Heavy Rains in Rayalaseema Updates : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం రాయలసీమ జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఉమ్మడి చిత్తూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో వానలతో రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. విద్యాసంస్థలకు అధికారులు సెలవులు ప్రకటించారు. తిరుమలలో రెండో రోజూ ఎడతెరిపిలేని వర్షంతో భక్తులకు ఇక్కట్లు తప్పలేదు.
వాయుగుండం ప్రభావంతో వైఎస్సార్ జిల్లావ్యాప్తంగా విస్తారంగా వానలు కురుస్తున్నాయి. కడప జలదిగ్బంధమైంది. ఎడతెరిపిలేని వర్షాలకు రహదారులన్నీ నీటితో నిండిపోయాయి. కోటిరెడ్డి సర్కిల్ నుంచి అంబేడ్కర్ సర్కిల్ వరకు, కోర్టు ఎదురుగా, ఆర్.ఎం. కార్యాలయం వద్ద రహదారులన్నీ జలమయమయ్యాయి. రోడ్లపై నీటిని అధికారులు యంత్రాల ద్వారా బయటికి తరలించే ప్రయత్నం చేశారు. అనేక కాలనీల్లోకి, లోతట్టు ప్రాంతాల్లోకి వరద చేరింది. కడప ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణమంతా మోకాళ్లలోతు నీటితో నిండిపోవడంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
జలమయమైన రహదారులు : వైఎస్సార్ జిల్లావ్యాప్తంగా ఎడతెరిపిలేని వర్షాలు పడుతుండగా జిల్లాలోని విద్యాసంస్థలకు కలెక్టర్ సెలవు ప్రకటించారు. కమలాపురంలో రోడ్లన్నీ జలమయమయ్యాయ. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ వరద చేరింది. పులివెందుల నియోజకవర్గంలో ఏకధాటిగా కురిసిన వానకి డ్రైనేజీలు పొంగి రోడ్లపై ప్రవహించాయి. వరి, అరటి, శనగ పంటలకు నష్టం వాటిల్లిందని రైతులు వాపోయారు. ఒంటిమిట్ట, పోరుమామిళ్ల, వేంపల్లె, కడప మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. పోరుమామిళ్లలో 90 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జమ్మలముడుగు నియోజకవర్గంలోనూ జోరువానలు కురిశాయి. గండికోట జలాయశం నుంచి మైలవరానికి, అక్కడి నుంచి నాలుగేట్ల ద్వారా పెన్నా నదికి నీటిని విడుదల చేశారు.
పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు : అన్నమయ్య జిల్లాలోని 30 మండలాల్లో భారీ వర్షం కురిసింది. ప్రధానంగా రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. రైల్వే కోడూరు సమీపంలో గుంజునేరు ఉద్ధృతితో నరసరాంపేట, ధర్మాపురం వాసులు ఆందోళన చెందుతున్నారు. నందలూరు, పెనగలూరు చిట్వేలి, కోడూరు, మదనపల్లె, మండలాల్లో భారీ వర్షం కురిసింది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రాయచోటి, మదనపల్లి, పీలేరు నియోజకవర్గాల్లోనూ ఎడతెరిపిలేని వానలతో జనజీవనం స్తంభించింది. రాజంపేటలో రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. రాజంపేట, రాయచోటి, మదనపల్లి పురపాలికలలో మురుగునీటి కాలువలు పొంగిపొర్లాయి. అన్నమయ్య జిల్లా కలెక్టర్ డ్రోన్ టెక్నాలజీ ఉపయోగించి చెరువుల గట్లు పరిశీలించి అధికారులకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తిరుమలలో రెండో రోజూ వర్షం దంచికొట్టింది. పాపవినాశనం, ఆకాశగంగ, శ్రీవారి పాదాలు, శిలాతోరణం వెళ్లే మార్గాల్లో భక్తుల వాహన రాకపోకలను నిలిపివేశారు. రెండో కనుమదారిలో రెండు, మూడుచోట్ల బండ రాళ్లు స్వల్పంగా రోడ్డుపైకి జారిపడగా వాటిని వెంటనే ఘాట్ రోడ్డు సిబ్బంది తొలగించి ట్రాఫిక్ క్రమబద్ధీకరించారు. శ్రీవారి సన్నిధిలో చలితీవ్రత అధికంగా పెరిగింది. వర్షంతో శ్రీవారి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లడ్డూ విక్రయ కేంద్రాలకు, గదులకు వెళ్లే భక్తులు టీటీడీ ఏర్పాటు చేసిన షెడ్ల వద్ద తలదాచుకుంటున్నారు. తిరుపతి నగరంలోనూ జోరువాన కురిసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భారీ వర్షం కారణంగా శ్రీవారి మెట్టు మార్గాన్ని తాత్కాలింగా మూసివేశారు. చిత్తూరు జిల్లావ్యాప్తంగానూ వర్షాలు పడ్డాయి.
Heavy Rains in AP : అనంతపురంలో ఎడతెరిపిలేని వానలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నడిమి వంక ప్రాంతంలో కాలువకు నీరు చేరుతోంది. ఉరవకొండ నియోజకవర్గ వ్యాప్తంగా వర్షం కురిసింది. గుత్తి పట్టణం చెర్లోపల్లి కాలనీలో ఓ ఇంటి పైకప్పు కూలింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. క్షేత్రస్థాయి అధికారులను అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లు ఆదేశించారు.
బంగాళాఖాతంలో వాయుగుండం ఎఫెక్ట్ - తిరుపతిలో భారీ వర్షాలు - స్తంభించిన జనజీవనం
ముంచుకొచ్చిన వాయుగుండం - అతి భారీ వర్ష సూచన - వెనక్కి వచ్చిన 61,756 మంది మత్స్యకారులు