High Court Grants Anticipatory Bail to Ram Gopal Varma: సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యవహారంలో వివిధ ఠాణాల్లో నమోదైన కేసులలో సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మకు హైకోర్టు షరతులతో ముందస్తు బెయిలు మంజూరు చేసింది. దర్యాప్తునకు సహకరించాలని, పోలీసులు కోరినప్పుడు విచారణకు అందుబాటులో ఉండాలని వర్మకు స్పష్టం చేసింది.
ప్రకాశం జిల్లా మద్దిపాడు, గుంటూరు జిల్లా తుళ్లూరు, అనకాపల్లి జిల్లా రావికమతం ఠాణాల స్టేషన్ హౌజ్ ఆఫీసర్ల సంతృప్తి మేరకు రూ.10 వేలతో రెండు పూచీకత్తులు సమర్పించాలని రాంగోపాల్ వర్మను ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్. హరినాథ్ ఈ మేరకు తీర్పు ఇచ్చారు. పీపీ స్పందిస్తూ రాంగోపాల్ వర్మ నోటీసులకు స్పందించడం లేదని, దర్యాప్తునకు సహకరించడం లేదని కోర్టు దృష్టికి తెచ్చారు. న్యాయమూర్తి స్పందిస్తూ కోర్టు ఆదేశాలకు కట్టుబడి వ్యవహరించకపోతే బెయిలు రద్దు కోసం చట్టనిబంధనల మేరకు పోలీసులు చర్యలు తీసుకోవచ్చని వ్యాఖ్యానించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, నారా లోకేశ్, తదితరులపై సామాజిక మాధ్యమంలో అసభ్యకర, అభ్యంతర పోస్టులు పెట్టిన వ్యవహారంపై ప్రకాశం జిల్లా మద్దిపాడు, గుంటూరు జిల్లా తుళ్లూరు, అనకాపల్లి జిల్లా రావికమతం ఠాణాల్లో తనపై నమోదు చేసిన కేసులలో ముందస్తు బెయిలు మంజూరు చేయాలంటూ సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ హైకోర్టును ఆశ్రయించారు. ఇరువైపు వాదనలు విన్న న్యాయమూర్తి పిటిషనర్‌కు ముందస్తు బెయిలు మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చారు.