Yuva on Young Man who setup Country Chicken Co in Hyderabad : సాధారణంగా ఇంజినీరింగ్ చేసిన ప్రతి పట్టభద్రుడు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేయాలని, అదీ ఆకర్షణీయమైన వేతనం పొందుతూ సుఖమయమైన జీవితం గడపాలని కోరుకుంటారు. కానీ, అందుకు భిన్నంగా తన మిత్రుడితో కలిసి ఓ ఐఐటీ పట్టభద్రుడు దేశీవాళీ కోళ్ల పెంపకం వైపు దృష్టి సారించాడు. తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకించి హైదరాబాద్ మహానగరంలో వినియోగదారులకు నాణ్యమైన కోడి మాంసం అందించాలని లక్ష్యంగా ఓ అంకుర కేంద్రం నెలకొల్పాడు.
కరోనా నేపథ్యంలో నేర్పిన పాఠాల స్ఫూర్తితో ప్రకృతి ఒడిలో సహజసిద్ధంగా పెంచిన నాటు కోడి మాంసం, గుడ్లు విక్రయించేందుకు 2021 ఏప్రిల్‌లో "కంట్రీ చికెన్ కో" పేరిట నాటు కోళ్ల వ్యాపారం మొదలుపెట్టాడు. అనతికాలంలో అద్భుత విజయం తన ఖాతాలో వేసుకున్నాడు. మారుతున్న ఆహారపు అలవాట్లు, అభిరుచుల దృష్టిలో పెట్టుకుని టెండర్ కట్ చికెన్, కోడి గుడ్లు, స్మెల్‌లెస్ మీట్ ముక్క ఏ సైజులో కావాలన్నా కట్ చేసి ఇస్తారు.
ఇక ఒకసారి ప్రొటీన్ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కొనాల్సిందే. ఒకసారి దేశవాళీ కోడి మాంసం తింటే ఇక వదలరు. తమకంటూ ఓ మోడల్ సృష్టించడం ద్వారా 5 ఔట్‌లెట్లు దిగ్విజయంగా నడుస్తుండగా ఆన్‌లైన్‌లో సైతం పెద్దఎత్తున విక్రయాలు సాగిస్తున్నాడు. మాదాపూర్‌లో కార్పొరేట్ కార్యాలయంతోపాటు ఔట్‌లెట్లు, ఇతర క్షేత్రస్థాయి సిబ్బంది 80 పైగా యువతకు ఉపాధి కల్పిస్తున్నాడు.
'మొదట ఈ రెండు ఏళ్లలో మా ప్రణాళికలు ఎప్పకప్పుడు మార్పులు చేసుకుంటూ కస్టమర్‌కు బెటర్ సర్వీస్ ఇస్తూ ఎన్నో రకాలుగా ప్రయోగాలు చేశాం. గత ఆరు నెలలుగా కంట్రీ చికెన్ కో యాప్ ద్వారా కస్టమర్లు ఆర్డర్ చేస్తున్నారు. -- సాయికేష్‌గౌడ్, కంట్రీ చికెన్ కో వ్యవస్థాపకుడు
వ్యాపారం విస్తరించేందుకు ప్రణాళికలు : తాజాగా జంట నగరవాసుల సౌకర్యార్థం చికెన్, మటన్ పచ్చళ్లు, అమ్మ చేతి మార్నెట్ పరిచయం చేయడంతో వినియోగదారుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఈ ఏడాది 16 కోట్ల రూపాయల లావాదేవీలు జరగ్గా వచ్చే ఆర్థిక సంవత్సరంలో 30 కోట్ల రూపాయల టర్నోవర్ సాధించేందుకు కృషి చేస్తుండటం ప్రత్యేకత సంతరించుకుంది. త్వరలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాల్లో తమ వ్యాపారం విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నామని, దేశవాళీ కోడి మాంసం, ఉత్పత్తుల విక్రయాల్లో తాను మార్కెట్ కింగ్ అవుతానంటున్నారు కంట్రీ చికెన్ కో స్టాటప్ వ్యవస్థాపకుడు, సీఈఓ గొడిశల సాయికేష్‌గౌడ్.