High Court Orders to Change Schedule of AP DSC TET Exam: ఉపాధ్యాయ అర్హత పరీక్ష, ఉపాధ్యాయ నియామక పరీక్షలను హడావుడిగా నిర్వహిస్తున్న జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఏపీ టెట్ పరీక్ష చివరి తేదీ నుంచి ఏపీ టీఆర్‌టీ పరీక్ష ప్రారంభానికి మధ్యలో కనీసం 4 వారాల సమయం ఉండాలని ఉన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది.
ఈ మేరకు షెడ్యూల్ మార్చాలని పేర్కొంది. ప్రాథమిక కీ ప్రచురణ అనంతరం అభ్యంతరాల స్వీకరణ, వాటి పరిష్కారం, తుది కీ ప్రచురణ విషయంలో ఎక్కువ సమయం ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అభ్యంతరాల స్వీకరణకు కనీసం వారం గడువు ఉండాలని స్పష్టం చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం టెట్, టీఆర్టీ నోటిఫికేషన్లలో ఇచ్చిన గడువు చాలా తక్కువగా ఉందని హైకోర్టు పేర్కొంది. రాజ్యాంగం ప్రసాధించిన హక్కుల ప్రకారం పరీక్షలకు తగిన సమయం అవసరమని స్పష్టం చేసింది. పిటిషనర్లు ఎస్జీటీ(SGT) పోస్టులను ఆశిస్తున్న అభ్యర్థులు అయినందున న్యాయస్థానం ప్రస్తుతం ఇచ్చిన ఉత్తర్వులు, ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ విషయంలోనే వర్తిస్తాయని స్పష్టతనిచ్చింది.
గందరగోళం ఎక్కువ-సమయం తక్కువ! ఏపీ సర్కార్ జారీ చేసిన టెట్ నోటిఫికేషన్‌పై అభ్యర్థుల్లో ఆందోళన!
టెట్, టీఆర్‌టీ పరీక్షల విషయంలో ప్రాథమిక కీ జారీ దగ్గర నుంచి అభ్యంతరాల స్వీకరణ, వాటి పరిష్కారం, తదనంతరం జారీచేసే తుది కీ ప్రక్రియకు ప్రభుత్వం నిర్ణయించిన సమయం అత్యంత తక్కువగా ఉందని ఇది అభ్యర్థులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని న్యాయస్థానం అభిప్రాయపడింది.
ప్రస్తుత నోటిఫికేషన్ విషయంలో అధికారులు గతంలో మాదిరి షెడ్యూల్‌ను ఇచ్చి ఉండాల్సిందని హైకోర్టు అభిప్రాయపడింది. ప్రతి దశలోనూ సమయాన్ని కుదిస్తూ అధికారులు షెడ్యూల్‌ను ఎందుకు ఇచ్చారో తమకు అర్థం కావడంలేదంది. ఇలాంటి చర్య పరీక్షల నిర్వహణ ఉద్దేశాన్ని నిష్ఫలం చేస్తుందని తెలిపింది. 2018 తర్వాత తాజాగా 2024లో డీఎస్సీ ప్రకటన చేశారని, చక్కటి షెడ్యూల్ ప్రకటించేందుకు అధికారులకు ఐదేళ్ల సమయం దొరికినప్పటికీ షెడ్యూల్‌ను కుదించి పరీక్ష నిర్వహణ ఉద్దేశాన్ని దెబ్బతీశారని తెలిపింది.
టెట్, టీఆర్టీని ప్రభుత్వం హడావుడిగా నిర్వహిస్తున్నట్లు కనిపిస్తోంది: హైకోర్టు
కోర్టు ఆదేశించిన మేరకు షెడ్యూల్ మార్చేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి స్పష్టంచేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్ ఈమేరకు తీర్పు ఇచ్చారు. నిరుద్యోగ జేఏసీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. న్యాయస్థానం తీర్పుని పూర్తిగా స్వాగతిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన టెట్, టీఆర్‌టీ నోటిఫికేషన్లను సవాలు చేస్తూ శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎం. పెద్దిరాజు మరో నలుగురు హైకోర్టులో వ్యాజ్యం వేశారు.
పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది బీ.ఆదినారాయణరావు, న్యాయవాది జవ్వాజి శరత్‌చంద్ర వాదనలు వినిపించారు. సిలబస్ ఎక్కువ ఉండటం వల్ల పరీక్షలకు సిద్ధపడేందుకు తగిన సమయం లేకపోవడంతో అభ్యర్థులు ఒత్తిడికి గురవుతున్నారన్నారు. ప్రభుత్వ న్యాయవాది వీకే నాయుడు వాదనలు వినిపిస్తూ తగిన సమయం ఇచ్చామన్నారు. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం ఇటీవల తీర్పును రిజర్వు చేసింది. సోమవారం తీర్పును వెల్లడిస్తూ ఏపీ టెట్ పరీక్ష చివరి తేది నుంచి ఏపీ టీఆర్‌టీ పరీక్ష ప్రారంభానికి మధ్యలో కనీసం నాలుగు వారాల సమయం ఉండాలని తేల్చిచెప్పింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అభ్యర్థుల విజయమని న్యాయవాది జడ శ్రావణ్‌కుమార్ అన్నారు.
"స్పెషల్ డీఎస్సీ ద్వారా ప్రత్యేక ఉద్యోగాలు లేనప్పుడు - టెట్ 1బీ, 2బీ ఎందుకు నిర్వహించారు"