Heavy Rains In Nellore District Today Weather Report : నెల్లూరు జిల్లాలో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. 38 మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. జలదంకిలో బుధవారం రాత్రి 8 గంటల వరకు 42.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కావలిలో 38.8 సెంటీమీటర్లు, నెల్లూరు రూరల్ 29.5, నెల్లూరు అర్బన్ 29.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పలుచోట్ల వాగులు ఉద్ధృతంగా ప్రవహించి రోడ్లపైకి వస్తున్నాయి. రోడ్లు జలమయం అయ్యాయి. పలుచోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధం కావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
కొన్నిచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. అనంతసాగరం మండలం కచేరి దేవరాయపల్లికి ఒక పక్క పెన్నా నది, మరోపక్క కేతమన్నేరు వాగు చుట్టుముట్టాయి. గ్రామంలోని ఇద్దరు మహిళలకు పురిటి నొప్పులు రావడంతో అధికారులు వారిద్దరినీ జేసీబీ సాయంతో కేతామన్నేరు వాగు దాటించి అక్కడి నుంచి 108 వాహనంలో ఆత్మకూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సూళ్లూరుపేట నియోజకవర్గంలోని పలు మండలాల్లో కురిసిన వర్షానకి రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
దంచికొడుతున్న వానలు- జలదిగ్భంధంలో రహదారులు
జిల్లాలో మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు అన్నదాతల ఆశలపై నీళ్లు చల్లాయి. చేజర్ల ,విడవలూరు, జలదంకి ,కొడవలూరు, సీతారాంపురం, అనంతసాగరం, కలిగిరి మండలాల్లోని వరి పంట, పొగాకు నారు మడులు పూర్తిగా మునిగిపోయాయి. పచ్చిమిర్చి, పూలతోటల పంటకు భారీ నష్టం వాటిల్లింది. మరో రెండు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇంకా వాన పడితే పూర్తిగా నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కావలిలోని వైకుంఠపురం సమీపంలో ఉన్న రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి వద్ద నీటి ప్రవాహం రాకపోకలు ఇబ్బంది కలిగిస్తోంది. నీటి ప్రవాహాన్ని అధికారులతో కలిసి స్థానిక ఎమ్మెల్యే డీవీ కృష్ణారెడ్డి పరిశీలించారు. మద్దూరుపాడు టిడ్కో నివాసాల వద్ద రోడ్లపైకి చేరిన నీటి ఎద్దడిని పరిశీలించి స్థానికుల ఇబ్బందులను తెలుసుకున్నారు. ఆ తర్వాత బాలకృష్ణ రెడ్డి నగర్‌లోని పునరావాస కేంద్రంలోని బాధితులను పరామర్శించారు.\
"భారీ వర్షాల ఎఫెక్ట్" తిరుమల ఘాట్రోడ్డులో విరిగిపడిన కొండచరియలు - తిరుపతి విమానం దారి మళ్లింపు