Huge Response to Prajadarbar Conducted by Nara Lokesh: మంగళగిరి నియోజకవర్గ ప్రజలకోసం మంత్రి నారా లోకేశ్ ప్రారంభించిన ప్రజాదర్బార్‌కు అనూహ్య స్పందన లభిస్తోంది. ఈ కార్యక్రమం కేవలం మంగళగిరి ప్రజల కోసం నిర్వహిస్తున్నప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి యువనేతకు సమస్యలు చెప్పుకుంటున్నారు. తెల్లవారుజామునుంచే ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు నివాసం వద్ద పెద్దఎత్తున జనం బారులు తీరుతున్నారు. ఎటువంటి ఆంక్షలు లేకుండా ప్రజలు నేరుగా లోకేశ్‌ను కలిసి తమ సమస్యలు చెప్పుకుంటున్నారు.
రోజరోజుకు ప్రజలనుంచి వస్తున్న స్పందన నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు భావిస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి ఎంతమంది వచ్చినా ఓపిగ్గా వారినుంచి వినతులు స్వీకరిస్తూ యువనేత లోకేశ్ భరోసా ఇస్తున్నారు. తమదృష్టికి వచ్చిన సమస్యలను సంబంధిత శాఖలకు పంపి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశాలు ఇస్తున్నారు.
ఈ రోజు నిర్వహించిన ప్రజాదర్బార్‌లో పెద్దఎత్తున వినతులు వెల్లువెత్తాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా భూకబ్జాలకు పాల్పడ్డారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను తమ పేరుపై అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దీంతో పలువురు బాధితులు నారా లోకేశ్‌ను కలిసి తమ కష్టాలను ఏకరువు పెట్టుకున్నారు.
వైసీపీ బాధితుల సమస్యలను విన్న యువనేత తక్షణమే స్పందించి సదరు ఫిర్యాదులను సంబంధిత శాఖకు పంపి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తన కుమార్తెకు కల్యాణమస్తు పథకం కింద ఆర్థికసాయం అందించాలని తాడేపల్లికి చెందిన గోలి వెంకట భావనా రుషి కోరారు.
అనారోగ్యంతో బాధపడుతున్న తనకు ఇటీవల శస్త్రచికిత్స నిర్వహించారని, ఇందుకు అయిన ఖర్చును సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజురూ చేయించి ఆదుకోవాలని బాపట్ల జిల్లా నల్లూరి పాలెంకు చెందిన కృష్ణమోహన్ విన్నవించారు. రాష్ట్రవ్యాప్తంగా 3600 మద్యం దుకాణాల్లో ఔట్ సోర్సింగ్ కింద పనిచేస్తున్న 12వేల మందికి ఆయా ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగం కల్పించి ఆదుకోవాలని ఏపీ స్టేట్ బేవరేజెస్ కార్పోరేషన్ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.