Heavy Rains in Kurnool District : కర్నూలు జిల్లాలో కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కర్నూలులో కురిసిన భారీ వర్షానికి గార్గేయపురం చెరువు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో సమీపంలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. కర్నూలు సమీపంలోని వెంకాయపల్లి, నూతనపల్లి, నందవరం, మిలిటరీ కాలనీ, లక్ష్మీనగర్, భూపాల్ నగర్ లోని పలు కాలనీల్లోకి భారీగా వర్షపు నీరు చేరింది. దీంతో కాలనీవాసులు తీవ్రఇబ్బందులు పడుతున్నారు.
స్థానిక వెంకాయపల్లె ఎల్లమ్మ దేవాలయంలోకి వర్షపు నీరు చేరింది. తరచూ ముంపుతో కష్టాలు పడుతున్నామని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంట్లోకి వర్షం నీరు చేరడంతో బియ్యం పాటు తదితర నిత్యవసర వస్తువులు తడిచిపోయాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై పాలకులు, అధికారులకు ఎన్ని సార్లు విన్నవించుకున్న ఎలాంటి ఫలితం లేదని వాపోయారు. తమ ప్రాంతంలో ముంపు నివారణకు చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. నగర వద్ద చెరువు పొంగిపొర్లుతుంది. పంట పొలాల్లోకి వరద చేరి రైతులు నష్టపోయారు.
నంద్యాల జిల్లా కురిసిన భారీ వర్షం కారణంగా ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురయ్యింది. బనగానపల్లెతో పాటు పలు మండల్లో కురిసిన భారీ వర్షానికి పాలేరు వాగు పొంగి ప్రవహిస్తుంది. 4 అడుగుల మేర వంతెనపై వరద నీరు ప్రవహిస్తుండడంతో కోయిలకుంట్ల డిపోకు చెందిన బస్సు వరద నీటిలో చిక్కుకుంది. బస్సులో దాదాపుగా 25 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. బస్సు వంతెన పైనుంచి వాగులోకి ఒకవైపు ఒరిగింది. ప్రమాదాన్ని గుర్తించిన ఆర్టీసీ డ్రైవర్ బస్సును నిలిపివేశారు. ప్రయాణికులను బస్సులో నుంచి క్షేమంగా కిందికి దిగారు. పాలేరు వాగు వంతెనపై వర్షపు నీరు ప్రవహిస్తుండంతో సంజామల తిమ్మనేనిపేట రహదారిలో రాకపోకలు నిలిచిపోయాయి.