. ఈ విషయాలను పరిగణలోకి తీసుకొని నిబంధనల ప్రకారం తుమ్మిడికుంట చెరువులోని అనధికారిక నిర్మాణాలను పూర్తిగా కూల్చివేసినట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు.
శాటిలైట్ ఫొటోల ద్వారా ఆక్రమణలు గుర్తిస్తున్నాం : ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పందించారు. హస్తిన పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడారు. చెరువులు ఆక్రమణకు గురికాకూడదనే హైడ్రా ఏర్పాటు చేశామన్న భట్టి, హైడ్రాను ప్రజలందరూ ఆహ్వానిస్తున్నారని తెలిపారు. ప్రతి పనికి నోటీసులు ఇచ్చాక చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. నేరుగా చెరువులో కట్టిన నిర్మాణాలను కూల్చేస్తున్నారని వ్యాఖ్యానించారు. పదేళ్లలో చెరువుల ఆక్రమణపై శాటిలైట్ ఫొటోల ద్వారా గుర్తిస్తున్నామన్న ఉప ముఖ్యమంత్రి, విభజనకు ముందు, తర్వాత చెరువుల ఆక్రమణలు గుర్తించి, ఆ వివరాలు ప్రజలముందుంచుతామని వెల్లడించారు. ప్రజల ఆస్తులు కాపాడటం ప్రభుత్వ బాధ్యతని భట్టి విక్రమార్క తెలిపారు.
ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలు ఆపాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు - HC On N Convention Demolition