Cash Found in 7 Boxes 7 crore in Overturned Tata Ace Vehicle : తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లి వద్ద టాటా ఏస్ వాహనంలో తరలిస్తున్న 7కోట్ల రూపాయలను పోలీసులు పట్టుకున్నారు. విజయవాడ వైపు నుంచి విశాఖ వెళ్తున్న టాటా ఏస్ వాహనాన్ని లారీ ఢీకొట్టింది. బోల్తాపడిన టాటా ఏస్ వాహనంలో 7 అట్టపెట్టెల్లో నగదు గుర్తించారు. కెమికల్ పౌడర్ బస్తాల మధ్య నగదు తరలిస్తున్నారు. ఈ వాహనం హైదరాబాద్ నుంచి ద్వారపూడి వెళ్తున్నట్లు గుర్తించారు. ప్రమాదంలో వ్యాను డ్రైవర్ వీరభద్రరావుకు స్వల్పంగా గాయాలయ్యాయి.
బాక్సుల్లో డబ్బులు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు నగదును వీరవల్లి టోల్ ప్లాజా వద్దకు తీసుకెళ్లారు. వీరవల్లి టోల్ ప్లాజా వద్దకు ఫ్లయింగ్ స్క్వాడ్ వెళ్లి నగదును లెక్కించారు. 7 అట్టపెట్టెల్లో మొత్తం 7 కోట్ల రూపాయలు ఉన్నట్లు డీఎస్పీ రామారావు తెలిపారు. హైదరాబాద్‌లోని నాచారం రసాయన పరిశ్రమ నుంచి మండపేటలోని మాధవి నూనె మిల్లుకు నగదు తరలిస్తున్నారని చెప్పారు. నగదును ఆదాయపన్ను శాఖకు అప్పగించామన్నారు.