Heavy Rains in Uttarandra District : ఉత్తరాంధ్రను భారీ వర్షాలు ఉక్కిబిక్కిరి చేస్తున్నాయి. వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న వానలకు వాగులు ఉరకలు వేస్తున్నాయి. గెడ్డలు పొంగి పొర్లుతున్నాయి. జలాశయాలు నిండుకుండల్లా మారుతున్నాయి. రహదారులు తెగిపోయి, వేల ఎకరాల్లో పంటలు మునిగిపోయి తీరని నష్టాలు మిగిల్చుతున్నాయి.
వేలాది ఎకరాల్లో నీట మునిగిన పంటలు : అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం కొత్త ఎల్లవరం సమీపంలో పాలగెడ్డ పోటెత్తుతోంది. కొత్త ఎల్లవరానికి ఇతర ప్రాంతాలతో రవాణా ఆగిపోయింది. ఏలేరు కాలువ పొంగి అనకాపల్లి - విశాఖపట్నం జాతీయ రహదారి కొప్పాక వద్ద దెబ్బతింది. వాహనాలను దారి మళ్లించారు. అనకాపల్లి జిల్లా బొజ్జన్న కొండ వద్ద ఏలేరు కాలువ, పులికాట్ వాగు పంట పొలాల్ని ముంచెంత్తాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనకాపల్లి మండలం శంకరంలో నీట మునిగి పంట పొలాలను బీజేపీ ఎంపీ సీఎం రమేష్ పరిశీలించారు. లక్ష్మీపురంలో నీట మునిగిన పంట పొలాలను స్థానిక ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు పరిశీలించారు. మోకాళ్లోతు నీళ్లలో వెళ్లి రైతులతో మాట్లాడారు.
ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు- జలాశయాలకు పోటెత్తిన వరద - Heavy rains in Uttarandhra
నిండుకుండలా తాండవ జలాశయం : అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో తాండవ జలాశయం నిండుకుండలా మారింది. రెండు గేట్లు ఎత్తారు. తాండవ జలాశయం పరివాహక ప్రాంతాల్నిహోం మంత్రి అనిత అప్రమత్తం చేశారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని అదేశించారు. సభాపతి అయ్యన్నపాత్రుడి కుమారుడు, నర్సీపట్నం పురపాలక సంఘం కౌన్సిలర్ రాజేష్ కూడా రిజర్వాయర్‌ను పరిశీలించారు.
రిజర్వాయర్ పరివాహకంలో ప్రభుత్వం అప్రమత్తం : విశాఖ జిల్లాలో వర్షాలకు నిండుకుండలా మారిన మేఘాద్రి గెడ్డ రిజర్వాయర్ పరివాహకంలో ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది. మేఘాద్రిగెడ్డతోపాటు గోపాలపట్నంలోని పలు ప్రాంతాలను కలెక్టర్, ఎమ్మెల్యే గణబాబు, ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు రిజర్వాయర్‌ని పరిశీలించారు. విశాఖ జిల్లా పద్మనాభం మండలం బుడ్డివలసలో పాడుబడిన ఎలిమెంటరీ స్కూల్ భవనాన్ని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కూల్చివేయించారు. వర్షాలకు నానిన ఆ భవనం కూలితే పక్కనే తరగతి గదిలో ఉన్న పిల్లలకు ప్రమాదం జరిగే అవకాశం ఉందని భావించి అప్పటికప్పుడు జేసీబీ తెప్పించి పడగొట్టించారు.
పంటనష్టం అంచనా : విజయనగరం జిల్లా సాయన్న గెడ్డ పొంగింది. రేగిడి, సంతకవిటి మండలాల్లో ముంపునకు గురైన వందలాది ఎకరాలను ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ పరిశీలించారు. పంటనష్టం అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో వందలాది ఎకరాల్లో పత్తి పంట దెబ్బతింది. పత్తికాయలు నల్లగా మారిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సాలూరు మండలం సొంపిగాం వెళ్లేందుకు వాగుపై ఏర్పాటు చేసిన తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోయింది. గ్రామస్థులు పీకల్లోతు నీటిలో నడుస్తూ వెళ్లి సరకులు తెచ్చుకోవాల్సి వస్తోంది.