Hyderabad RRR Project Works Updates : హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు ఆవల నిర్మించే రీజినల్ రింగ్ రోడ్డు కోసం అటవీ భూసేకరణ కథ మళ్లీ మొదటికి వచ్చింది. ఓఆర్‌ఆర్ వెలుపల రెండు భాగాలుగా 347.84 కిలోమీటర్ల మేర ఈ రహదారిని నిర్మించనున్న విషయం తెలిసిందే. అయితే సకాలంలో వివరాలు ఇవ్వకపోవటంతో మునుపటి ప్రతిపాదనల దరఖాస్తు రద్దయినట్లు తెలుస్తోంది. ప్రాంతీయ రింగ్ రోడ్డు దక్షిణ భాగంలోని కొంత నర్సాపూర్ రిజర్వ్ ఫారెస్ట్ నుంచి వెళ్లేలా ఎలైన్‌మెంట్‌ను రూపొందించారు. దక్షిణ భాగాన్ని చౌటుప్పల్-ఆమనగల్లు-షాద్‌నగర్-సంగారెడ్డి మీదుగా సుమారు 186 కిలోమీటర్ల మేర నిర్మించాల్సి ఉంది.
తెరపైకి నర్సాపూర్ అటవీ భూసేకరణ అంశం : రిజర్వ్ ఫారెస్ట్ భూమిని సేకరించేందుకు కేంద్ర, రాష్ట్ర అటవీ శాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంది. దీనికి సంబంధించి అధికారులు అర్జీ సమర్పించినప్పటికీ అది తిరస్కరణకు గురైంది. ఈ లోపు దరఖాస్తు గడువు తీరిపోయిందని తెలుస్తోంది. శుక్రవారం నాడు రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సాపూర్ అటవీ భూసేకరణ అంశం తెరపైకి వచ్చింది.
Telangana Regional Ring Road : భారత్‌మాల-2 ప్రాజెక్టులో తెలంగాణ ఆర్ఆర్ఆర్
మరోసారి దరఖాస్తు చేయాల్సిందే : మెదక్ జిల్లా నర్సాపూర్ రిజర్వ్ అటవీ ప్రాంతంలోని 79 హెక్టార్ల భూమిని ప్రాంతీయ రింగ్ రోడ్డు కోసం సేకరించాల్సి ఉంది. శివంపేట, తూప్రాన్, నర్సాపూర్ మండలాల పరిధిలోని రిజర్వ్ ఫారెస్ట్ నుంచి రీజనల్ రింగ్ రోడ్డును నిర్మించాలని అధికారులు ఎలైన్‌మెంట్‌ను రూపొందించారు. ఆ ప్రతిపాదనలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుమతి లభించింది. ఈ క్రమంలోనే భూసేకరణ కోసం అటవీ శాఖకు రెవెన్యూ అధికారులు 2023 మార్చి నెలలో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేశారు. క్షేత్రస్థాయి పరిశీలన చేసిన అటవీ శాఖ అధికారులు ఇచ్చిన ప్రతిపాదనల్లో వివరాలు సమగ్రంగా లేవని గుర్తించి మరోసారి అప్‌లోడ్ చేయాలని రెవెన్యూ శాఖకు తెలిపినట్లు తెలుస్తోంది.
Regional Ring Road in Telangana : అటవీ శాఖ నిబంధనల మేరకు 90 రోజుల వ్యవధిలో వివరాలు అప్‌లోడ్ చేయని పక్షంలో 91వ రోజు అర్జీ రద్దవుతుంది. అటవీ భూమి కోసం మరో దఫా దరఖాస్తు చేయాల్సి ఉంటుందని ఉన్నతాధికారి ఒకరు వివరించారు. సేకరించాల్సిన భూమి రిజర్వ్ ఫారెస్ట్‌కు సంబంధించినది కావటంతో రాష్ట్ర అటవీ శాఖతోపాటు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ నుంచి కూడా అనుమతి తీసుకోవాల్సి ఉంది. ఈ ప్రక్రియ మళ్లీ మొదటికి రావటంతో భూసేకరణ మరింత ఆలస్యమవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలి : సీఎం రేవంత్ రెడ్డి